ఈ దేశంలో అకస్మాత్తుగా ఒక యువకుడు ప్రారంభించిన ఒక సంస్థ రెండు నెలల్లో దేశ రాజకీయాలను, విద్యావ్యవస్థను, విద్యార్థుల జీవితాలను ఇంత ప్రభావితం చేసిన ఉదాహరణ ఇంతకుముందు మన దేశంలో లేదు. ఇది ఒక పార్టీకో, ఒక నిర్మాణాత్మకమైన సంస్థకో అనుబంధంగా పుట్టలేదు. ఇది సిద్ధాంత బంధాలతో పుట్టలేదు. అందులో సెల్‌ఫోన్, యూట్యూబ్, వాట్సప్ వంటి చాలా ఓపెన్ ప్రచార సాధనాలు అందుబాటులో ఉన్న చారిత్రక దశలో పుట్టింది.
ఈ ఉద్యమం పుట్టిన ఈ సంవత్సరంలో ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలు రెండు విరుద్ధ సంస్కృతులతో సంఘర్షణ పడుతున్నవి. ఒకటి.. దేశ సంస్కృతిని కృతయుగం ఆలోచనలతో, ఆచారాలతో, ఆర్థిక దిగ్బంధంతో ఆర్ఎస్ఎస్, బీజేపీ అధికార ఆలోచనా విధానం. ఇది ఇద్దరు పెట్టుబడిదారులు, నలుగురు రాజకీయ నాయకులు సర్వ వ్యవస్థలను తమ అధికారానికి, ఆర్థిక దోపిడీకి బందీలను చేయాలని సంస్థల నిర్మాణం చేసిన దశ.
ఆదానీ, అంబానీలు ఆర్థిక వ్యవస్థను పూర్తిగా తమఅధీనంలోకి తీసుకుని మోదీ, మోహన్ భగవత్, అమిత్ షా వంటి అదే కుల వర్గ నాయకులను తమ వ్యాపారాలకు అనుగుణమైన ఆర్థిక విధానాలు అమలుచేసేటట్లు చేయడం. ప్రైవేటు రంగం, ప్రభుత్వ రంగాలను పూర్తిగా నాశనం చేసి అన్ని ఉద్యోగాలు తమ చేతుల్లోకి తీసుకుని తమ ఆలోచనాపరులకే ఉద్యోగాలిచ్చే వ్యవస్థ నిర్మాణం.
రెండోది.. నార్త్ ఇండియా కూడా యువకులు ప్రపంచ ప్రజాస్వామిక, ఆధునిక, ముందుచూపు కలిగిన జెన్ జీ పుట్టుకురావడం. ఆర్ఎస్ఎస్, బీజేపీలో ఆ ప్రాంతాన్ని పూర్తిగా త్రేతాయుగ ఆలోచనలలోకి నెడుతూ యూనివర్సిటీలను కూడా ఆ సంస్కృతిలోకి 12 ఏండ్లుగా మలుస్తుంటే ఇంత వింతైన విద్యార్థి చైతన్యం ఎక్కడి నుంచి, ఎలా వచ్చిందనేది ఆర్ఎస్ఎస్, బీజేపీ మేధావులకు సవాలైంది! అయితే వారి జీవితంలోనే ఒక వైరుధ్యం ఉన్నది. వారి కుటుంబాల్లోవారే ప్రపంచ మేధావులయ్యేవిధంగా బాగా డబ్బు ఖర్చుపెట్టి ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలు, ముఖ్యంగా అమెరికా, యూరప్ యూనివర్సిటీల్లో చదివిస్తూ ఇండియన్ మధ్యతరగతిని, బీసీ, ఎస్సీ, ఎస్టీ పిల్లలను మాత్రం ప్రాచీనయుగంలోకి నెట్టెయ్యాలని చూడడం అనే విషయం యువకులకు అర్థమైంది.
ప్రాచీన విలువలున్న గ్రీసు ఏమైంది?
యూరపులో ప్రాచీన విలువలు, సంస్కృతి, రచనలు ఉన్న దేశం గ్రీసు. అక్కడే సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్ తత్వశాస్త్రాలను రాశారు. కానీ, అంతకంటేముందు ఈ దేశంలో రామాయణం వంటి ‘ఒడిస్సీ’ అనే మైథాలజీ గ్రంథాన్ని హోమర్ రాశాడు. అది ఈ దేశంలో రామాయణం మీద సినిమాలు తీసినట్లే ఒక పెద్ద ఒడిస్సీ సినిమాను హాలీవుడ్ డైరెక్టర్ తీస్తే అన్ని సినిమాల కంటే ఎక్కువ డబ్బు సంపాదిస్తుంది. కానీ, దానికి పునాది అయితే గ్రీస్ దేశం అడుక్కుతినే పరిస్థితిలో ఉంది. మన దేశాన్ని కూడా రామాయణం నాటి పరిస్థితులు తిరిగి తీసుకురావాలని ఆర్ఎస్ఎస్ నాయకులు ముఖ్యంగా మోహన్ భగవత్ ప్రయత్నిస్తున్నాడు. కానీ అది దేశాన్ని వెనక్కి నెడుతుంది.
