ప్రపంచంలో కీర్తించబడుతున్న భారత ప్రజాస్వామ్యానికి పునాది ఎన్నికల ప్రక్రియ. దీన్ని ప్రాధాన్యతను గుర్తించిన భారత రాజ్యాంగ రూపకర్తలు ఎన్నికల సంఘానికి స్వయం ప్రతిపత్తి కల్పించారు. అయితే నేడు దేశంలో ఎన్నడూ లేనివిధంగా ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాలరాస్తూ ఒంటెత్తు పోకడలతో పరిపాలిస్తున్న కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం భారత ఎన్నికల సంఘాన్ని భ్రష్టు పట్టిస్తోంది.
అధికార బలంతో ఎన్నికల సంఘంపై ఒత్తిడి తెస్తూ ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేస్తోంది. దేశంలో ఇప్పటికే రెండు దశల్లో పలు రాష్ట్రాల్లో వివాదాస్పదంగా ముగిసిన ‘సర్’ ప్రక్రియ ఇప్పుడు మూదో దశలో తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభమైంది. రెండు దశల అనుభవాలను దృష్టిలో ఉంచుకొని తెలంగాణలో అర్హులైన ఓటర్లకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రజాస్వామ్యవాదులందరిపై ఉంది.
రాష్ట్రంలో 119 అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్లకు సంబంధించి ఇప్పటికే 2,28,62,322 మ్యాపింగ్ పూర్తవ్వగా, 99,64,126 ఓటర్ల మ్యాపింగ్ జరగలేదు. 2002 నాటి ఓటర్ల జాబితాతో 2025 ఓటర్ల జాబితాను పోలుస్తూ నిర్వహిస్తున్న మ్యాపింగ్‌లో దాదాపు కోటికిపైగా ఓటర్లపై సందేహాలున్నాయనడంతో అర్హులైన ఓటర్లలో తీవ్ర ఆందోళన ప్రారంభమైంది. అక్షర దోషాలు, ఇంటిపేర్లు, తల్లిదండ్రుల పేర్లు, వారి చిరునామాల్లో తేడాలు వంటి చిన్నచిన్న కారణాలతో కోటికిపైగా ఓటర్లను సందేహాస్పద జాబితాలో చేర్చడంతో ఓటు హక్కు కోల్పోతామనే భయం రాష్ట్ర ఓటర్లలో నాటుకుంది.
ఓటర్లలో ఈ రకమైన భయానికి ప్రధాన కారణం పలు రాష్ట్రాల్లో ఇప్పటికే నిర్వహించిన ‘సర్’ ప్రక్రియ వివాదాస్పదం కావడమే. అర్హులైన వారికి అన్యాయం జరగదనే భరోసా కల్పిస్తూ ‘సర్’ పారదర్శకంగా నిర్వహించడంలో రాష్ట్రంలోని మొత్తం 35,985 పోలింగ్ బూతుల పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఎన్నికల సిబ్బంది ‘బీఎల్‌ఓ’లతో పాటు రాజకీయ పార్టీల ఏజెంట్లు ‘బీఎల్‌ఏ’ల పాత్ర కీలకమైంది.
బీజేపీ ఒత్తిడిలో తొలగింపులు!
‘సర్’ పేరు చెబితేనే ఓటర్లలో భయాందోళనలు నెలకొనడానికి ప్రధాన కారణం ఎన్నికల సంఘం అధికారులపై అప్రజాస్వామ్యంతో ఒత్తిడి తెస్తున్న బీజేపీ ప్రభుత్వం, వారికి లొంగిపోయి విధులు నిర్వహిస్తున్న అధికారులు అని పలు రాష్ట్రాల్లో ఇప్పటికే రుజువైంది. ఓటర్ల జాబితాలో డూప్లికేట్, చనిపోయిన వారు, చిరునామా మారిన వారు, రెండు చోట్ల ఓట్లు ఉన్నవారు, అర్హత లేని వారి పేర్లను తొలగించడమే ‘సర్’ లక్ష్యమని ఎన్నికల సంఘం ప్రకటిస్తున్నా ఈ ప్రక్రియపై దేశ వ్యాప్తంగా ఆందోళన నెలకొంది.
