కాంగ్రెస్‌‌వి ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలు : కేంద్ర మంత్రి జేపీ నడ్డా 

కాంగ్రెస్‌‌వి ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలు : కేంద్ర మంత్రి జేపీ నడ్డా 

పాట్నా: రాజ్యాంగం గురించి మాట్లాడుతున్న కాంగ్రెస్ నేతలు ప్రజాస్వామ్య వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఆరోపించారు. ‘సంవిధాన్ హత్య దివస్’ సందర్భంగా పాట్నాలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాజ్యాంగ ప్రతులను చేతిలో పట్టుకుని తిరుగుతున్న రాహుల్‌‌ గాంధీ, ప్రియాంకా గాంధీ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే ముందు.. వాళ్ల అమ్మమ్మ తీసుకున్న చర్యలకు దేశానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌‌ చేశారు. ఎమర్జెన్సీ కాలంలో ఇందిరాగాంధీ సర్కారు ప్రాథమిక హక్కులను హరించిందని, వ్యక్తిగత స్వేచ్ఛలను అణిచివేసిందని ఆరోపించారు.

కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి ప్రజాస్వామ్యాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే వాడుకుంటున్నాయన్నారు. వాళ్ల రాజకీయ ఆలోచనా విధానం ప్రజాస్వామ్య వ్యతిరేకమని విమర్శించారు. మాజీ ప్రధాని జవహర్‌‌‌‌ లాల్‌‌ నెహ్రూ ఎనిమిది సార్లు రాష్ట్రపతి పాలన విధించారని, ఇందిరా గాంధీ దాదాపు 50 సార్లు ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేశారని నడ్డా ఆరోపించారు. ఎమర్జెన్సీ టైంలో ఎలాంటి విచారణ లేకుండానే 1.31 లక్షల మందిని జైళ్లలో పెట్టారని, కోటికి పైగా మందికి బలవంతపు కుటుంబ నియంత్రణ స్టెరిలైజేషన్‌‌లు జరిగాయని ఆరోపించారు. ఢిల్లీలో 1.5 లక్షల ఇండ్లు కూల్చారని మండిపడ్డారు.