ఆదివాసులు అడవితల్లి ముద్దు బిడ్డలు. ఈ సమాజానికి మూలవారసులు. భారతదేశానికి అసలు వారసులు. 70సంవత్సరాల స్వతంత్ర భారతావనిలో తమ అస్తిత్వం కోసం అల్లాడిపోతున్నారు. క్రీ.శ1240 నుండి 1750 వరకు ఉన్న మద్యకాలంలో స్వేచ్ఛగా, స్వతంత్రంగా విలసిల్లిన గోండ్వాన రాజ్యాలను ఆదివాసులు ఏలారు. నేడు ఈ దోపిడీ నాగరిక సమాజంలో తమ మనుగడ, అస్తిత్వం, జీవన, విధానం విధ్వంసం అయి గిరిజనేతర నాగరిక సమాజం చేత దోపిడీకి గురవుతూనే ఉన్నారు.
స్వయంపాలన అదివాసుల స్వయం నిర్ణయపు హక్కు నేపథ్యంలో ఆదివాసుల సాంప్రదాయక పోరాటాలను గుర్తించిన ఐక్యరాజ్యసమితి ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవంగా ప్రకటించింది. రాజ్యాంగం 5 షెడ్యూల్ ఆర్టికల్ 244 పేరా (1) ప్రకారం1950లో గుర్తించిన తెగలకు మాత్రమే షెడ్యూల్డ్ ప్రాంతాలలో 29 శాఖలలో ఉద్యోగాలు కల్పించాలి, కానీ అక్రమంగా షెడ్యూల్డ్ ఏరియాలకి వలస వచ్చిన లంబాడాలు తెలంగాణ ఆదివాసీ ప్రాంతంలో కూడా వేల ఉద్యోగాలు పొందుతున్నారు.
కానీ తదుపరి లంబాడాలనూ ఎస్టీల్లో కలిపి ఆదివాసీలకు అన్యాయం చేశారు. అలాగే, జిల్లాల పునర్విబజన పేరుతో ఆదివాసీ ప్రాంతాలను మైదాన ప్రాంతాలలో కలిపారు. తెలంగాణలో 90 శాతం ఆదివాసుల రిజర్వేషన్ ఉద్యోగాలు అక్రమంగా ఇతరుల పాలవుతున్నాయి. మరోవైపు చెల్లప్ప కమిషన్ ద్వారా మరో మూడు కులాలు ఎస్టీ జాబితాలో కలిపి ఆదివాసులును నిర్వీర్యం చేస్తున్నారు.
ఆదివాసీ దినోత్సవం సార్థకం కావాలంటే..
ఏజెన్సీలో గిరిజనేతరుల ఓటు హక్కు రద్దు చేయాలి. ఏజెన్సీలో గిరిజనేతరుల వలసలు అరికట్టాలి. ఎస్టీ జాబితా నుండి లంబాడీలనూ తొలగించాలి. ఐటిడిఏలో జరుగుతున్న అవినీతిని అరికట్టాలి. ఐటిడిఏలో అటెండర్ నుండి ఐఏయస్ వరకు ఆదివాసీలనే నియమించాలి. ఏజెన్సిలో 1/70 చట్టాని, పీసా చట్టాన్ని, జీవో నెం3ని పకడ్బందీగా చట్టం చేసి అమలు చేయాలి. ఏజెన్సీలో పోలీస్ శాఖ నూ ఐటిడిఏ నియంత్రణలోకి తీసుకరావలి. ఏజెన్సీలో ఆదివాసీలు సాగు చేస్తున్న పోడుభూములకు పట్టాలు ఇవ్వాలి. ఏజెన్సీలో గిరిజనేతరుల పట్టాలు రద్దు చేయాలి. పై డిమాండ్లను నెరవేర్చినపుడే ఆదివాసీ దినోత్సవానికి సార్థకత అని పాలకులు గమనించాలి.
-వూకె రామకృష్ణ దొర
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని
హామీ తప్పనిసరి రాయాలి.
స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.