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమియేతర పార్టీలను లక్ష్యంగా ‘సర్’ ప్రక్రియ జరుగుతోందనేది వాస్తవం. బీజేపీ వ్యతిరేక వర్గాల ఓట్లను జాబితా నుండి పెద్ద ఎత్తున తొలగించి బీహార్, పశ్చిమ బెంగాల్, అస్సాంలతో పాటు పలు రాష్ట్రాల్లో ‘సర్’ అస్త్రంతోనే అక్రమంగా బీజేపీ గెలిచింది. ‘సర్’ మొదటి రెండు దశల్లో 12 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో చేపట్టి దాదాపు 7.2 కోట్ల ఓట్లు తొలగించారు. వీటిపై పలు అనుమానాలున్నాయి.
అనేక రాష్ట్రాల్లో భయాలు సృష్టించిన ‘సర్’
మొదటి రెండు దశల్లో దేశంలో నిర్వహించిన ‘సర్’ ను పరిశీలిస్తే బీహార్‌లో 65 లక్షలు (8.3 శాతం), ఉత్తరప్రదేశ్‌లో 2.5 కోట్లు (13 శాతం), తమిళనాడులో 97.3 లక్షలు (14 శాతం), పశ్చిమబెంగాల్‌లో 90 లక్షలు (11 శాతం), గుజరాత్‌లో 70 లక్షలు (14.5శాతం), మధ్యప్రదేశ్‌లో 34.25 లక్షలు (6శాతం), రాజస్తాన్‌లో 31 లక్షలు (5.7 శాతం), ఛత్తీస్‌ఘడ్‌లో 25 లక్షలు (11 శాతం) ఓట్లు తొలగించారు. ముఖ్యంగా బీహార్, పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, గుజరాత్, అస్సాంలో పలు వివాదాలు చెలరేగాయి. బీహార్, పశ్చిమ బెంగాల్‌లో సరిగ్గా ఎన్నికల ముందు ‘సర్’ చేపట్టి అవకతవకలు చేయడంతో ఆ రాష్ట్రాల్లో ఓడిపోవాల్సిన బీజేపీ గెలిచింది.
బీహార్‌లో కోటి వరకు ఓట్లు తొలగిస్తున్నారని తొలుత చెప్పినా, న్యాయస్థానాల జోక్యంతో చివరికి సుమారు 65 లక్షల ఓట్లు రద్దు అయ్యాయి. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కూడా ‘సర్’ సంచలనం రేపింది. అత్యున్నత న్యాయ స్థానం సుప్రీం కోర్టు పారదర్శకత కోసం ఆ రాష్ట్రంలో న్యాయమూర్తులను పరిశీలకులుగా నియమించాల్సి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఓటర్ల తొలగింపు కేసులు న్యాయస్థానాల్లో కొనసాగుతుండడం దురదృష్టకరం. అస్సాంలో బంగ్లాదేశ్ వలసదారుల సాకుతో భారీగా ఓట్లు తొలగించారు. ఈ ఉదంతాలన్నింటినీ పరీశీలిస్తే భరోసా కల్పించాల్సిన ‘సర్’ ఓటర్లలో భయాలను సృష్టిస్తోందని స్పష్టమవుతోంది.
కాంగ్రెస్ పార్టీ బీఎల్ఏలను నియమించింది
రాజకీయ పార్టీలు కూడా ‘సర్’ ప్రక్రియపై స్పందించకుండా చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు కాకుండా ఇతర రాష్ట్రాల అనుభవాలతో మేల్కొని తెలంగాణలో జాగృతం కావాల్సిన ఆవశ్యకత ఉంది. ఎన్నికల సంఘం అధికారులతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్షాలపై చేస్తున్న అక్రమాలను పసిగట్టిన తెలంగాణ కాంగ్రెస్ వారి పాచికలను రాష్ట్రంలో పారనీయదు.
తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ బూత్ లెవల్ ఏజెంట్లకు (బీఎల్ఏ) పూర్తి అవగాహన కల్పించి కావాల్సిన శిక్షణ కూడా ఇవ్వడం జరిగింది. ఇంటిపేరులో సందేహాలున్నాయంటూ తన పేరును కూడా అనుమానాస్పద ఓటర్ల జాబితాలో పెట్టారని ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారంటే ఇక రాష్ట్రంలో సాధారణ ఓటర్ల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
ఎన్నికల సంఘం రూపొందించిన ‘డెమోగ్రఫీ సిమిలర్ ఎంట్రీస్’ సాఫ్ట్‌వేర్‌తో బోగస్, డూప్లికేట్, రెండు చోట్ల ఉండే ఓట్లను తొలగించే అవకాశాలున్నాయి. ప్రధానంగా గ్రేటర్ శివార్లలో, కొత్త కాలనీల్లో భారీగా ఓట్లు తొలగించడం, జోడించడం జరగొచ్చు. ఇలాంటి చోట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.
ఓటర్లు 11 రకాల గుర్తింపు కార్డులలో ఏదో ఒకటి తమ రుజువుగా చూపించవచ్చని భారత ఎన్నికల సంఘం ప్రకటించిన నేపథ్యంలో దీనిపై ఓటర్లలో అవగాహన కల్పించాల్సిన బాధ్యత అన్నిపక్షాలపై ఉంది. ఇతర రాష్ట్రాల్లో వలె తెలంగాణలో కూడా బీజేపీ తమ పార్టీకి వ్యతిరేకమైన ఓట్లను లక్ష్యంగా చేసుకునే అవకాశాలున్నాయి. కాకపోతే ప్రజాస్వామ్యవాదుల అప్రమత్తత తెలంగాణలో బలంగా ఉంది. బీజేపీ పాచికలు పారవు
సర్ పట్ల ప్రజాస్వామ్య వాదులు అప్రమత్తం
రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న బీజేపీ ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా దేశంలో ‘ఓటు చోరీ’, ‘సీటు చోరీ’లతో అధికారం పొందాలని కుట్రలు పన్నుతోంది. వీటిని అడ్డుకునేందుకు సెక్యులర్ పార్టీలు, ప్రజా సంఘాలు కలిసికట్టుగా పోరాడాలి. ఓట్ చోరీపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ పోరాటాన్ని ఆదర్శంగా తీసుకొని తెలంగాణ కాంగ్రెస్ ‘సర్’పై ఒక ఉద్యమంలా అప్రమత్తంగా ఉంటుంది.
మన ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు విలువైనది. కాబట్టి ‘సర్’ ప్రక్రియ ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేకుండా, పారదర్శకంగా సాగితేనే ప్రజల్లో ఎన్నికల వ్యవస్థపై విశ్వాసం పెరుగుతుంది. స్వయంప్రతిపత్తి కలిగిన ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా తెలంగాణలో ‘సర్’ను విజయవంతంగా పూర్తిచేయాలని ప్రజాస్వామ్యవాదులంతా కోరుకుంటున్నారు.
గతంలో పారదర్శకంగా.. ఇపుడు ఒత్తిడిలో..
ఓటర్ల జాబితాను సవరించే ప్రక్రియ గతంలో దేశంలో పలుమార్లు నిర్వహించినా ఇప్పుడున్నట్టు ఎప్పుడూ వివాదాస్పదం కాలేదు. దేశంలో ఇంతకుముందు 1951-52, 1960, 1980, 1993, 1995, 2002-2004 సంవత్సరాల్లో ‘సర్’ ప్రక్రియ నిర్వహించారు. 1993-95లో ఎన్నికల గుర్తింపు కార్డు జారీచేసే సమయంలోనూ దేశ వ్యాప్తంగా ఓటర్ల జాబితాను సవరించారు.
ఈ అన్ని సందర్భాల్లోనూ పారదర్శకంగా ‘సర్’ ప్రక్రియ చేపట్టిన ఎన్నికల సంఘం, ఇప్పుడు మాత్రం బీజేపీ అధికార ఒత్తిడితో వివాదాస్పదంగా మారింది. “ప్యూరిఫికేషన” కోసం ఓటర్ల జాబితా సవరణ చేపడుతున్నట్టు చెబుతున్న ఎన్నికల సంఘం ప్రజలకు సందేహాలు లేకుండా “క్లారిఫికేషన్” ఇవ్వాలి. అందరికీ టెక్నాలజీలో అనుభవం ఉండదు కాబట్టి ‘సర్’పై ఓటర్లలో పూర్తి అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉంది.
బి.మహేశ్ కుమార్ గౌడ్ ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షులు
* ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ఐడీ openpage@v6velugu.com
* రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి.
* స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.
