ఇటీవల విదేశాంగ మంత్రిత్వ శాఖ చేసిన ఒక ప్రకటన దేశవ్యాప్తంగా సరికొత్త చాలా మందిని గందరగోళానికి గురిచేస్తోంది. పాస్‌పోర్ట్ అనేది కేవలం ఒక ప్రయాణ పత్రం మాత్రమేనని.. అది భారత పౌరసత్వానికి రుజువు కాదని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. 14వ పాస్‌పోర్ట్ సేవా దివస్ సందర్భంగా ఒక సీనియర్ అధికారి చేసిన ఈ వ్యాఖ్యలు, అలాగే గతంలో ఓటరు జాబితా సవరణల సమయంలో కేవలం ఆధార్ కార్డును పౌరసత్వ నిరూపణకు ప్రామాణికంగా తీసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో.. అసలు భారతదేశంలో పౌరసత్వాన్ని నిరూపించే డాక్యుమెంట్స్ ఏవి? అనే అంశంపై సాధారణ ప్రజల్లో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ అంశంపై పూర్తి క్లారిటీ కోసం ప్రభుత్వ నిబంధనలు, చట్టాల ఆధారంగా రూపొందించిన ముఖ్యమైన ప్రశ్నలు-జవాబులు(FAQs) ఇక్కడ చూద్దాం:
ప్రశ్న: ఒక వ్యక్తికి భారత పౌరసత్వం ఎలా లభిస్తుంది?
జవాబు: సిటిజన్‌షిప్ యాక్ట్ 1955 ప్రకారం, భారతదేశంలో పౌరసత్వాన్ని 5 పద్ధతులలో పొందవచ్చు:
1. పుట్టుక ద్వారా
2. వంశపారంపర్యంగా/వారసత్వంగా
3. రిజిస్ట్రేషన్ ద్వారా
4. సహజసిద్ధంగా/నేచురలైజేషన్ ద్వారా
5. ఏదైనా కొత్త భూభాగాన్ని భారతదేశంలో విలీనం చేయడం ద్వారా
ప్రశ్న: భారత పౌరసత్వాన్ని నిరూపించడానికి దేశంలో ఏదైనా ఒకే ఒక్క ప్రత్యేక డాక్యుమెంట్ ఉందా?
జవాబు: లేదు. భారతదేశంలో పౌరులందరికీ వర్తించేలా, పౌరసత్వాన్ని ఖచ్చితంగా నిరూపించే ఏ ఒక్క నిర్దిష్ట పత్రం లేదా కార్డ్ లేదు. ఒక వ్యక్తి పౌరసత్వాన్ని ఎలా పొందాడు అనేదానిపై, దానికి సంబంధించిన రికార్డులపైనే పౌరసత్వ నిర్ధారణ ఆధారపడి ఉంటుంది.
ప్రశ్న: భారత పౌరసత్వానికి ప్రత్యక్ష ఆధారంగా దేన్ని పరిగణిస్తారు?
జవాబు: రిజిస్ట్రేషన్ లేదా నేచురలైజేషన్ పద్ధతుల ద్వారా భారత పౌరసత్వాన్ని పొందిన వారికి ప్రభుత్వం అధికారికంగా 'పౌరసత్వ ధృవీకరణ పత్రం' జారీ చేస్తుంది. ఇది పౌరసత్వానికి ప్రత్యక్ష రుజువుగా పనిచేస్తుంది.
ALSO READ : 1967 పాస్ పోర్ట్ చట్టం ఏం చెబుతోంది
ప్రశ్న: మరి దేశంలోని ప్రతి పౌరుడికీ ఈ 'సిటిజన్‌షిప్ సర్టిఫికేట్' ఉంటుందా?
జవాబు: ఉండదు. పుట్టుకతో లేదా వారసత్వంగా భారత పౌరసత్వం పొందిన మెజారిటీ భారతీయుల వద్ద ఈ పౌరసత్వ ధృవీకరణ పత్రం ఉండదు. ఎందుకంటే వారు దీన్ని ప్రత్యేకంగా తీసుకోవాల్సిన అవసరం రాలేదు కాబట్టి.
ప్రశ్న: పుట్టుకతో పౌరులైన వారు తమ పౌరసత్వాన్ని ఎలా నిరూపించుకోవాలి?
జవాబు: సిటిజన్‌షిప్ సర్టిఫికేట్ లేని వారు తమ పుట్టిన తేదీ, పుట్టిన స్థలం, తల్లిదండ్రుల వివరాలు, వారి జాతీయతను తెలిపే పత్రాల ద్వారా పౌరసత్వాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. అందుకోసం క్రింది పత్రాలు ఉపయోగపడతాయి:
1. బర్త్ సర్టిఫికెట్
2. తల్లిదండ్రుల పౌరసత్వ ధృవీకరణ పత్రాలు
3. తల్లిదండ్రులు భారత పౌరులని నిరూపించే రికార్డులు లేదా వారి భారతీయ పాస్‌పోర్ట్‌లు
4. పుట్టుక, వారసత్వం, జాతీయతకు సంబంధించిన ఇతర ప్రభుత్వ రికార్డులు
ప్రశ్న: పౌరసత్వానికి సంబంధించిన దరఖాస్తుల్లో భారతీయ పాస్‌పోర్ట్‌ను వాడవచ్చా?
జవాబు: అవును వాడవచ్చు. కేంద్ర హోం శాఖ నిబంధనల ప్రకారం.. భారత పౌరుల జీవిత భాగస్వాములు, పిల్లలు లేదా తల్లిదండ్రులకు సంబంధించిన పౌరసత్వ దరఖాస్తుల ప్రక్రియలో భారతీయ పాస్‌పోర్ట్‌లను, సిటిజన్‌షిప్ సర్టిఫికేట్లను పౌరసత్వ ఆధారాలుగా అంగీకరిస్తారు.
ప్రశ్న: ఆధార్ కార్డ్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్‌లు పౌరసత్వానికి రుజువులు కాదా?
జవాబు: కావు. ఆధార్ కార్డ్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్ వంటివి కేవలం ఒక వ్యక్తికి సంబంధించిన గుర్తింపు, నివాసం, ఓటు హక్కు, డ్రైవింగ్ అర్హతలను మాత్రమే ధృవీకరిస్తాయి. చట్ట ప్రకారం వీటిని పౌరసత్వానికి పూర్తి స్థాయి నిర్ధారణకు అవసరమైన డాక్యుమెంట్లుగా పరిగణించబడవు.
ప్రశ్న: ఈ డాక్యుమెంట్స్ పౌరసత్వాన్ని ఎందుకు ఆటోమెటిక్‌గా నిరూపించలేవు?
జవాబు: ఎందుకంటే ఈ పత్రాలు నిర్దిష్ట సేవల కోసం జారీ చేయబడినవి. ఉదాహరణకు పాస్‌పోర్ట్ యాక్ట్ 1967 లోని సెక్షన్ 20 ప్రకారం.. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం భారత పౌరులు కాని వారికి కూడా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో పాస్‌పోర్ట్, ట్రావెల్ డాక్యుమెంట్‌ను జారీ చేసే అధికారం కలిగి ఉంది. అందుకే కేవలం ఒక పత్రాన్ని బట్టి పౌరసత్వాన్ని ప్రాథమికంగా నిర్ధారించలేరు. అది కేవలం పౌరసత్వ చట్టం రూల్స్ ప్రకారమే నిర్ణయించబడుతుంది.
