భారత రత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కూడా దేశంలో చిన్న రాష్ట్రాలు ఏర్పడితే బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అన్ని రంగాల్లో న్యాయం జరుగుతుందని భావించారు. కానీ ప్రస్తుత ప్రభుత్వాలు ఈ అంశాలను వేటినీ కూడా పట్టించుకోకపోవడం దురదృష్టకరం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉద్యోగాల కోసం ఎస్సీ, ఎస్టీ వర్గాల నుండి అర్హులు తక్కువగా ఉన్నారని బ్యాక్‌లాగ్ పోస్టులు నిలిపి వేస్తున్నారు. నేటి ఆధునిక యుగంలో అన్ని రకాల అర్హతలు ఉన్న యువతీ యువకులు ఉన్నా కూడా వారికి ఉద్యోగ అవకాశాలు కరువు అవుతున్నాయి.
మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తీసుకువచ్చిన ఫీజు రియింబర్స్మెంట్ పథకం నేడు నిర్లక్ష్యానికి గురవుతోంది. అర్హులైన ఉత్సాహవంతులైన నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాల కోసం గ్రామీణ పట్టణ యువతకు బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా రుణాలు మంజూరుచేసి ప్రోత్సహించేవారు. విద్యార్థుల్లో నైపుణ్యం పెంచడం కోసం ప్రత్యేక శిక్షణలు ఇచ్చేవారు. గ్రామీణ ప్రాంతంలో పట్టణ ప్రాంతంలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కింద ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేవారు. దీనికోసం గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ తీసుకువచ్చారు. రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత సబ్ ప్లాన్ సంగతిని ప్రభుత్వాలు మర్చిపోయాయి.
ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ ఉద్యోగాల మాట ఏమిటి ?
గతంలో దళితుల్లో, గిరిజనుల్లో చదువుకున్న వారి సంఖ్య తక్కువగా ఉండేది. ఉద్యోగాలకు సరిపడా అర్హత లేదని సంబంధిత పోస్టులను బ్యాక్లాగ్ కింద పెట్టేవారు. ప్రస్తుతం ప్రతి ఇంటిలో విద్యావంతులు ఉన్నారు. ఉద్యోగాలకు అన్ని రకాల అర్హత కలిగి ఉన్నారు. అయినా వారి గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. గత 30 సంవత్సరాలుగా ఎస్సీ, ఎస్టీ, బ్యాక్లాగ్ఉద్యోగాలను భర్తీ చేయడంలో పూర్తిగా ప్రభుత్వాలు విఫలమైనాయి.
1994లో ఎన్టీ రామారావు రెండోసారి ముఖ్యమంత్రి అయ్యేనాటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 60 వేల పైచిలుకు ఎస్సీలు 18 వేల పైచిలుకు ఎస్టీ బ్యాక్‌లాగ్ ఉండేవి. ఆ నాటి ప్రజాసంఘాల నాయకులు సంబంధిత పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్లు చేశారు. కానీ అవి నేటికి భర్తీ కాలేదు. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం మీద పోలీసుశాఖ మినహాయించి అన్ని శాఖల్లో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సంఖ్యనే ఎక్కువగా ఉంది.
ప్రతి విభాగంలో కూడా వారే ఉన్నారు. ఉన్నతస్థాయి ఉద్యోగాల్లో రిటైర్ అయిన అధికారులను తిరిగి నియమిస్తున్నారు. అయితే ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలు ప్రారంభమైననాటి నుంచి ఏ రకమైన రిజర్వేషన్లు అమలులో లేవు. రాజ్యాంగ నిబంధన ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నియమించే శాశ్వత, తాత్కాలిక ఉద్యోగాల్లో రిజర్వేషన్ పాటించాలి. కానీ ఇక్కడ పాటించడం లేదు. ఎవరికి నచ్చినవారిని వారు ఉద్యోగంలో పెట్టుకుంటున్నారు.
1995లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి ఈ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల వ్యవస్థ కొనసాగుతోంది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని పూర్తిగా నిర్మూలించి రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చినా అది అమలు జరగలేదు. నేటి యువతరం డిగ్రీలు, పీజీలు ఇతర ఉన్నత చదువులు చదివినా ఉద్యోగ అవకాశాలు అందరికీ లేవు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీలకు ఉద్యోగ, ఉపాధి కల్పనపైన ఎలాంటి ప్రత్యేక ప్రణాళికలు చేయకపోవడం వల్ల ఆయా వర్గాల్లో నిరాశ, ఆందోళన వ్యక్తమవుతోంది.
అస శ్రీరాములు, జర్నలిస్ట్
* ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ఐడీ openpage@v6velugu.com
* రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి.
* స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.
