హైదరాబాద్ మెట్రో రైల్పై నాయకుల సంవాదంలో కనిపించని ప్రశ్నలు ఎన్నో !

హైదరాబాద్ మెట్రో రైల్పై నాయకుల సంవాదంలో కనిపించని ప్రశ్నలు ఎన్నో !

తెలంగాణలో 3 ప్రధాన రాజకీయ పక్షాలు హైదరాబాద్ మెట్రో రైల్ గురించి చేస్తున్న ప్రకటనలలో, చర్చలలో వాస్తవాలు తక్కువ, రాజకీయ ధోరణి ఎక్కువ, దాస్తున్నది ఎక్కువ, దాటవేస్తున్నది బోలెడు. రాజకీయ పక్షాలు మాట్లాడుతున్న తీరులో ప్రజలకు ఉపయోగపడే ముచ్చట ఒక్కటి కూడా లేదు. అరకొర సమాచారం ఇస్తూ, ఆరోపణలు గుప్పిస్తూ, ప్రజా ప్రయోజనాలతో కూడిన అంశాల జోలికి వెళ్లకుండా కాలయాపన చేస్తున్నారు.

హైదరాబాద్ మెట్రో రైల్ గత 30 ఏండ్లుగా కొనసాగుతున్న హైదరాబాద్ కేంద్రిత అభివృద్ధిలో, రియల్ ఎస్టేట్ పరమావధిగా అత్యున్నత రాజకీయ నాయకులకు ఉపయోగపడే ఒక ఆదాయ సాధనంగా మారింది. ఇందులో ఉండే ఆర్థిక ఆకర్షణకు ఎవరూ అతీతులు కారు. అవినీతి వ్యవస్థీకృతమైన సమకాలీన సమాజంలో ప్రజలకు తెలుసు ఈ ఆకర్షణ ఏమిటో.

మెట్రో రైలు పరుగులు తొమ్మిదేండ్లు చూసిన పౌరులు, పౌర సమాజ ప్రతినిధులు, ఆసక్తిగల ప్రజలు ఒక ప్రశ్న అడగక తప్పడం లేదు. ఆ మేరకు ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్నారా? 2008లో నిత్యం 15 లక్షల మంది సుఖంగా ప్రయాణించడానికి కడుతున్నామని ముందుకు తెచ్చిన ఈ ఆధునిక ప్రయాణ సాధనం సామర్థ్యం 4.5 లక్షల మంది ప్రయాణీకులను మించడం లేదు. ఆనాడు నిత్యం 35 లక్షల నగర జనాభా ప్రయాణ అవసరాలు తీర్చాల్సిన ఉన్న తరుణంలో కేవలం 40 శాతం ప్రయాణీకుల కొరకు డిజైన్ చేసిన ఈ ప్రయాణ సాధనం ఇది. ఇపుడు నిత్య ప్రయాణీకులలో కేవలం 12.8 శాతం మాత్రమే ఉపయోగించుకునే వీలు ఉన్నది. 

ప్రయాణీకుల సంఖ్య పెంచలేమా?
3 కోచ్ ల నుండి 6 కోచ్ లు పెంచండి అంటే పెట్టుబడి లేదు, నిధులు లేవు. వేల కోట్లు పెట్టి, విలువైన రోడ్డును ఆక్రమించి నిర్మించిన పిల్లర్ల వ్యవస్థలో ప్రయాణీకుల సంఖ్య 4.5 లక్షల నుంచి పైకి పెంచే వీలు లేదా? ఇంకొక 3 కోచ్ లు కొని జత జేస్తే దాదాపు రూ.600 కోట్లు అవుతుందని అంచనా. ఈ నిధులు లేవు అని ఎల్&టి చేతులెత్తేసింది. ఫేజ్ 2 కడతామని ఉవిళ్ళూరుతున్న తెలంగాణా ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ దీని గురించి ప్రస్తావించడం లేదు.

వైరి రాజకీయ పక్షాలు ఈ ప్రశ్న సంధించడం లేదు. నష్టాలు వస్తున్నాయి మేము నడపలేము అని పేరున్న  ప్రైవేటు సంస్థ అధికారికంగా ప్రకటిస్తుంటే నష్టాలు ఎందుకు వస్తున్నాయి అనే  ప్రశ్న కూడా రాజకీయ పక్షాలు అడగడం లేదు.   హైదరాబాద్ మెట్రో రైల్ మొదటి దశ ఆర్థిక లావాదేవీల మీద ఆడిట్ చేద్దామని, చేయాలని ఏ ఒక్క రాజకీయ పక్షం కోరడం లేదు. 

