- నోటీసులు ఇచ్చినా స్పందించరా? అంటూ యోగితారాణాను నిలదీసిన ధర్మాసనం
- రిపీట్ అయితే సహించేది లేదని వార్నింగ్
హైదరాబాద్, వెలుగు: కోర్టు ధిక్కరణ కింద ఎందుకు చర్యలు తీసుకోరాదో వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని ఇటీవల విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణాను హైకోర్టు ఆదేశించింది. ఈ నోటీసులపై ఆమె స్పందించకపోడంతో ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టులకు మీరు ఇచ్చే గౌరవం ఇదేనా..? అంటూ నిలదీశారు. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తే కోర్టు ధిక్కరణ చర్యలు ఎదుర్కొవాల్సి ఉంటుందని తెలుసా? అంటూ ప్రశ్నించింది.
భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతమైతే సహించబోమని హెచ్చరించింది. కారుణ్య నియామకానికి సంబంధించి 2023లో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయకపోవడంపై హైదరాబాద్కు చెందిన సయ్యద్ మహబూబ్ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ టి.మాధవీదేవి గురువారం విచారణ చేపట్టారు. కోర్టు ధిక్కరణ కింద వ్యక్తిగతంగా వివరణ ఇవ్వాల్సిన యోగితారాణా.. హాజరుకాకపోవడంతోపాటు హాజరు మినహాయింపు కోరకపోవడంతో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
నిజామాబాద్లో ఉండటంలో హాజరుకాలేకపోతున్నారని వాయిదా వేయాలని కోరగా నిరాకరిస్తూ మధ్యాహ్నం హాజరుకావాల్సిందేనని తేల్చి చెప్పింది. దీంతో నిజామాబాద్లో ఉన్న యోగితారాణా మధ్యాహ్నం ఆన్లైన్లో హాజరై సమాచార లోపం వల్ల ఇది జరిగిందన్నారు. ఉద్దేశపూర్వకంగా కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించలేదన్నారు. శాఖకు అందిన నోటీసులు తన దృష్టికి రాలేదని, ఈరోజు ఉదయమే తెలిసిందన్నారు. సమాచార లోపం వల్ల ఇది జరిగిందని భవిష్యత్లో పునరావృతం కాదంటూ బేషరతు క్షమాపణ చెప్పారు.
దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ నోటీసు అందిన తరువాత న్యాయవాది అయినా కోర్టుకు రావాలి కదా..? అని ప్రశ్నించారు. గతంలో ఇచ్చిన ఉత్తర్వుల అమలు చేశారా? అన్న ప్రశ్నకు అధికారి సమాధానమిస్తూ కలెక్టర్కు సూచనలు ఇచ్చామని తెలిపారు. దీనిపై న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ కలెక్టర్ దగ్గర ఉందంటూ మీరు, మీరు తేల్చాలంటూ ఒకరిపై ఒకరు చెబుతూ పిటిషనర్ జీవితంతో ఆడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు ఆదేశాల అమలుతోపాటు కోర్టు ధిక్కరణ పిటిషన్పై కౌంటరు దాఖలు చేయాలంటూ 3 వారాలకు వాయిదా వేశారు.
