హైదరాబాద్, వెలుగు: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియలో భాగంగా ఓటరు గణన ఫారాలను తెలుగుతోపాటు ఇతర భాషల్లో ఎందుకు పంపిణీ చేయడం లేదో వివరణ ఇవ్వాలంటూ ఎన్నికల సంఘానికి(ఈసీ) హైకోర్టు గురువారం ఆదేశాలు జారీ చేసింది. ఓటు హక్కు రాజ్యాంగబద్ధంగా సంక్రమించినదని, కేవలం భాష కారణంగా ఎవరూ హక్కును కోల్పోరాదని స్పష్టం చేసింది. ‘సర్’ ఫారాలను తెలుగులో అందుబాటులో ఉంచకుండా కేవలం ఇంగ్లిషులో ఉన్నవే పంపిణీ చేయడాన్ని సవాల్ చేస్తూ కరీంనగర్‌కు చెందిన సామాజిక కార్యకర్త ఎం. ముజీబ్ అయూబ్ హైకోర్టులో పిటిషన్ వేశారు.
దీనిని జస్టిస్ పుల్లా కార్తీక్ గురువారం విచారణ చేప ట్టారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది వి. రఘునాథ్ వాదనలు వినిపిస్తూ.. రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో ఉన్న ఓటర్ల మాతృభాష తెలుగు కాదని అందరికీ తెలిసిన విషయమేనని తెలిపారు. వలస కార్మి కులు, వృత్తి నిపుణులు, విద్యార్థులు, వ్యాపారవేత్తలు పెద్దసంఖ్యలో ఓటర్లు ఉన్నారని చెప్పారు. మైనారిటీలను ఓటర్ల జాబితా నుంచి తొలగించడానికి జరుగుతున్న కుట్రగా పేర్కొన్నారు.
ఈసీ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకు న్నట్టు వివరించారు. అన్ని పార్టీలతో మాట్లాడిన తరువాత జీహెచ్‌ఎంసీలో ఇంగ్లిష్, రాష్ట్ర వ్యాప్తంగా తెలుగులో పంపిణీ చేయాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. రాష్ట్రంలో సుమారు 3.5 కోట్ల ఓటర్లకు సంబంధించి సర్ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. తెలుగు ఫారాల ముద్రణ పూర్తయిందని, అన్ని భాషల్లో ముద్రించడానికి భారీ వ్యయంతో పాటు ఇతర సమస్యలున్నాయన్నారు. ఆన్‌లైన్‌లో ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూలో ఉన్నాయని తెలిపారు.
బూత్ లెవల్ ఎన్యుమరేటర్లు ఇంటింటికీ వెళ్లే సమయంలో ఇంగ్లీష్ నమూనాలను కూడా తీసుకెళుతున్నారని, ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. వాదనలను విన్న న్యాయమూర్తి.. ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయన్న వాదన సరికాదని, తెలుగుతోపాటు ఇతర భాషల్లో ఫారాలు పంపిణీ చేయడంపై వివరణ ఇవ్వాలంటూ విచారణను వారానికి వాయిదా వేశారు.
