అయోధ్య రామమందిర విరాళాల గోల్ మాల్ కేసులో 8 మంది అరెస్ట్

అయోధ్య రామమందిర విరాళాల గోల్ మాల్ కేసులో 8 మంది అరెస్ట్

లక్నో: అయోధ్య రామ మందిర విరాళాల దుర్వినియోగం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎనిమిది మందిని ఉత్తర ప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు వీరిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తోన్నట్లు సమాచారం. నిందితుల్లో శ్రీరామ్ జన్మభూమి ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ సన్నిహితుడు రామశంకర్ యాదవ్ అలియాస్ టిన్ను యాదవ్ కూడా ఉన్నారు. అనుకల్ప్ మిశ్రా, అవినాష్ శుక్లా, కరుణేష్ పాండే, లవ్ కుష్ మిశ్రా, రామశంకర్ మిశ్రా, సుభాష్ శ్రీవాస్తవ ఇతర నిందితులు.

 ఈ ఎనిమిది మంది విరాళాల లెక్కింపు ప్రక్రియలో పాలుపంచుకున్నట్లు పోలీసులు గుర్తించారు. కాగా, అయోధ్య రామ మందిర విరాళాల దుర్వినియోగం, నిధుల గోల్ మాల్‎పై భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్లు 306, 316(5), 317(4), 317(5), 61 మరియు 3(5) కింద ఎనిమిది మందిపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఒక రోజు తర్వాత పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. రాబోయే రోజుల్లో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని పోలీస్ వర్గాలు వెల్లడించాయి. 

వివాదం ఏంటంటే..?

అయోధ్య రామ మందిర విరాళాల దుర్వినియోగం, ట్రస్ట్ నిధుల్లో గోల్ మాల్ జరిగినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. రామ మందిర ప్రాంగణంలోని విరాళాల పెట్టెల నుంచి డబ్బు మాయమైందని ప్రతిపక్ష సమాజ్ వాదీ, కాంగ్రెస్ పార్టీలు ఆరోపించాయి. ఈ ఘటనపై విచారణ చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి.

మరోవైపు.. ఆలయ ప్రతిష్టను దెబ్బతీసే లక్ష్యంగా జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఎదుర్కోవడానికి.. వాస్తవాలను నిర్ధారించుకోవడానికి విచారణకు ఆదేశించాలని శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కూడా ప్రభుత్వాన్ని కోరింది. ప్రతిపక్షాల డిమాండ్, ట్రస్ట్ అభ్యర్థన మేరకు రామ మందిర విరాళాల వివాదంపై యోగి సర్కార్ సిట్ విచారణకు ఆదేశించింది.

ఈ మేరకు లక్నో డివిజనల్ కమిషనర్ విజయ్ విశ్వాస్ పంత్, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కిరణ్ ఎస్, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి నీల్ రతన్ ముగ్గురు సభ్యులతో కూడిన సిట్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ వివాదంపై సమగ్ర దర్యాప్తు నిర్వహించి, నివేదిక సమర్పించాలని ప్రభుత్వం సిట్‎ను ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ కేసును సీరియస్‎గా తీసుకున్న సిట్.. అయోధ్యలోని రామ మందిర ట్రస్ట్‎కు సంబంధించిన విరాళాలు, ఆర్థిక నిర్వహణపై లోతుగా విచారణ చేపట్టింది.

ఇందులో భాగంగా ఆలయ విరాళాల లెక్కింపుతో సంబంధం ఉన్న పలువురు ఉద్యోగులు, సిబ్బందిని సిట్ విచారించింది. ఆరు రోజుల పాటు పలువురిని ప్రశ్నించింది. స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG) సీసీటీవీ పుటేజ్‎తో పాటు ఇతర సాంకేతిక, భౌతిక సాక్ష్యాలను పరిశీలించింది. ఆరు రోజుల విచారణ అనంతరం కేసుకు సంబంధించిన ప్రాథమిక దర్యాప్తు నివేదికను సీఎంకు అందజేసింది సిట్. నిధుల గోల్ మాల్ వ్యవహారంలో 8 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు.