బంగ్లాపై గ్రాండ్ విక్టరీ.. వరల్డ్ కప్ సెమీస్ రేసులో టీమిండియా

బంగ్లాపై గ్రాండ్ విక్టరీ.. వరల్డ్ కప్ సెమీస్ రేసులో టీమిండియా
  •     బంగ్లాపై 5 వికెట్ల తేడాతో 
  • మహిళా జట్టు గ్రాండ్ విక్టరీ
  •     షఫాలీ హాఫ్ సెంచరీ..
  • బంతితో రాధా యాదవ్ మ్యాజిక్
  •     ఆస్ట్రేలియాపై గెలిస్తేనే భారత్ సెమీస్‌‌కు
  •     సెమీస్ పోరులో ఇప్పటికే ఆసీస్ ముందంజ.. బంగ్లా ఔట్

న్యూఢిల్లీ: టీ 20 వరల్డ్ కప్‎లో భారత మహిళా జట్టు సెమీస్ ఆశలని నిలబెట్టుకున్నది. గురువారం బంగ్లాదేశ్‌‌పై తాడేపేడో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌‌లో ఘన విజయం సాధించింది. మాంచెస్టర్‌‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌‌లో బంగ్లాదేశ్‌‌ విధించిన137 పరుగుల టార్గెట్‎ను అలవోకగా ఛేదించింది. ఓపెనర్ షఫాలీ వర్మ (53) హాఫ్ సెంచరీతో రాణించింది. 

ఆమెకు తోడుగా రోడ్రిగ్స్‌‌ (26), భాటియా (23) కీలక ఇన్నింగ్స్‌‌ ఆడటంతో మరో 19 బాల్స్ మిగిలుండగానే 5 వికెట్ల తేడాతో టీమిండియా టార్గెట్‌‎ను పూర్తి చేసింది. ఈ విజయంతో భారత్ సెమీస్ రేసులో నిలిచింది. టాస్ నెగ్గి మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన భారత్‌‌కు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

మూడో ఓవర్‌‌ లాస్ట్ బాల్‎కు మరుఫా అక్తర్‌‌ బౌలింగ్‌‌లో భారీ షాట్‌‌కు ప్రయత్నించి స్మృతి మంధాన (8) రబేయా ఖాన్‌‌కు క్యాచ్‌‌ ఇచ్చి పెవిలియన్‌‌కు చేరింది. ఫస్ట్ డౌన్‌‌లో వచ్చిన భాటియాతో కలిసి మరో ఓపెనర్‌‌ షెఫాలీ వర్మ ఇన్నింగ్స్‌‌ చక్కదిద్దింది. ఈ క్రమంలోనే షెఫాలీ వర్మ అర్ధ శతకం సాధించింది. ఆ వెంటనే షెఫాలీ (53;34 బంతుల్లో 8×4, 6×1) నహిదా అక్తర్‌‌ బౌలింగ్ లో స్టంపౌటయ్యింది. 

అనంతరం రిఛా ఘోష్‌‌ క్రీజులోకి వచ్చింది. 12వ ఓవర్‌‌ తొలి బంతికి భారీ షాట్‌‌కు ప్రయత్నించి భాటియా (23) పెవిలియన్‌‌కు చేరగా.. తర్వాతి ఓవర్లోనే రబేయా ఖాన్‌‌ బౌలింగ్‌‌లో రిచా ఘోష్‌‌ (10) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగింది.

ఓ వైపు వికెట్లు కోల్పోతున్నప్పటికీ టార్గెట్ తక్కువగా ఉండటంతో  గెలుపుపై టీమ్ ఇండియా ధీమాతో కనిపించింది. చివరలో క్రీజులోకి వచ్చిన హర్మన్‌‌ (13*), దీప్తి శర్మ (5*) లక్ష్యాన్ని పూర్తి చేశారు. బంగ్లా బౌలర్లలో రితూ మోని 2 వికెట్లు పడగొట్టగా.. మరుఫా, రబేయా, నహిదా తలో వికెట్‌‌ తీశారు.

