పగలు రెక్కీ.. తెల్లవారుజామున చోరీ.. గచ్చిబౌలి ఐటీ కారిడార్లో హాస్టళ్లే టార్గెట్.. ల్యాప్‌‌‌‌టాప్లు, ఫోన్లు కొట్టేస్తాడు !

పగలు రెక్కీ.. తెల్లవారుజామున చోరీ.. గచ్చిబౌలి ఐటీ కారిడార్లో హాస్టళ్లే టార్గెట్.. ల్యాప్‌‌‌‌టాప్లు, ఫోన్లు కొట్టేస్తాడు !

గచ్చిబౌలి, వెలుగు: ఐటీ కారిడార్లో ఐటీ ఉద్యోగులు నివాసం ఉండే హాస్టళ్లే లక్ష్యంగా ల్యాప్​టాప్​లు, ఫోన్లు చోరీ చేస్తున్న వ్యక్తిని గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ ​చేశారు. తమిళనాడులోని వెల్లూరు జిల్లాకు చెందిన గోపి చిన్నన్నన్ కూలీ పనులు చేస్తుంటాడు.

హైదరాబాద్కు వచ్చి, ఐటీ కారిడార్ ప్రాంతాల్లోని ఐటీ ఉద్యోగులు, విద్యార్థుల హాస్టళ్లు, పీజీ వసతి గృహాలు, అపార్ట్‌‌‌‌మెంట్ సముదాయాలే లక్ష్యంగా పగలంతా రెక్కీ నిర్వహించి, తెల్లవారుజామున ల్యాప్‌‌‌‌టాప్‌‌‌‌లు, మొబైల్ ఫోన్లు, నగదు చోరీ చేస్తున్నాడు. గురువారం తెల్లవారుజామున గచ్చిబౌలి డీఎల్ఎఫ్ రోడ్డులో అనుమానాస్పదంగా తిరుగుతున్న గోపి చిన్నప్పన్​ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతను13 దొంగతనాలు చేసినట్లు గుర్తించారు.

2023లో పుణేలో ల్యాప్​టాప్​లో చోరీ చేయగా.. పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. తర్వాత బెయిల్‌‌‌‌ వచ్చి, తరచూ వివిధ ప్రాంతాలకు వెళ్తూ పోలీసులకు చిక్కకుండా దొంగతనాలు చేస్తున్నాడు. ఇతనిపై గచ్చిబౌలి పీఎస్​లో  4 కేసులు, మాదాపూర్ పీఎస్ లో 7, రాయదుర్గం పీఎస్ లో 1, ఫిలింనగర్ పీఎస్ లో 1 కేసు ఉన్నాయి. నిందితుడి వద్ద నుంచి ఒక మొబైల్ ఫోన్, ఒక ల్యాప్‌‌‌‌టాప్ , రూ.1.60 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.