Khushbu Daughter: స్టార్ గెస్టులతో కళకళలాడిన ఖుష్బూ కుమార్తె పెళ్లి.. చిరు, నాగ్, వెంకీ ఒకే వేదికపై సందడి

Khushbu Daughter: స్టార్ గెస్టులతో కళకళలాడిన ఖుష్బూ కుమార్తె పెళ్లి.. చిరు, నాగ్, వెంకీ ఒకే వేదికపై సందడి

సీనియర్ నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ, దర్శకుడు సుందర్ C దంపతుల పెద్ద కుమార్తె పెళ్లి గ్రాండ్ గా జరిగింది. గోవాలో చాలా సింపుల్‌గా కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో అవంతిక సుందర్, శ్రవణ్ శ్రీనివాసన్ మూడు మూళ్ళ బంధంతో ఒక్కటయ్యారు. ఈ వివాహ వేడుకకు కేవలం 50 మంది లోపు అతిథులను మాత్రమే ఖుష్బూ ఫ్యామిలీ ఆహ్వానించినట్లు సమాచారం. అవంతికకు `క్రౌడ్ అలర్జీ` (ఎక్కువ మంది జనం ఉంటే వచ్చే ఇబ్బంది) ఉండటం వల్లే ఇలా బంధుమిత్రుల సమక్షంలో పెళ్లి జరిగినట్లు సినీ వర్గాలు వెల్లడించాయి.

చిరు, నాగ్, వెంకీ ఒకే ఫ్రేమ్‌లో..

ముఖ్యంగా ఈ వేడుకకు టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి దంపతులతో పాటుగా వెంకటేష్-నీర‌జ‌, నాగార్జున‌-అమ‌ల దంప‌తులు హాజరై సందడి చేశారు. సౌత్ స్టార్ హీరోయిన్ త్రిష సైతం కనిపించి ఆకట్టుకుంది. బాలీవుడ్ నటులు జాకీ ష్రాఫ్ మరియు అనిల్ కపూర్ హాజరయ్యారు.

ప్రస్తుతం ఈ వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ సంప్రదాయ దుస్తుల్లో కనిపించడం అభిమానులను ఆకట్టుకుంటోంది. ఖుష్బూతో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్‌లకు ఉన్న సుదీర్ఘ అనుబంధం కారణంగా వారి హాజరు ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది. తన సినీ కెరీర్‌లో ఖుష్బూ ఈ ముగ్గురు హీరోలతో కలిసి పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

కలియుగ పాండవులు చిత్రంతో వెంకటేష్, ఖుష్బూ దాదాపు ఒకే సమయంలో తమ సినీ ప్రయాణాన్ని ప్రారంభించారు. అనంతరం నాగార్జున సరసన కెప్టెన్ నాగార్జున చిత్రంలో ఖుష్బూ హీరోయిన్‌గా నటించారు. అలాగే చిరంజీవి నటించిన స్టాలిన్ చిత్రంలో ఆయన సోదరి పాత్రలో నటించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. ఇకపోతే,  ఖుష్బూ, దర్శకుడు సుందర్ C దంపతులు 2000లో వివాహం చేసుకోగా, వారికి ఇద్దరు కుమార్తెలు అవంతిక సుందర్ మరియు ఆనందిత ఉన్నారు.

వెడ్డింగ్ రిసెప్షన్..

అయితే త్వరలో చెన్నైలో భారీ స్థాయిలో వెడ్డింగ్ రిసెప్షన్ నిర్వహించేందుకు ఖుష్బూ ఫ్యామిలీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ వేడుకకు దేశ ప్రధాని నరేంద్ర మోడీతో పాటు తమిళ స్థార్ హీరో, సీఎం విజయ్ వంటి ప్రముఖులు కూడా హాజరయ్యే అవకాశముంది. 

అవంతిక, ఆనందిత కెరీర్..

అవంతిక నటిగా తన కెరీర్‌ను కొనసాగిస్తూ బిజీగా ఉంది. పెళ్లి ఏర్పాట్ల మధ్య కూడా పలు ప్రాజెక్టులకు సంతకం చేసినట్లు సమాచారం. ఇక ఆమె సోదరి ఆనందిత సినీ రంగంలో నిర్మాతగా రాణిస్తుంది. ఇటీవల ఆమె తన బరువు తగ్గిన విధానం గురించి, సెలబ్రిటీ కూతురిగా ఎదుర్కొన్న విమర్శల గురించి మాట్లాడి ఆకట్టుకుంది.