ఎక్సైజ్ శాఖలో భారీగా బదిలీలు..డీసీలు, ఏసీలు, సూపరింటెండెంట్ల మార్పు

ఎక్సైజ్ శాఖలో భారీగా బదిలీలు..డీసీలు, ఏసీలు, సూపరింటెండెంట్ల మార్పు
  • 14 మంది డీసీలు, 35 ఎక్సైజ్ సూపరింటెండెంట్లు, 9 మంది ఏసీలు బదిలీ
  • తక్షణమే కేటాయించిన ప్రాంతాల్లో చేరాలని ఉత్తర్వులు జారీ

హైదరాబాద్, వెలుగు: ఎక్సైజ్ శాఖలో ప్రభుత్వం భారీ ఎత్తున బదిలీలు చేపట్టింది. శాఖకు సంబంధించిన డిప్యూటీ కమిషనర్లు (డీసీలు), అసిస్టెంట్ కమిషనర్లు (ఏసీలు), ప్రొహిబిషన్ అండ్​ ఎక్సైజ్ సూపరింటెండెంట్లు (డీపీఈఓలు) కేడర్లలో పెద్ద సంఖ్యలో అధికారులను బదిలీ చేస్తూ  ఎక్సైజ్​ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన అధికారులందరూ తక్షణమే తమకు కేటాయించిన ప్రాంతాల్లో విధుల్లో చేరాలని ఎక్సైజ్ శాఖ కమిషనర్ హరికిరణ్ ఆదేశించారు.

ఎక్సైజ్ శాఖలో అత్యంత కీలకమైన డిప్యూటీ కమిషనర్ల కేడర్‌‌లో మొత్తం 14 మంది అధికారులకు స్థానచలనం కలిగింది. ఇందులో భాగంగా మేడ్చల్ డీసీగా ఉన్న హరికిషన్‌‌ను సైబరాబాద్‌‌కు, నల్గొండ డీసీ శ్రీనివాస్ రెడ్డిని గ్రేటర్ హైదరాబాద్‌‌కు బదిలీ చేశారు. రంగారెడ్డి డీసీ దశరథను టీజీబీసీఎల్ (టీజీబీసీఎల్​)కు బదిలీ చేయగా, ఖమ్మం డీసీ జనార్ధన్ రెడ్డిని ఆదిలాబాద్‌‌కు మార్చారు.

నిజామాబాద్ ఏసీగా ఉన్న సోమిరెడ్డికి ప్రమోషన్‌‌తో ఖమ్మం డీసీగా, హెడ్‌‌క్వార్టర్స్ డీసీగా ఉన్న రఘురామ్‌‌ను రంగారెడ్డి డీసీగా నియమించారు. ఈ జాబితాలో వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, మల్కాజ్‌‌గిరి, మేదక్, మహబూబ్‌‌నగర్, నల్గొండ జిల్లాలకు కొత్త డీసీలను కేటాయించారు.

ఫ్యూచర్​ సిటీ డీపీఈఓగా శ్రీనివాస్ రెడ్డి

రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల్లో క్షేత్రస్థాయిలో పనిచేసే ప్రొహిబిషన్ అండ్​ ఎక్సైజ్ సూపరింటెండెంట్లు (డీపీఈఓలు) ఏకంగా 35 మంది బదిలీ అయ్యారు. కొత్తగా ఏర్పాటవుతున్న 'ఫ్యూచర్ సిటీ' డీపీఈఓగా శ్రీనివాస్ రెడ్డిని నియమించారు. ఆదిలాబాద్ డీపీఈఓ హిమశ్రీని సిరిసిల్లకు, కరీంనగర్ డీపీఈఓ శ్రీనివాస్ రావును వరంగల్ అర్బన్‌‌కు, వికారాబాద్ డీపీఈఓ విజయ్ భాస్కర్‌‌ను హైదరాబాద్‌‌కు బదిలీ చేశారు. సూర్యాపేట, ఆసిఫాబాద్, సిద్దిపేట, నిజామాబాద్, ఖమ్మం, జగిత్యాల, మెదక్, మల్కాజ్‌‌గిరి సహా దాదాపు అన్ని ప్రధాన జిల్లాల సూపరింటెండెంట్లు ఈ బదిలీల జాబితాలో ఉన్నారు. 

ఎక్సైజ్ సీఐలు, ఎస్ఐల బదిలీలను వెంటనే చేపట్టాలి

ఎక్సైజ్​శాఖలో ఆరేండ్లుగా పెండింగ్‌‌లో ఉన్న పదోన్నతులు, బదిలీల సమస్యను పరిష్కరించడంపై  ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మణ్ గౌడ్, కార్యదర్శి చంద్రశేఖర్ హర్షం వ్యక్తం చేశారు. ఎక్సైజ్ శాఖ సమస్యలను పరిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రి జూపల్లి కృష్ణారావుకు ఉద్యోగుల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు.

ఈ ప్రక్రియను విజయవంతం చేసిన అబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శి రఘునందన్ రావు, కమిషనర్ హరికిరణ్‌‌లకు ధన్యవాదాలు చెప్పారు. గత ఏప్రిల్‌‌లో కానిస్టేబుళ్ల బదిలీలు, ఇప్పుడు ఉన్నతాధికారుల బదిలీలు పూర్తి కావడాన్ని వారు స్వాగతించారు. ఇదే ఉత్సాహంతో పెండింగ్‌‌లో ఉన్న ఎక్సైజ్ సీఐలు, ఎస్ఐల బదిలీలను వెంటనే చేపట్టాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

అసిస్టెంట్ కమిషనర్లలో 19 మంది మార్పు

అసిస్టెంట్ కమిషనర్ల కేడర్‌‌లో 19 మంది అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. మెదక్ ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్ ఏసీగా ఉన్న శ్రీనివాస్ రెడ్డిని సైబరాబాద్ ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్‌‌కు, హన్మకొండ టీజీబీసీఎల్‌‌లో ఉన్న రాజ్యలక్ష్మిని ఆదిలాబాద్ ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్‌‌కు మార్చారు.

హెడ్‌‌క్వార్టర్స్ ఏసీ శ్రీనివాస్ మహబూబ్‌‌నగర్ ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్‌‌కు, ఖమ్మం ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్ ఏసీ గణేశ్ హైదరాబాద్-1 డిస్టిలరీస్ ఏసీగా బదిలీ అయ్యారు. రంగారెడ్డి, మల్కాజ్‌‌గిరి, వరంగల్, నిజామాబాద్, నల్గొండ, మెదక్​ లాంటి పలు ప్రాంతాల ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్ విభాగాలకు కొత్త అధికారులను నియమించడమే కాకుండా కొందరు అధికారులను టీజీబీసీఎల్ చీఫ్ మేనేజర్లుగా బదిలీ చేశారు.