నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులు వేగం.. భూసేకరణకు సహకరించాలి

నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులు వేగం.. భూసేకరణకు సహకరించాలి
  •     ఎకరాకు రూ.20 లక్షల పరిహారం ఇస్తామని ఆర్డీవో ప్రకటన

కొడంగల్, వెలుగు: నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులు వేగం అందుకుంటున్నాయి. గురువారం కొడంగల్ మండలంలోని ప్యాలమద్ది, పెద్దనందిగామ గ్రామాల్లో ఆర్డీవో అనిత గ్రామసభల ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎత్తిపోతల పథకానికి సహకరించాలని ఆమె కోరారు. గ్రావిటీ కెనాల్స్ నిర్మాణం కోసం భూసేకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిందని తెలిపారు. 

పథకంలో భూములు కోల్పోతున్న రైతులకు ఎకరాకు రూ.20 లక్షల పరిహారం అందజేస్తామని స్పష్టం చేశారు. సందేహాలు ఉంటే స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో నేరుగా సంప్రదించాలని రైతులకు సూచించారు. ప్యాలమద్దిలో మొత్తం 44 ఎకరాల భూసేకరణ చేపట్టగా 390 ఎకరాలకు నీరందనుంది. 

పెద్దనందిగామలో 39 ఎకరాల భూసేకరణతో 1053 ఎకరాలకు నీరందుతుందని అధికారులు వెల్లడించారు. నీటిని తరలించేందుకు కొడంగల్ మండలంలో 18 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ 
నిర్మించనున్నారు. సమావేశంలో తహసీల్దార్ రాంబాబు, డీఎస్పీ శ్రీనివాస్, సర్పంచ్ చన్‌‌బస్ కుమార్ పాల్గొన్నారు.