శ్రీనగర్: పోలీసులపై దాడిచేసి, పోలీస్ స్టేషన్‌ను ధ్వంసం చేశారన్న ఆరోపణలపై 40 మంది ఆర్మీ సిబ్బందిపై కేసు నమోదైంది. జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. కిష్త్వార్‌లోని అథోలి పోలీస్ స్టేషన్‌పై దాడి చేసి, స్టేషన్ ప్రాంగణంలోని అధికారులు, పోలీసు సిబ్బందిపై దాడి చేసినందుకు 17 రాష్ట్రీయ రైఫిల్స్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ ఎన్ అరుణ్ గాంధీ, మేజర్ వికాస్ శర్మ, నాయిబ్ సుబేదార్ శంకర్ గుర్ఖే సహా -40 మంది ఆర్మీ సిబ్బంది పేర్లను ఎఫ్ఐఆర్‌లో నమోదు చేశారు.
వారిపై హత్యాయత్నం, ప్రభుత్వ ఆస్తుల విధ్వంసం వంటి అభియోగాలు మోపారు. సైనికుల దాడికి గురైన వారిలో అథోలి పోలీస్ స్టేషన్‌కు చెందిన డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ విజయ్ కుమార్ భగత్, స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్హెచ్ఓ) అమృత్ కటోచ్ ఉన్నారు. పద్దర్‌లోని బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీస్‌లో జరిగిన ఒక ప్రభుత్వ కార్యక్రమంలో తాను విధుల్లో ఉండగా.. స్టేషన్ వద్ద ఒక హింసాత్మక ఘటన జరిగిందన్న సమాచారంతో వెంటనే స్టేషన్‌కు తిరిగి వచ్చానని ఎస్హెచ్ఓ తెలిపారు.
తాను స్టేషన్ ప్రాంగణంలోకి ప్రవేశించిన వెంటనే మేజర్ వికాస్ శర్మ నేతృత్వంలో సైనికులు దూకుడుగా దాడి చేశారని చెప్పారు. ఈ ఘర్షణలో వారు తన యూనిఫాం చొక్కాను చించి, అథోలి ఎస్‌డీపీఓ విజయ్ కుమార్ భగత్‌పై కూడా దాడికి పాల్పడ్డారని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. ఈ దాడి ముందస్తు ప్రణాళికతో జరిగిందని, పలువురు పోలీసులు గాయపడ్డారని వారు ఆరోపించారు.
సైనికులు ప్రధాన గేటు, ప్రహరీ గోడలను దూకి పోలీస్ స్టేషన్‌లోకి ప్రవేశించారని, వారి వద్ద లాఠీలు, ఇనుప రాడ్లు, సర్వీస్ ఆయుధాలు ఉన్నాయని తెలిపారు. అసిస్టెంట్ రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్ (ఏఆర్టీఓ).. కిష్త్వార్ సైన్యానికి చెందిన ఒక వాహనాన్ని స్వాధీనం చేసుకున్నందుకు సైనికులు పోలీస్ స్టేషన్‌పై దాడి చేసినట్టు తెలిసింది. ఆ సమయంలో స్టేషన్ ప్రాంగణంలో ఉన్న ఏఆర్టీఓ, అతని వ్యక్తిగత భద్రతా అధికారులపై కూడా సైనికులు దాడి చేశారని ఎస్హెచ్ఓ చెప్పారు.
వారు ప్రభుత్వ, ప్రజల ఆస్తులకు తీవ్ర నష్టం కలిగించారని, ఏఆర్టీఓ అధికారిక వాహనాన్ని, అథోలి పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ, ఎస్‌డీపీఓ వాహనాలను ధ్వంసం చేయడంతో పాటు పోలీస్ స్టేషన్ ప్రధాన గేటును పగలగొట్టారని ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు. విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిని చంపాలని ఆర్మీ సిబ్బంది భావించారని పోలీసులు ఆరోపిస్తున్నారు. అయితే, విచారణకు ఆర్మీ పూర్తిగా సహకరిస్తుందని రక్షణ శాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు.