బంతితో మెరిసిన రాధ, చరణీ

టోర్నమెంట్‌‌లో తొలిసారిగా బరిలోకి దిగిన భారత పేసర్ రేణుకా ఠాకూర్ తన తొలి ఓవర్‌‌లోనే దిలారా అక్తర్‌‌ను అవుట్ చేసి బంగ్లాను దెబ్బకొట్టింది. ఆ తర్వాత ఫెర్దౌస్, శోభనా మోస్టరీ (22) జోడి, కెప్టెన్ నిగర్ సుల్తానా (32) బాధ్యతాయుత ఇన్నింగ్స్‌‌తో బంగ్లాదేశ్‌‌ను ఆదుకునే ప్రయత్నం చేసినప్పటికీ.. భారత స్పిన్నర్లు మ్యాచ్‌‌ను మళ్లీ తమ చేతుల్లోకి తీసుకున్నారు. ముఖ్యంగా స్పిన్నర్ రాధా యాదవ్ 3/28తో కెరీర్ బెస్ట్ ప్రదర్శన చేయడమే కాకుండా.. కీలక దశలో మోస్టరీ, నిగర్ వికెట్లను తీసి బంగ్లా పతనాన్ని శాసించింది.

మరోవైపు ప్రపంచ నంబర్ 1 టీ20 బౌలర్ శ్రీ చరణీ తన అద్భుత ఫామ్‌‌ను కొనసాగిస్తూ చివరి ఓవర్‌‌లో కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు (2/21) పడగొట్టడంతో బంగ్లాదేశ్ తక్కువ స్కోర్‎కు పరిమితమైంది. ఈ మ్యాచ్‌‌లో భారత జట్టు ఫీల్డింగ్‌‌లో కొన్ని తప్పులు చేసినప్పటికీ, క్రమశిక్షణతో కూడిన బౌలింగ్, పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ అండతో విజయం సాధించి సెమీస్ రేసులోకి దూసుకెళ్లింది.

ప్రస్తుత పరిస్థితి ఇలా..

టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్ రేసు ఆసక్తికరంగా మారింది. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఆస్ట్రేలియా దాదాపు సెమీఫైనల్ బెర్త్‌‌ను ఖరారు చేసుకుంది. మరోవైపు, బంగ్లాను ఓడించి భారత్ సెమీస్ రేసులో నిలిచింది. తన తదుపరి మ్యాచ్‌‌ల్లో గెలిచి తన గ్రూప్​లో టాప్-2లోకి దూసుకెళ్లాలని టీమిండియా పట్టుదలగా ఉంది. 

దక్షిణాఫ్రికా సైతం అద్భుత ప్రదర్శనతో గట్టి పోటీ ఇస్తూ సెమీస్ స్థానం కోసం ముందంజలో ఉంది. అయితే, వరుస ఓటములతో బంగ్లాదేశ్ పరిస్థితి మాత్రం దారుణంగా తయారైంది. ఆ జట్టు సెమీస్ అవకాశాలు దాదాపు కష్టంగా మారాయి. పిచ్‌‌పై పోరు తీవ్రమవడంతో, ఏ రెండు జట్లు సెమీస్‌‌కు చేరుకుంటాయోననే ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది.

భారత్‌‌ సెమీస్‌‌కు వెళ్లాలంటే..

మహిళల టీ20 ప్రపంచ కప్‌‌లో భారత మహిళా జట్టు సెమీఫైనల్ చేరడానికి ఉన్న సమీకరణాలు ఉత్కంఠభరితంగా మారాయి. టీమిండియా తన తదుపరి మ్యాచ్‌‌(ఈ నెల 28న)లో ఆస్ట్రేలియాపై విజయం సాధిస్తే నేరుగా సెమీస్‌‌కు చేరుకుంటుంది. ఒకవేళ ఆస్ట్రేలియాతో జరిగే చివరి మ్యాచ్‌‌లో భారత్ ఓడిపోతే.. గ్రూప్‌‌లోని మరో బలమైన జట్టు దక్షిణాఫ్రికా ఆడే మ్యాచ్‌‌ల ఫలితాలపై ఆధారపడాల్సి వస్తుంది.

ఒకే గ్రూప్‌‌లోని జట్లు సమాన పాయింట్లతో నిలిస్తే, సెమీస్ బెర్త్‌‌ను ఖరారు చేయడంలో జట్ల 'నెట్ రన్‌‌రేట్' అత్యంత కీలకం కానుంది. అందువల్ల టీమిండియా ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించి, రన్‌‌రేట్‌‌ను మెరుగుపరుచుకుని దర్జాగా సెమీఫైనల్‌‌కు దూసుకెళ్లాలని పట్టుదలగా ఉంది.