మధురానగర్ పోలీసులపై హైకోర్టు ఫైర్

మధురానగర్ పోలీసులపై హైకోర్టు ఫైర్
  • మాజీ పోలీసుపై అనుసరించే తీరు ఇదేనా అని ప్రశ్న 

హైదరాబాద్, వెలుగు: ఎలాంటి కేసులు లేకపోయినా 75 ఏళ్ల మాజీ ఎస్‌‌ఐ పట్ల మధురానగర్‌‌ పోలీసులు అనుసరించిన తీరును గురువారం హైకోర్టు తప్పుబట్టింది. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశిస్తూ మధురానగర్‌‌ పోలీసులతో పాటు హోంశాఖ ముఖ్యకార్యదర్శి, నగర పోలీసు కమిషనర్‌‌కు నోటీసులు జారీ చేసింది. మే18న యూసఫ్‌‌గూడలో ఇంటిలో ఉండగా పోలీసులు బలవంతంగా తీసుకెళ్లి అవమానించారని, వారిపై చర్యలతోపాటు పరిహారం ఇప్పించాలని కోరుతూ మాజీ ఎస్ఐ మహ్మద్‌‌ ఉస్మాన్‌‌ హైకోర్టులో పిటిషన్‌‌ దాఖలు చేశారు.

దీనిపై జస్టిస్‌‌ టి. మాధవీదేవి గురువారం విచారణ చేపట్టారు. పిటిషనర్‌‌ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ పోలీసులు ఇంట్లోకి బలవంతంగా జొరబడి, కనీసం దుస్తులు వేసుకునే అవకాశం లేకుండా లోదస్తులతోనే పోలీసు స్టేషన్‌‌కు తీసుకెళ్లారన్నారు. ఎందుకు తీసుకెళుతున్నారో కూడా చెప్పలేదన్నారు. దారిలో కుప్పకూలిపోతే అక్కడే వదిలి వెళ్లిపోయారని పాదచారులు సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారని, వైద్యానికి రూ.25 వేలు ఖర్చయిందన్నారు.

రోజంతా ఆస్పత్రిలో ఉన్నారని, మూడు దశాబ్దాలపాటు అదే శాఖలో పనిచేశారన్న కనీస మర్యాద కూడా ఇవ్వలేదన్నారు. తుపాకీ గురిపెట్టి బెదిరించారని, తప్పుడు కేసు బనాయిస్తామంటూ రూ.లక్ష డిమాండ్‌‌ చేశారన్నారు. శారీరక హింస, అవమానంతో మానసిక వేదనకు గురయ్యానని, పోలీసులపై శాఖాపరమైన చర్యలకు ఆదేశించాలని, అదేవిధంగా పరిహారం ఇప్పించాలని కోరారు. వాదనలను విన్న న్యాయమూర్తి ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ విచారణను వాయిదా వేశారు.