మనదేశం ఒక గ్రీస్‌లాగ అతి బీదదౌతుంది. ఇది గమనించిన అదానీ, అంబానీలు లక్షల కోట్లు ఇక్కడ సంపాదించి అమెరికాలో, ఇంగ్లాండులో ఇండ్లు కొనుక్కొంటున్నారు. వారికి ఒక కోటి డాలర్లు అమెరికాలో కావాలంటే ఇక్కడి నుంచి వందకోట్ల రూపాయలు అక్కడికి తరలిస్తున్నారు. అటునుంచి డాలర్లు రావడం లేదు. ఇటు నుంచి అటు రూపాయలు పోయి అక్కడ డాలర్లుగా మారుతున్నాయి. అందుకే రూపాయి ప్రపంచరేటు విపరీతంగా పడిపోతుంది. ఈ పద్ధతి తీవ్రమైన నిరుద్యోగాన్ని పెంచుతుంది. ధరలు పెంచుతుంది. అతిపెద్ద పెట్టుబడిదారులకు మోహన్ భగవత్ ఎలా దగ్గరయ్యాడో చూడండి.
ఆయన ఆగస్టు 6న ముంబైలో 2వేల మంది జెన్ జీలతో నీతా అంబానీ పెద్ద పెట్టుబడి హాలులో మీటింగ్ జరిపాడు. ఆ పిల్లలంతా ఎవరై ఉంటారు?. గ్రామాల నుంచి వచ్చిన బీదపిల్లలై ఉండే అవకాశం ఉందా? లక్షల కోట్లు వనరులున్న వ్యాపార, పెట్టుబడి దోపిడీదారుల అండదండలతో అంబానీ, అదానీ, బిర్లాల స్కూళ్లు, కాలేజీల్లో, యూనివర్సిటీల్లో చదివే పిల్లలతో వారి డబ్బులతోనే కృతయుగపు సంస్కృతి గురించి వారికి చెబితే దేశం ముందుకుపోతుందా? దేశంలోని మొత్తం సంస్థలను గత 12 ఏండ్లలో సాధారణ ప్రజలకు నమ్మకంలేనివిగా అవి ఆర్ఎస్ఎస్, బీజేపీకి అనుకూలంగా మారాయని భావించే స్థితి వచ్చింది. వర్సిటీలు ఆధునిక విద్యను పక్కకు పెట్టాయి.
కాక్రోచ్‌లంతా దేశ ద్రోహులా?
ఈ వాతావరణంలో ఆర్ఎస్ఎస్ దేశంలోని కాక్రోచ్‌లంతా దేశ ద్రోహులని ప్రకటించిన మోహన్ భగవత్ ముంబై 6వ తారీకున తన కార్యక్రమాన్ని అతి ధనవంతమైన జెన్ జీతో మాట్లాడి కాక్రోచ్‌లను దేశం నుంచి తరిమికొట్టడానికి అంబానీ హాలులో పెట్టుకున్నాడు. ఎంత విచిత్రం. అతి బీదల కోసం వంద ఏండ్లు రిజిస్ట్రేషనే లేకుండా, బ్యాంక్ అకౌంట్ లేకుండా సేవ చేస్తున్న ఆర్ఎస్ఎస్.. అంబానీ పుక్కటికిచ్చిన మోస్ట్ లక్సోరియస్ హాలులో అతి ధనవంతమైన 2000 యువ సైనికులను కాక్రోచ్‌లకు వ్యతిరేకంగా తయారుచేస్తున్నాడు.
అభిజిత్ ఒక్కరోజు ముందే తన మధ్య తరగతి ఇంట్లో పదిమంది కోర్ టీమ్‌తో మీటింగ్ పెట్టాడు. తనతో పనిచేసే అన్ని కులాల యువకులకు తానే చాయ్, ఆహారం అందిస్తూ, మీడియా ప్రతినిధులకు కూడా అందిస్తూ ఎంత దేశ ద్రోహం పని చేస్తున్నాడు! అతనిపై తివారీలచేత, దైవభక్తుల చేత ఒక దళితుడివి నువ్వెట్లా అమెరికాలో చదువుకున్నావు. నీకు గింత ఇంగ్లిష్ తెలివి ఎట్లా వచ్చాయి అని ఆర్టీఏ అప్లికేషను దేశం మొత్తంగా వేయిస్తున్నారు. ఇది ఎంత ప్రజాస్వామిక ఆలోచన.
చక్రవర్తులు తమ సర్టిఫికెట్లు సాధారణ ప్రజలకు చూపిస్తారా!
