1967 పాస్ పోర్ట్ చట్టం ఏం చెబుతోంది.. ఇన్నాళ్లు పాస్ పోర్ట్ అంటే పౌరసత్వం అనే భావన ఎందుకు ఉంది..?

1967 పాస్ పోర్ట్ చట్టం ఏం చెబుతోంది.. ఇన్నాళ్లు పాస్ పోర్ట్ అంటే పౌరసత్వం అనే భావన ఎందుకు ఉంది..?

మనలో చాలామంది పాస్‌పోర్ట్ ఉంటే అది భారత పౌరసత్వానికి (సిటిజన్‌షిప్) అధికారిక గుర్తింపు అని భావిస్తుంటారు. అయితే ఇటీవల విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పాస్‌పోర్ట్ అనేది కేవలం ట్రావెలింగ్ డాక్యుమెంట్ మాత్రమేనని, అది పౌరసత్వానికి చట్టపరమైన రుజువు కాదని  చెప్పడంతో దేశపౌరులలో ఆందోళన, గందరగోళాన్ని రేకెత్తించింది. దీంతో 1967 పాస్‌పోర్ట్ చట్టం అసలు ఏమి చెబుతోంది? ఇన్నాళ్లు పాస్‌పోర్ట్‌ను పౌరసత్వానికి అధికారిక గుర్తింపుగా ఎందుకు భావించారు? అనే చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది.

మన దేశంలో పాస్‌పోర్ట్‌లు 1967 పాస్‌పోర్ట్ చట్టం కింద జారీ చేస్తారు. ఈ చట్టం ప్రకారం.. భారతీయులు ,ఇతర వ్యక్తుల విదేశీ ప్రయాణాల నియంత్రణకోసం రూపొందించబడింది. అయితే పౌరసత్వానికి(సిటిజన్ షిప్) సంబంధించిన అంశాలు 1955 పౌరసత్వ చట్టం పరిధిలోకి వస్తాయి. అంటే పాస్‌పోర్ట్ చట్టం, పౌరసత్వ చట్టం రెండు వేర్వేరు చట్టపరమైన వ్యవస్థలు.

1967 పాస్‌పోర్ట్ చట్టంలోని సెక్షన్ 20 ప్రకారం, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా అవసరమైతే కేంద్ర ప్రభుత్వం భారత పౌరుడు కాని వ్యక్తికీ పాస్‌పోర్ట్ లేదా ప్రత్యేక ప్రయాణ పత్రాన్ని జారీ చేయవచ్చు. ఈ నిబంధనే పాస్‌పోర్ట్‌ను పౌరసత్వానికి సంపూర్ణ, తుది గుర్తింపుగా పరిగణించలేమని సూచిస్తోంది.

అదే విధంగా చట్టంలోని సెక్షన్ 6 ప్రకారం, ఒక వ్యక్తి భారత పౌరుడు కాకపోవడం మాత్రమే కాకుండా, పెండింగ్ క్రిమినల్ కేసులు, కోర్టు ఆదేశాలు, భద్రతా కారణాలు వంటి ఇతర అంశాల ఆధారంగానూ పాస్‌పోర్ట్‌ను తిరస్కరించవచ్చు. దీంతో పాస్‌పోర్ట్ జారీ ప్రక్రియ పౌరసత్వ నిర్ధారణ కంటే పరిపాలనా అంశాలతో ముడిపడి ఉందని స్పష్టమవుతోంది.

అయితే, పాస్‌పోర్ట్‌ను పౌరసత్వానికి గుర్తింపుగా భావించడం వెనుక బలమైన కారణాలున్నాయి. పాస్‌పోర్ట్ జారీకి ముందు ప్రభుత్వం పోలీసు ధృవీకరణ, పత్రాల పరిశీలన వంటి కఠినమైన ప్రక్రియను నిర్వహిస్తుంది. అదే విధంగా భారత కేంద్ర ప్రభుత్వం పేరుతో జారీ అయ్యే అధికారిక డాక్యుమెంట్లలో ఇది ఒకటి. ఈ క్రమంలోనే ప్రపంచ దేశాలు దీనిని భారతీయ జాతీయతకు నమ్మదగిన ఆధారంగా స్వీకరిస్తున్నాయి.

ALSO READ : అసలు పౌరసత్వాన్ని నిరూపించే పత్రాలేవి?

అందుకే సాధారణంగా పాస్‌పోర్ట్ భారతీయ పౌరసత్వానికి బలమైన సాక్ష్యంగా పరిగణించబడుతున్నప్పటికీ.. అధికారిక న్యాయ వివాదాల్లో మాత్రం 1955 పౌరసత్వ చట్టం ప్రకారం ఇతర ప్రాథమిక పత్రాలు, ఆధారాలే కీలకమవుతాయి. అంటే.. పాస్‌పోర్ట్ పౌరసత్వాన్ని సూచించే ముఖ్యమైన పత్రం అయినప్పటికీ.. చట్టపరంగా అది పౌరసత్వానికి గుర్తింపుగా ఉండదు.