- ఎస్సీ వర్గీకరణతో మాలలే తీవ్రంగా నష్టపోయారు.. రోస్టర్ పాయింట్ల విధానంతో అన్యాయం
సైఫాబాద్, వెలుగు: మాలల హక్కుల కోసం కొట్లాడేందుకు తాను ముందుంటానని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి జి.వివేక్ వెంకటస్వామి అన్నారు. ఎస్సీ వర్గీకరణ తో మాలలే తీవ్రంగా నష్టపోయారని, రోస్టర్ పాయింట్స్ లలో మాలలకు అన్యాయం జరిగిందన్నారు. సైఫాబాద్ లో మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య అధ్యక్షతన జరిగిన మాల మహానాడు రాష్ట్ర ముఖ్య లీడర్ల సమావేశంలో మంత్రి వివేక్వెంకటస్వామి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రోస్టర్ పాయింట్ల ద్వారా మాలలకు ఐదు శాతం రిజర్వేషన్లు దక్కాలని, కానీ..ఇటీవల ఆర్టీసీలో వెయ్యి పోస్టులకు 2.5 శాతం మాత్రమే దక్కాయన్నారు.
రోస్టర్ పాయింట్లను సరిదిద్దేందుకు స్పెషల్ కమిటీ వేయాలని క్యాబినెట్ మీటింగ్ లో ప్రతిపాదించానని తెలిపారు. రోస్టర్ పాయింట్స్ పై లీగల్ గా కొట్లాడుతున్నానని , మాల ఎమ్మెల్యేలు , ప్రభుత్వ ఉద్యోగులు కూడా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. తాము ఎవరికీ వ్యతిరేకం కాదన్నారు. రోస్టర్పాయింట్ల అంశాన్ని ప్రభుత్వం సరిదిద్దే అవసరం ఉందని,ఆలస్యం చేయకుండా నెల రోజుల్లో పరిష్కరించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీకి ఇందిరాగాంధీ సమయం నుంచి మాలలు అండగా నిలబడ్డారని, కానీ వర్గీకరణ కారణంగా జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కొంతమంది మాలలు వ్యతిరేకించారన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లానన్నారు. మాలలు హక్కులు సాధించుకోడానికి, అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధం కావాలని మంత్రి పిలుపునిచ్చారు.
మోత్కుపల్లికి కౌంటర్
మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు చేసిన వ్యాఖ్యలపై మంత్రి వివేక్ వెంకటస్వామి స్పందించారు. కాకా కుటుంబంపై విమర్శలు చేయడం మానేసి దళితుల హక్కుల కోసం పోరాడాలని సూచించారు. గెలిచే అభ్యర్థులకే రాజకీయ పార్టీలు టికెట్లు ఇస్తాయని, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో కాకా కుటుంబం నుంచి పోటీ చేసినప్పుడే కాంగ్రెస్ విజయం సాధించిందని గుర్తు చేశారు. బెల్లంపల్లి నియోజకవర్గంలో నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్ గెలవలేదని, గత ఎన్నికల్లో తన సోదరుడు వినోద్ విజయం సాధించారని తెలిపారు. మోత్కుపల్లి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని, చిత్తశుద్ధి ఉంటే చేవెళ్ల డిక్లరేషన్ అమలుకు ఉద్యమించాలని హితవు పలికారు.
