హైదరాబాద్‌‌లో మెగా ‘కార్నివాల్‌‌’నవంబర్ లేదా డిసెంబర్‌‌లో నిర్వహణ :  మంత్రి జూపల్లి 

హైదరాబాద్‌‌లో మెగా ‘కార్నివాల్‌‌’నవంబర్ లేదా డిసెంబర్‌‌లో నిర్వహణ :  మంత్రి జూపల్లి 
  • ప్రపంచ స్థాయి వేడుకగా చేయాలని మంత్రి జూపల్లి ఆదేశం

హైదరాబాద్, వెలుగు:  హైదరాబాద్ నగరం మరో అంతర్జాతీయ స్థాయి వేడుకకు వేదిక కానుంది. నవంబర్ లేదా డిసెంబర్ నెలల్లో 'హైదరాబాద్ కార్నివాల్'ను అట్టహాసంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. గురువారం బేగంపేట టూరిజం ప్లాజాలో పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులతో సమీక్ష నిర్వహించారు.

కార్నివాల్ నిర్వహణ కోసం పర్యాటక శాఖ ఆహ్వానించిన ప్రతిపాదనలకు పలు ఈవెంట్ మేనేజ్‌‌మెంట్ సంస్థలు స్పందించాయి. షార్ట్‌‌లిస్ట్ అయిన సంస్థలు తమ ప్రణాళికలను మంత్రికి వివరించాయి. అంతర్జాతీయ స్థాయి కార్యక్రమాలు నిర్వహించిన అనుభవం ఉన్న సంస్థనే ఎంపిక చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, కళలు, వారసత్వం, స్థానిక వంటకాలను ప్రపంచానికి పరిచయం చేసేలా కార్నివాల్ ఉండాలని చెప్పారు.

హైదరాబాద్ కార్నివాల్‌‌ను ప్రతి ఏడాది జరిగే ప్రపంచ స్థాయి ఉత్సవంగా తీర్చిదిద్దాలని మంత్రి ఆకాంక్షించారు. సందర్శకులను ఆకట్టుకునే కార్యక్రమాలతో పాటు భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల భాగస్వామ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.

పెండింగ్ కేసులపై సమీక్ష ...

పర్యాటక శాఖకు సంబంధించిన పెండింగ్ న్యాయపరమైన కేసులపై కూడా మంత్రి సమీక్ష చేశారు. శాఖ ప్రయోజనాలకు నష్టం కలగకుండా కేసుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, అవసరమైన న్యాయ చర్యలను వేగంగా తీసుకోవాలని అధికారులకు సూచించారు. సమావేశంలో పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణి ప్రసాద్, తెలంగాణ టూరిజం డెవలప్‌‌మెంట్ కార్పొరేషన్ ఎండీ గౌతమి, డైరెక్టర్ లక్ష్మణ్ రంజిత్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.