బీసీ గురుకుల సొసైటీ పేరు మార్పు..మంత్రి పొన్నం అధ్యక్షతన బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ సమావేశంలో నిర్ణయం

బీసీ గురుకుల సొసైటీ పేరు మార్పు..మంత్రి పొన్నం అధ్యక్షతన బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ సమావేశంలో నిర్ణయం

హైదరాబాద్, వెలుగు: మహాత్మా జ్యోతిబాఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (ఎంజేపీటీబీసీ డబ్ల్యూఆర్ఈఐఎస్)ని తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల విద్యాసంస్థల సొసైటీ(టీజీ బీసీడబ్ల్యూ ఎంజేపీఆర్ ఈఐఎస్) గా మార్చాలని, ఐటీ, ఐఐఐటీ, ఎన్ఐటీ వంటి జాతీయ స్థాయి విద్యాసంస్థల్లో ప్రవేశాలు సాధించిన విద్యార్థులకు ల్యాప్‌‌‌‌టాప్‌‌‌‌లు అందించాలని బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ సమావేశంలో నిర్ణయించారు.

గురువారం సెక్రటేరియెట్​లో  బీసీ సంక్షేమ శాఖ మంత్రి  పొన్నం ప్రభాకర్  అధ్యక్షతన  బీసీ గురుకుల విద్యాసంస్థల సొసైటీ 6వ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సమావేశం  నిర్వహించారు. విద్యార్థుల సంక్షేమం, విద్యా ప్రమాణాల మెరుగుదల, మౌలిక వసతుల అభివృద్ధి, పరిపాలనా బలోపేతానికి సంబంధించిన పలు కీలక అంశాలపై సమావేశంలో చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ఈ సమావేశంలో పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు, రీజనల్ కో ఆర్డినేటర్లకు  వివిధ విభాగాలకు బడ్జెట్ పరిమితులను ఆమోదించారు.  బీసీ గురుకుల విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులు మరణిస్తే తల్లిదండ్రులకు రూ.2 లక్షల ఎక్స్‌‌‌‌గ్రేషియా మంజూరు చేయడానికి ఆమోదం తెలిపారు. ప్రిన్సిపాల్ (పాఠశాల) నియామకాలకు సంబంధించి ప్రస్తుతం అమలులో ఉన్న 70 శాతం పదోన్నతులు, 30 శాతం ప్రత్యక్ష నియామకాల విధానాన్ని యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించారు.

వ్యవసాయ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించి కేవలం ఎంజేపీ గురుకుల విద్యాసంస్థల విద్యార్థులకు మాత్రమే అవకాశం కల్పించే ప్రతిపాదనకు బోర్డు ఆమోదం తెలిపింది. పాఠశాలల్లో డెస్క్‌‌‌‌టాప్ కంప్యూటర్ల కొనుగోలు, జూనియర్ కళాశాలలకు ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్  సరఫరాకు అంగీకారం తెలిపారు.  రాష్ట్రంలో 12 సైనిక్ స్కూళ్ల ఏర్పాటుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం వద్ద ఫైల్​ పెండింగ్​లో ఉన్నందున పూర్తి నివేదిక సమర్పిస్తే తదుపరి చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.  

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్  మాట్లాడుతూ బీసీ విద్యార్థులకు అత్యుత్తమ విద్యా అవకాశాలు కల్పించడం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. విద్యా ప్రమాణాల పెంపు, పోటీ పరీక్షల్లో విజయాలు, జాతీయ స్థాయి విద్యాసంస్థల్లో అధిక ప్రవేశాలు సాధించేందుకు ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు.   సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ  బాలమయాదేవి, బీసీ గురుకుల సెక్రటరీ  సైదులు, వివిధ విభాగాల అధికారులు, బోర్డు సభ్యులు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.