- త్వరలో మూసీ పరీవాహక ప్రాంతంలో పాదయాత్ర: కవిత
- సుందరీకరణ పేరుతో సర్కార్ కోట్ల స్కామ్ చేస్తోందని కామెంట్
- జులై 2న ఉప్పల్‌లో భారీ 'మిలియన్ మార్చ్' నిర్వహిస్తున్నట్లు ప్రకటన
అంబర్పేట్/పంజాగుట్ట, వెలుగు: రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అన్ని డివిజన్లలో తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో నీళ్లు, డ్రైనేజీ సమస్యలతో జనాలు ఎన్నో బాధలు పడుతున్నారని అన్నారు. గురువారం అంబర్‌పేటలో టీఆర్‌ఎస్ జెండాను ఆవిష్కరించిన అనంతరం కవిత మాట్లాడారు. సుందరీకరణ పేరుతో రేవంత్ సర్కార్ కోట్ల స్కామ్ చేస్తోందని ఆరోపించారు.
త్వరలోనే మూసీ పరీవాహక ప్రాంతంలో పాదయాత్ర చేస్తానని తెలిపారు. తమ పార్టీ జనం బాటకు వస్తుందనే భయంతోనే ప్రభుత్వం రాత్రికి రాత్రే రోడ్లు వేస్తోందన్నారు. తాము అధికారంలోకి రాగానే ఎడ్యుకేషన్, హెల్త్‌కు రూపాయి ఖర్చు లేకుండా ఫ్రీగా అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఆడబిడ్డ సొంత ఇల్లు కావాలని కోరుకుంటుందని, కానీ ఎమ్మెల్యేల వెనుక తిరిగే వాళ్లకే ఇండ్లు ఇస్తున్నారని విమర్శించారు.
స్థానికతపై సుప్రీంలో రివ్యూ పిటిషన్ వేయాలి..
స్థానికత అంశంపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని కవిత డిమాండ్ చేశారు. గురువారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ మంచిదే అయినా, కొన్ని ఉపకులాలకు అన్యాయం జరిగిందన్నారు. గ్రూప్-1తో పాటు ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానికులకు సరైన అవకాశాలు దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం ఉన్న ఐదేళ్ల స్థానికత నిబంధనకు బదులు 15 ఏళ్ల నివాస ప్రాతిపదికను అమలు చేయాలని, జీవో 28ను రద్దు చేసి, జీవో 55ను తిరిగి తేవాలని కోరారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే దీనిపై జ్యుడీషియల్ రివ్యూ కమిటీ వేస్తామన్నారు. తెలంగాణ నిరుద్యోగుల సమస్యలపై జులై 2న ఉప్పల్‌లో టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో భారీ 'మిలియన్ మార్చ్' నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అలాగే, ప్రభుత్వం గతంలో ఎస్‌బీఐకి కేటాయించిన భూములను తిరిగి విక్రయించడం సరైన విధానం కాదని హితవు పలికారు.
