జైలులో డ్రగ్స్ స్క్రీనింగ్ తప్పనిసరి..ఏడాదిలో 12,675 ఖైదీలకు పరీక్షలు: డీజీ సౌమ్య మిశ్రా

జైలులో డ్రగ్స్ స్క్రీనింగ్ తప్పనిసరి..ఏడాదిలో 12,675 ఖైదీలకు పరీక్షలు: డీజీ సౌమ్య మిశ్రా
  • 4,200 మంది డ్రగ్స్‌‌కు బానిసలుగా గుర్తింపు
  • నాలుగు జైళ్లలో డీ-అడిక్షన్ సెంటర్లు

హైదరాబాద్, వెలుగు: జైలుకు వచ్చే ప్రతి నిందితుడికి డ్రగ్స్ స్క్రీనింగ్ చేస్తున్నామని జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా తెలిపారు. ఖైదీల అడ్మిషన్ సమయంలోనే పరీక్షలు చేసి డ్రగ్స్ అలవాటు ఉన్నవారిని గుర్తిస్తున్నామని చెప్పారు. గత ఏడాది నుంచి ఇప్పటివరకు 12,675 మంది ఖైదీలకు స్క్రీనింగ్ చేసినట్లు తెలిపారు. వీరిలో 4,200 మంది మాదకద్రవ్యాలకు బానిసలుగా ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. వీరికి నాలుగు సెంట్రల్ జైళ్లలోని డీ-అడిక్షన్ సెంటర్లలో చికిత్స, కౌన్సిలింగ్, పునరావాసం అందిస్తున్నామని వివరించారు. ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్స్ డే సందర్భంగా గురువారం చంచల్‌‌గూడ సెంట్రల్ జైలులో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఇందులో ఐజీ మురళీబాబు, సూపరింటెండెంట్ నవాబ్ శివకుమార్ గౌడ్ పాల్గొన్నారు. “నివృత్తి” డీ-అడిక్షన్ సెంటర్ లోగోను ఆవిష్కరించారు. అత్యధికంగా గంజాయి వాడుతున్నవారు 1,563 మంది, కల్తీ కల్లు అలవాటు ఉన్నవారు 815 మంది ఉన్నట్లు గుర్తించారు. అలాగే సెడేటివ్ ట్యాబ్లెట్లకు సంబంధించి 160 కేసులు,సెడేటివ్ ఇంజెక్షన్లు 72, ఎండీఎంఏ 60, మెథాంఫెటమైన్ 40, ఎల్ఎస్డీ 33, కొకైన్ 31, ఓపియాడ్స్ వినియోగిస్తున్న 50 మందిని గుర్తించినట్లు తెలిపారు.  వీరికి కౌన్సిలింగ్‌‌తో పాటు 1,150 ఫాలో అప్ కౌన్సెలింగ్‌‌లు, 507 సైకో ఎడ్యుకేషన్-గ్రూప్ సెషన్లు, 317 అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు వెల్లడించారు. జైలు నుంచి విడుదలైన 550 మందికి టెలిఫోన్ ద్వారా ఫాలో అప్ సేవలు అందించినట్లు డీజీ సౌమ్యమిశ్రా తెలిపారు. చంచల్‌‌గూడ, చర్లపల్లి, నిజామాబాద్, సంగారెడ్డి సెంట్రల్ జైల్లు, మహిళల ప్రత్యేక జైలులోని 'నివృత్తి' డీ-అడిక్షన్ కేంద్రాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించినట్లు వెల్లడించారు.