దినేష్ కుమార్, దివిజ ప్రభాకర్ జంటగా సతీష్ ఆవాల దర్శకత్వంలో కోమలి మహేందర్ తొట్టె, సోమేష్ సారిపల్లి నిర్మిస్తున్న చిత్రం ‘వెంకట్రామయ్య గారి తాలూకా’. జులై 18న సినిమా విడుదల కానుంది. గురువారం టీజర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ప్రభాకర్ మాట్లాడుతూ ‘ముత్యాల సుబ్బయ్య గారి చిత్రాలను గుర్తు చేసే గొప్ప కథ ఇది. చాలా కాలం తర్వాత ఇలాంటి కథ వినడంతో మా అమ్మాయి దివిజను ఈ సినిమా చేయమని ప్రోత్సహించాను. అందరూ ఆశీర్వదించాలని కోరుతున్నా’ అని అన్నారు.
‘జయమ్మ పంచాయితీ’ తర్వాత తాను నటించిన మరో మంచి సినిమా ఇదని హీరో దినేష్ అన్నాడు. ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యే చిత్రమని దివిజ ప్రభాకర్ చెప్పింది. దర్శకుడు సతీష్ మాట్లాడుతూ ‘పెద్దలకు గౌరవం ఇవ్వడం మన దేశ సంస్కృతిలో గొప్ప సంప్రదాయం. కుటుంబాల్లో ఎదురయ్యే సమస్యలను ఎలా ఎదుర్కోవాలో ఈ సినిమా చూపిస్తుంది’ అని చెప్పాడు. మధ్యతరగతి కుటుంబంలో తాము చూసిన అనుభవాలన్నీ ఇందులో ఉన్నాయని నిర్మాతలు కోమలి, మహేందర్ తొట్టె అన్నారు. నటుడు మురళీధర్ గౌడ్, మ్యూజిక్ డైరెక్టర్ చరణ్‌అర్జున్ పాల్గొన్నారు.
