న్యూఢిల్లీ: ఒక మహిళ అర్ధరాత్రి వేళల్లో పురుషుడితో ఫోన్ మాట్లాడినంత మాత్రాన ఆమె ప్రవర్తనను తప్పుబట్టలేమని, ఆమె కాల్ డేటా రికార్డులను (సీడీఆర్) సేకరించాలని కోరడం వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమే అవుతుందని ఢిల్లీ సెషన్స్ కోర్టు స్పష్టం చేసింది. ఓ గృహహింస కేసులో తన భార్య అర్ధరాత్రి వేళల్లో పురుషులతో ఫోన్ మాట్లాడుతోందని, ఆ కాల్ రికార్డులను భద్రపరిచేలా ఆదేశించాలని ఓ భర్త కోరగా, ట్రయల్ కోర్టు నిరాకరించింది.
దీనిని సవాల్ చేస్తూ దాఖలు చేసిన అప్పీల్‌ను అడిషనల్ సెషన్స్ జడ్జి షునాలి గుప్తా కొట్టివేశారు. ఒక మహిళ మరో పురుషుడితో ఫోన్లో మాట్లాడటాన్ని తప్పుగా చూసే ప్రాచీన రోజుల్లో ప్రస్తుత భారతీయ సమాజం లేదని కోర్టు పేర్కొంది. మహిళలు కార్పొరేట్ సంస్థలతో సహా అన్ని రంగాల్లో పనిచేస్తున్నారని, వారికి పురుష సహోద్యోగులు ఉంటారని, రాత్రి పూట మాట్లాడారనే కారణంతో భార్య శీలాన్ని తప్పుబట్టలేమని కోర్టు తేల్చి చెప్పింది.
