కోదాడ, వెలుగు : 'జనం కోసం, మంచి కోసం పని చేసేవారే సమాజానికి ఆదర్శం, కమ్మ కులస్తులు సమాజంలో మంచి కోసం కృషి చేయాలి' అని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని దుర్గాపురం వై జంక్షన్ వద్ద కొత్తగా కట్టిన కల్యాణమండపాన్ని గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను పదవీ విరమణ చేశానే గానీ పెదవి విరమణ చేయలేదన్నారు.
మంచి పనులు చేయడం, సేవా కార్యక్రమాలు నిర్వహించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని చెప్పారు. ఎవరికైనా తన కులం పట్ల అభిమానం ఉండొచ్చు కానీ.. కులపిచ్చి ఉండకూడదని చెప్పారు. రాజకీయాల్లో ఉన్నవారు తక్కువ మాట్లాడి ఎక్కువ పని చేయాలని సూచించారు. వ్యవసాయ శాఖమంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి మాట్లాడుతూ కాకతీయ సేవా సమితి ఆధ్వర్యంలో కల్యాణ మండపం నిర్మించడం, సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు.
అనంతరం ప్రతిభ కలిగిన విద్యార్థులకు వెంకయ్య నాయుడు చేతుల మీదుగా నగదు పురస్కారాలు అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ యెర్నేని కుసుమ, ఎమ్మెల్సీ తాత మధు, మాజీమంత్రి వీరేపల్లి లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు, డీసీసీబీ మాజీ చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు, రావెళ్ల సీతారామయ్య పాల్గొన్నారు.
