టీవీవీపీలో పోస్టింగుల కోసం ఎదురుచూపు..ఆలస్యం అవుతున్న డాక్టర్లు, నర్సుల నియామకం

 టీవీవీపీలో పోస్టింగుల కోసం ఎదురుచూపు..ఆలస్యం అవుతున్న డాక్టర్లు, నర్సుల నియామకం
  • 692 మంది సీఏఎస్, 330 మంది నర్సింగ్ ఆఫీసర్లకు గతంలోనే అపాయింట్మెంట్​ ఆర్డర్లు
  • నెలలు గడుస్తున్నా ఇవ్వని పోస్టింగ్ ఆర్డర్లు.. కౌన్సిలింగ్ కోసం వెయిటింగ్
  • సీజనల్​ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో వెంటనే భర్తీ చేయాలనే డిమాండ్​

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో అత్యంత కీలకమైన తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) పరిధిలో రిక్రూట్‌‌‌‌మెంట్ ప్రాసెస్ నెమ్మదించింది. అపాయింట్‌‌‌‌మెంట్ లెటర్లు అందుకున్న దాదాపు 612 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లు (సీఏఎస్), 330 మందికి పైగా నర్సింగ్ ఆఫీసర్లు పోస్టింగ్ ఆర్డర్ల కోసం ఎదురుచూస్తున్నారు.

వరల్డ్ హెల్త్ డే సందర్భంగా హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహ చేతుల మీదుగా డాక్టర్లకు అపాయింట్‌‌‌‌మెంట్ లెటర్లు అందించినప్పటికీ, నేటికీ కౌన్సిలింగ్ నిర్వహించలేదు. పోస్టింగ్ ఆర్డర్లు ఎప్పుడు వస్తాయో తెలియక, ఎక్కడ డ్యూటీలో చేరాలో అర్థం కాక వందలాది మంది అభ్యర్థులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.

ఇతర విభాగాలైన డీఎంఈ, డీహెచ్‌‌‌‌లలో నర్సింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామక ప్రక్రియ స్పీడ్‌‌‌‌గా సాగుతుంటే, టీవీవీపీలో మాత్రం ముందుకు పోవడంలేదనే విమర్శలు వస్తున్నాయి. కాగా, గత టీవీవీపీ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ మే 31న రిటైర్ అయ్యారు. ప్రస్తుతం హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జెడ్ చోంగ్తూ ఇన్​చార్జి కమిషనర్‌‌‌‌గా ఉన్నప్పటికీ, ఆమెకు ఇప్పటికే సెక్రటేరియెట్ బాధ్యతలు, బదిలీల ప్రక్రియతో తీవ్రమైన వర్క్ ప్రెజర్ ఉంటోంది. దీంతో రెగ్యులర్ కమిషనర్‌‌‌‌ను నియమించాలనే డిమాండ్స్ వినిపిస్తున్నాయి.

భర్తీ చేస్తే మెరుగైన సేవలు..

మరోవైపు వర్షాకాలం స్టార్ట్ కావడంతో రాష్ట్రవ్యాప్తంగా సీజనల్ వ్యాధులు విజృంభించే అవకాశం ఉంది. ఇలాంటి టైమ్‌‌‌‌లో గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రజలకు పెద్దదిక్కుగా ఉండే కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు (సీహెచ్సీలు), ఏరియా హాస్పిటల్స్‌‌‌‌లో డాక్టర్లు, నర్సుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. అపాయింట్‌‌‌‌మెంట్ లెటర్లు పొందిన 900 మందికి పైగా స్టాఫ్‌‌‌‌కు తక్షణమే పోస్టింగ్‌‌‌‌లు ఇస్తే, హాస్పిటల్స్‌‌‌‌లో పేషెంట్లకు మెరుగైన సేవలు అందే చాన్స్ ఉంటుంది.

కొత్త కమిషనర్ నియామకం కోసం 10 మంది సీనియర్లతో కూడిన లిస్ట్‌‌‌‌ను మినిస్టర్ దామోదర ఆధ్వర్యంలో ఇప్పటికే సీఎంవోకు పంపించారు. కానీ అక్కడి నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాకపోవడం గమనార్హం. సీనియారిటీ ప్రాతిపదికనే వెంటనే కొత్త కమిషనర్‌‌‌‌ను నియమించాలని డాక్టర్ల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 184 హాస్పిటల్స్, 12 వేల బెడ్ల కెపాసిటీ ఉన్న ఈ సిస్టమ్‌‌‌‌కు రెగ్యులర్ కమిషనర్ అవసరమని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పూర్తిస్థాయి కమిషనర్‌‌‌‌ను కేటాయించి, నిలిచిపోయిన పోస్టింగ్ ఆర్డర్లను వెంటనే రిలీజ్ చేయాలని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.