సొంతూరిలో అంత్యక్రియల కోసం భారత పౌరసత్వం కోరిన 94 ఏళ్ళ ఎన్నారై వృద్ధురాలు...

సొంతూరిలో అంత్యక్రియల కోసం భారత పౌరసత్వం కోరిన 94 ఏళ్ళ ఎన్నారై వృద్ధురాలు...

అమెరికాలో పౌరసత్వం కోసం ఏళ్ల తరబడి ప్రయత్నిస్తున్నవారు చాలామంది ఉన్నారు. గ్రీన్ కార్డు వస్తే హ్యాపీగా అమెరికాలోనే సెటిల్ అయిపోవచ్చని అనుకుంటారు చాలామంది. అలాంటిది అమెరికా పొరసత్వం వదులుకొని భారత పౌరసత్వం కావాలని ఓ 94 ఏళ్ళ ఎన్నారై వృద్ధురాలు ప్రభుత్వాన్ని కోరింది. తన అంత్యక్రియలు సొంతూరిలోనే జరపాలన్నది తన చివరి కోరిక అని.. తనకు భారత పౌరసత్వం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరింది సదరు మహిళ. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..

బాపట్ల జిల్లా చినగంజాం మండలం చింతగుంపాలకు చెందిన మహాలక్ష్మమ్మ బుధవారం ( జూన్ 24 ) జిల్లా కలెక్టర్ వెంకట మురళి ఎదుట హాజరై, తనకు భారతపౌరసత్వం కల్పించాలని కోరారు. తన పౌరసత్వ దరఖాస్తును వీలైనంత త్వరగా ప్రాసెస్ చేయాలని అభ్యర్థించారు మహాలక్ష్మమ్మ.

తన భర్త నాగభూషణం మరణానంతరం, అమెరికాలోని వర్జీనియాలో ఉన్న పీటర్స్‌బర్గ్‌ లో ఉంటున్న కొడుకు బుచ్చయ్య చౌదరి దగ్గరికి వెళ్లానని... 2000 జులైలో అమెరికా పౌరసత్వం పొందానని తెలిపారు మహాలక్ష్మమ్మ. సుమారు 18 సంవత్సరాల పాటు అమెరికాలో ఉన్నానని.. తన కొడుకు మంగళగిరిలో ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో ఉద్యోగ నిమిత్తం 2018లో ఇండియాకు వచ్చి స్థిరపడ్డాడని తెలిపింది మహాలక్ష్మమ్మ.

తన అమెరికా పౌరసత్వాన్ని వదులుకున్న ఆమె, ఇప్పుడు ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారు. తన శేషజీవితం స్వదేశంలోనే గడపాలని, తన అంత్యక్రియలు తన సొంత గ్రామంలోనే జరగాలని కోరుకుంటున్నట్లు ఆమె అధికారులకు తెలిపారు. ఆమె అభ్యర్థనకు స్పందించిన కలెక్టర్, దరఖాస్తును పరిశీలిస్తామని తెలిపారు. విచారణ పూర్తయ్యాక, రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదికను పంపుతామని, ఆ తర్వాత పౌరసత్వ పరిశీలన కోసం రాష్ట్ర ప్రభుత్వం తన సిఫార్సును కేంద్రానికి పంపుతుందని ఆయన అన్నారు.