గచ్చిబౌలి AMB మాల్ ఫ్లై ఓవర్పై ఘోరం.. స్కూటీపై రాంగ్ రూట్లో.. బుల్లెట్ బైక్ కొట్టేసి ఇద్దరు స్పాట్ డెడ్

గచ్చిబౌలి AMB మాల్ ఫ్లై ఓవర్పై ఘోరం.. స్కూటీపై రాంగ్ రూట్లో.. బుల్లెట్ బైక్ కొట్టేసి ఇద్దరు స్పాట్ డెడ్

హైదరాబాద్: హైదరాబాద్ గచ్చిబౌలిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు స్పాట్లో చనిపోయారు. రాంగ్ రూట్లో వచ్చిన స్కూటీని బుల్లెట్ బైక్ ఢీ కొట్టింది. స్కూటీపై ప్రయాణిస్తున్న ఇద్దరూ తీవ్ర గాయాలపాలై స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయారు. బుల్లెట్పై ప్రయాణిస్తున్న వ్యక్తి కి స్వల్ప గాయాలయ్యాయి.

గచ్చిబౌలి AMB మాల్ ఫ్లై ఓవర్పై ఈ ఘటన జరిగింది. శుక్రవారం ఉదయం 7:30 ప్రాంతంలో గచ్చిబౌలి నుంచి హఫీజ్పేట్ వైపు వినోద్ అనే వ్యక్తి బుల్లెట్ బైక్పై వెళ్తున్నాడు. అదే సమయంలో హఫీజ్ పేట్ నుంచి గచ్చిబౌలి వైపు రాంగ్ రూట్లో AMB మాల్ ఫ్లై ఓవర్ మీదుగా శ్రీకాంత్,విట్టల్ స్కూటీపై వెళ్తున్నారు.

ఈ క్రమంలో ఒకదానికొక్కటి బలంగా ఢీ కొన్నాయి. ఈ ఘటనలో బుల్లెట్ బైక్ ఢీ కొన్న ధాటికి స్కూటీపై ప్రయాణిస్తున్న ఇద్దరూ ఎగిరిపడ్డారు. హెల్మెట్ కూడా లేకపోవడంతో స్కూటీ డ్రైవ్ చేస్తున్న వ్యక్తికి బలంగా రోడ్డు తాకడంతో తీవ్ర గాయాలై రక్రస్రావమైంది. స్కూటీపై వెనుక కూర్చున్న వ్యక్తి తలకు కూడా రోడ్డు బలంగా తగలడంతో ఇద్దరూ స్పాట్లోనే చనిపోయారు.

ఫ్లై ఓవర్పై పొద్దుపొద్దునే రక్తపు మడుగులో ఇద్దరి శవాలు కనిపించేసరికి వాహనదారులు హడలెత్తిపోయారు. బుల్లెట్పై ప్రయాణిస్తున్న వ్యక్తి కి స్వల్ప గాయాలయ్యాయి. గచ్చిబౌలి పోలీసులు ఈ ప్రమాదంపై సమాచారం అందుకొని ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహలను పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.