నాగ్‌పూర్: మహారాష్ట్రలోని నాగ్‌పూర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం గురువారం అధికారికంగా జీఎంఆర్ గ్రూప్ కంట్రోల్లోకి వచ్చింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు సమక్షంలో ఈ అప్పగింత ప్రక్రియ పూర్తయింది. ఈ భాగస్వామ్యంతో నాగ్‌పూర్ విమానాశ్రయాన్ని ప్రపంచస్థాయి సదుపాయాలతో అప్‌గ్రేడ్ చేయనున్నారు.
ఈ ఏడాది మేలో జరిగిన కేంద్ర కేబినెట్ ఆమోదం ప్రకారం.. ఈ విమానాశ్రయ నిర్వహణ బాధ్యతలను 30 ఏళ్ల కాలపరిమితికి గాను జీఎంఆర్ నాగ్‌పూర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్‌కు అప్పగించారు. ఈ ఎయిర్‌పోర్ట్ విస్తరణ పనులు దశలవారీగా జరుగుతాయి. పనులు పూర్తయితే ఏటా 3 కోట్ల మంది ప్రయాణికుల సామర్థ్యాన్ని తట్టుకోగలదు. ఇందులో కొత్త టెర్మినల్స్, ఆధునిక రన్‌వేలు, అత్యాధునిక సాంకేతికతను ఏర్పాటు చేస్తారు. మల్టీ-మోడల్ ఇంటర్నేషనల్ కార్గో హబ్‌ను కూడా డెవలప్ చేస్తారు. దీంతో నాగ్‌పూర్ సెంట్రల్ ఇండియాలోనే అతిపెద్ద లాజిస్టిక్స్, పారిశ్రామిక కేంద్రంగా మారనుంది.
