గ్లోబల్ ఏఐ మార్కెట్‌లో వస్తున్న ఊహాగానాలు, సెంటిమెంట్ మార్పులు సౌత్ కొరియా స్టాక్ మార్కెట్‌ను భారీ ఊబిలోకి నెట్టేశాయి. శుక్రవారం ట్రేడింగ్‌లో కొరియా బెంచ్‌మార్క్ ఇండెక్స్ 'కోస్పి' ఏకంగా 8.2 శాతం పతనమై ఇన్వెస్టర్లను కోలుకోలేని దెబ్బతీసింది. మార్కెట్ ఒడిదొడుకులు ఏ స్థాయికి చేరాయంటే.. అమ్మకాల ఒత్తిడి కారణంగా కొరియా ఎక్స్ఛేంజ్ ట్రేడింగ్‌ను 20 నిమిషాల పాటు తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చింది. ఈ వారంలోనే ఇలా ట్రేడింగ్ నిలిపివేయడం ఇది రెండోసారి కావడం గమనార్హం.
ఈ భారీ పతనానికి ప్రధాన కారణం సెమీకండక్టర్ రంగంలోని దిగ్గజ సంస్థలైన శామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్, ఎస్‌కే హైనెక్స్ షేర్లు 9 శాతానికి పైగా కుప్పకూలడమే. ఈ రెండు చిప్ మేకర్స్ సంస్థలే కొరియా మార్కెట్ ఇండెక్స్‌లో దాదాపు 60 శాతం వాటాను కలిగి ఉన్నాయి. కేవలం శుక్రవారం ఉదయం సెషన్ లోనే విదేశీ ఇన్వెస్టర్లు ఏకంగా రూ.16వేల కోట్లు విలువైన షేర్లను విక్రయించి మార్కెట్ నుంచి బయటకు వెళ్లిపోయారు. గురువారం నాటి ట్రేడింగ్‌లో మైక్రాన్ టెక్నాలజీ బుల్లిష్ అంచనాలతో లాభపడిన మార్కెట్, కేవలం 24 గంటల్లోనే ఇలా రివర్స్ అవ్వడం అందరినీ షాక్‌కు గురిచేసింది.
గ్లోబల్ టెక్ మార్కెట్లలో చోటుచేసుకున్న కొన్ని పరిణామాలు ఈ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. మెమొరీ చిప్‌ల కొరత కారణంగా ఆపిల్ సంస్థ తన ఉత్పత్తుల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించడం, ప్రముఖ AI సంస్థ ఓపెన్ఏఐ ఐపీఓను వచ్చే ఏడాదికి వాయిదా వేసే అవకాశం ఉందన్న వార్తలు మార్కెట్‌ను భయపెట్టాయి. ప్రపంచంలోనే అతిపెద్ద కాంపోనెంట్ కొనుగోలుదారు అయిన ఆపిల్ సంస్థే చిప్ ధరల పెరుగుదలను తట్టుకోలేక వినియోగదారులపై భారం వేయడం.. మెమొరీ చిప్ మార్జిన్ల మనుగడపై ప్రశ్నలను లేవనెత్తింది.
ప్రస్తుతం సౌత్ కొరియా స్టాక్ మార్కెట్ 'మీమ్ స్టాక్' తరహాలో విపరీతమైన ఒడిదొడుకులకు లోనవుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. శామ్‌సంగ్, ఎస్‌కే హైనెక్స్ వచ్చే సోమవారం వందల బిలియన్ డాలర్ల కొత్త పెట్టుబడులను ప్రకటించనున్నట్లు వార్తలు వస్తున్నప్పటికీ.. ఇన్వెస్టర్లలో నెలకొన్న ఆందోళనలు తగ్గలేదు. ప్రస్తుత మెమొరీ చిప్ డిమాండ్ బలంగా ఉన్నప్పటికీ, ప్రతికూల పవనాలు చాలా విస్తృతంగా ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. బలమైన మెమొరీ సైకిల్ భవిష్యత్తులో మొత్తం AI ట్రేడ్‌ను నెమ్మదింపజేస్తుందనే భయాన్ని మార్కెట్ ఇప్పుడే అంచనా వేయడం ప్రారంభించింది.