అయితే అభిజిత్ నాకు బోస్టన్ యూనివర్సిటీ ఫెలోషిప్ లెటర్, నా లోన్ లెటర్ బయటపెడతాను, మీరు మీ చక్రవర్తి డిగ్రీ సర్టిఫికెట్లు బయటపెట్టండి అంటున్నాడు. ఇదెంత అన్యాయం. చక్రవర్తులు తమ సర్టిఫికెట్లు సాధారణ ప్రజలకు చూపిస్తారా! ఈ స్థితిలో దేశముంది. విద్యారంగంలో బీదలకు చదువు రావొద్దు అని ఒక జాతీయవాద విధానాన్ని, అతి ధనవంతులకు ప్రపంచజ్ఞానం, క్రమంగా ఈ దేశ ధనాన్ని అమెరికాలో, ఇంగ్లండులో ఇన్‌వెస్ట్ చేయగలిగే జాతీయవాద జ్ఞానం కావాలి కదా! అయితే ప్రజలు మూఢ నమ్మకాల్లో మునిగి మోహన్ భగవత్, మోదీ మాటలు నమ్మినంతకాలం కాక్రోచ్‌లు అనుకున్న మార్పు తేలేరు. అట్లని యువత మేల్కొని ఒక సుదీర్ఘ సంఘర్షణ, కొత్త ఆలోచన చేయకపోతే ఈ దేశం తిరిగి ఈ ఆధునిక కలియుగం నుంచి కృతయుగంలోకి పోవడం ఖాయం.
సీజేపీ ఏం చేయాలి?
ఇది వారి ముందున్న పెద్ద సవాలు. ఇది అనుభవం, ఆదాయం ఉన్న సంస్థ కాదు. వీళ్లంతా యువకులు, 36 రోజులు జంతర్ మంతర్‌లో ఉద్యమం చేశారు. ఒక విజయం సాధించారు. కానీ ముందు ముందు వ్యవస్థల్లో మార్పు వచ్చేందుకు వీళ్లు ఏం చేస్తారు? అనేది ముఖ్యం. ఆ కార్యక్రమం నిర్ణయించడానికి కాక్రోచ్ జనతా పార్టీ నాయకత్వం పాత ఔరంగాబాద్‌లో ఈ నెల 5న కూర్చుని చర్చించింది. ఈ యువకులు తమ నిర్ణయాన్ని ప్రెస్ కాన్ఫరెన్సులో ప్రకటించారు. అందులో ముఖ్యమైన విషయాలు అభిజిత్ దీప్కే కాక్రోచ్ జనతాపార్టీ మేనిఫెస్టోలో ప్రకటించినవే ఎక్కువగా ఉన్నాయి.
భవిష్యత్తులో దేశంలోని వివిధ ప్రాంతాల్లో తిరిగి విద్యావ్యవస్థల్లోని లోపాలను వీరు అధ్యయనం చేస్తారు. అందులోని లొసుగులను తొలగించడానికి చర్యలు, ఉద్యమాలు చేపడతారు. జ్యుడీషియల్ వ్యవస్థతోపాటు మిగతా ప్రభుత్వ వ్యవస్థలను నూట్రల్‌గా పనిచేయించడానికి కృషి చేస్తామంటున్నారు. 12 ఏండ్లు కొత్త సిద్ధాంత పరిపాలన తరువాత పాత వ్యవస్థల్లో చాలా మార్పు వచ్చింది. అవి ఆధునిక యుగానికి దూరంగా వెనుతిరిగాయి. మానవ సమానత్వమనే ప్రజాస్వామిక రాజ్యాంగ సూత్రం నుంచి అన్ని రంగాల్లో దేశాన్ని ఏలుతున్న సంస్థ సిద్ధాంతం అమలు చేయాలనేది అన్ని సంస్థలలోకి చొప్పించబడింది.
ఇది దేశంలోని ఏ సంస్థలో ఓపెన్ మైండ్‌తో ఉండాల్సిన పోటీతత్వాన్ని వెనక్కి తిప్పేసింది. అయితే ఈ వెనుదిరిగి కృతయుగ సంస్కృతి వైపు జరుగుతున్న ప్రయాణం ఎంతదూరం పోయింది. దాన్ని ఆపి సంస్థల్ని ఆధునిక రాజ్యాంగ యుగంలోకి తీసుకురావడం అంత సులభమా? ప్రాచీన సంస్కృతి బరువును మోయమంటే విద్యార్థులు సర్వనాశనమౌతారు. ఈ విషయం వాళ్లు జంతర్ మంతర్ నుంచి స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే అభిజిత్ అతని టీమ్‌పై దేశం పెద్ద ఆశలు పెట్టుకున్నది. ఈ ఆశలను కాలక్రమంలో నెరవేర్చవలసి ఉన్నది. చాలాకాలం ఈ టీమ్ కలిసి పనిచేస్తూ త్యాగాలకు సిద్ధపడాల్సి ఉంది.
- ప్రొ. కంచ ఐలయ్య షఫర్డ్
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని
హామీ తప్పనిసరి రాయాలి.
స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.
