జూన్28న నల్గొండకు సీఎం.. ఎన్ జీ కాలేజీలో బహిరంగ సభకు ఏర్పాట్లు

జూన్28న నల్గొండకు సీఎం.. ఎన్ జీ కాలేజీలో బహిరంగ సభకు ఏర్పాట్లు
  • రూ. 13 వేల కోట్లతో చేపట్టే హ్యామ్ రోడ్ల పనులకు..
  •  కనగల్ లో శంకుస్థాపన

    నల్గొండ, వెలుగు : నల్గొండ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఖరారైంది. ఈ నెల 28న జిల్లాలో పర్యటించనున్న సీఎం రూ.13 వేల కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఆర్ అండ్ బీ హ్యామ్ రోడ్ల పనులకు శంకుస్థాపన చేయనున్నారు. సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. 

సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్  నుంచి నల్గొండ జిల్లా కనగల్ మండలానికి చేరుకొని మార్కెట్ యార్డు వద్ద నిర్మించిన హ్యామ్ రోడ్ల పైలాన్‌‌‌‌ను ఆవిష్కంచనున్నారు. 

అనంతరం నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మొదటి ఫేజ్ డ్రింకింగ్ వాటర్ పనులకు శంకుస్థాపన చేస్తారు. తర్వాత పట్టణంలోని ఎన్జీ కాలేజీ గ్రౌండ్ లో నిర్వహించే బహిరంగ సభకు సీఎం హాజరుకానున్నారు. సభ అనంతరం స్వయం సహాయక సంఘాల మహిళలకు చెక్కులను అందజేయనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది.

 మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్థానికంగానే ఉండి ఏర్పాట్లను, పైలాన్ పనులను పర్యవేక్షిస్తున్నారు. సీఎం పర్యటన, మీటింగ్ కు భారీ సంఖ్యలో జన సమీకరణ చేసేందుకు కాంగ్రెస్ శ్రేణులు కసరత్తు చేస్తున్నాయి.

సీఎం పర్యటనకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలి : కలెక్టర్ చంద్రశేఖర్
సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ ఆదేశించారు. 

సీఎం పర్యటన ఏర్పాట్లపై గురువారం ఎస్పీ శరత్ చంద్ర పవార్ తో కలిసి కలెక్టరేట్ లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... కనగల్ తో పాటు నల్గొండలోని డీటీసీలో హెలిప్యాడ్ ఏర్పాటు చేయాలని సూచించారు. 

స్వయం సహాయక సంఘాల మహిళలు బహిరంగ సభకు చేరుకునేందుకు ఏర్పాట్లతో పాటు, వాహన పార్కింగ్, రూట్లు, డయాస్ ఏర్పాటు చేయాలని, బహిరంగ సభ నిర్వహించే ఎన్జీ కాలేజీ మైదానంతో పాటు కనగల్ వద్ద పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని సూచించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు జె. శ్రీనివాస్, వై. అశోక్ రెడ్డి, జడ్పీ సీఈఓ ప్రేమ్ కరణ్ రెడ్డి, చీఫ్ ఇంజినీర్ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.