ప్రయాణీకుల సంఖ్య తగ్గింది, పెట్టుబడి విలువ పెరిగింది!
15 లక్షల మంది ప్రయాణించాల్సిన ఈ ఆధునిక టెక్నాలజీలో కేవలం 4.5 లక్షలు మాత్రమే ప్రయాణిస్తున్నారు. ప్రయాణీకుల సంఖ్య తగ్గింది, పెట్టుబడి 2.5 రెట్లు పెరిగింది. ఎందువల్ల? దీనికి బాధ్యులు ఎవరు? ఎక్కడకు, ఎవరి జేబుల్లోకి పోయింది ఈ పెట్టుబడి? నిర్మాణం పూర్తి అయిన మొదటి దశ మీద పెట్టుబడి కొనసాగుతూనే ఉన్నది. ఇదే ఆశ్చర్యం!

తెలంగాణ ప్రభుత్వం తాజాగా మొదటి దశ స్వాధీనపరుచుకునేందుకు తీసుకుంటున్న సరి కొత్త రుణం రూ.13,527 కోట్లు. ఈ కొత్త పెట్టుబడి తోటి అదనపు ప్రయాణీకుల సామర్థ్యం సమకూరుతున్నదా? 4.5 లక్షలు దాటి అదనంగా ఇంకొక ప్రయాణీకుడు మెట్రో రైల్ ఎక్కడానికి ఈ రుణం తీసుకుంటున్నారా? లేదు. మరి, ఈ కొత్త రుణం దేనికి? అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం సగటున ఒక్క మెట్రో రైలు ప్రయాణీకుడి మీద పెట్టుబడి రూ.6.2 లక్షల చొప్పున రోజు ప్రయాణించే దాదాపు ఒక కోటి నగర జనాభాకు సరిపోయే పెట్టుబడి ఎంత?  బస్సులో, ఎంఎంటిఎస్ లో ప్రయాణించే సామాన్యుల మీద ఇందులో 10 శాతం పెట్టుబడి పెట్టి ఉంటె ఇంకా దాదాపు 30 లక్షల మందికి ఉపయోగపడేది. తెలంగాణ ప్రభుత్వం ఈ దిశగా ఆలోచించటం లేదు.

భూమి పాయె, టికెట్​పెరిగే..
269 ఎకరాల ప్రభుత్వ భూమిని ఎల్&టి మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్‌‌కు 35 సంవత్సరాల పాటు ఉచితంగా బదిలీ చేశారు. స్కూళ్లను, క్రింది తరగతి కుటుంబాల ఇండ్ల జాగాను, ప్రజలకు వివిధ సౌకర్యాలు అందిస్తున్న మున్సిపల్ కార్పొరేషన్​ స్థలాలను హైదరాబాద్ మెట్రోకు బదలాయించారు. ఈ భూమిని వాణిజ్యపరంగా అభివృద్ధి చేసి ఆదాయం పొందుతామని, ఈ ఆదాయం మెట్రో రైల్ ప్రయాణికులకు క్రాస్ సబ్సిడీగా ఉపయోగపడుతుందని అప్పట్లో వాగ్దానం.

ఆ విధంగా  ఇన్ని ఏండ్లలో ఎంత ఆదాయం సమకూరింది? అది ఎక్కడికి పోయింది? మెట్రో మార్గంలో సర్వ హక్కులు భాగస్వామ్య సంస్థకు ఇచ్చారు. అయితే  మెట్రో రైలు చార్జీలు రెండు సార్లు పెంచేశారు. మళ్లీ  సౌకర్యాలు తగ్గించారు. భూమి పాయె, టికెట్ పెరిగే, సామాన్యుడు ఎక్కలేని పరిస్థితి. ఎక్కినవారు ఏడ్చే పరిస్థితి. ప్రభుత్వం మొదటి దశలో లోపాల గురించి, సమస్యల గురించి మాట్లాడటం లేదు. మొదటి దశలో చేసిన వాగ్దానాల భంగం, ఒప్పంద ఉల్లంఘనల గురించి రాజకీయ పక్షాలు ప్రశ్నించటం లేదు. 

రెండో దశపై ​అసంపూర్ణ సమాచారం
తెలంగాణ ప్రభుత్వం రెండో దశకు 122.9 కిలోమీటర్ల మేర 7 కొత్త కారిడార్లను మొత్తం రూ.38,595 కోట్ల వ్యయంతో ప్రతిపాదించింది. మే 2026 నాటికి, ఈ ప్రతిపాదన "మూల్యాంకనంలో" ఉంది. అంటే, దీనికి ఆమోదం లభించలేదు, అనుమతి అందలేదు, నిధులు కేటాయించబడలేదు. కేంద్ర ప్రభుత్వం ట్రాఫిక్ అధ్యయనం, ప్రయాణీకుల సంఖ్యకు సంబంధించిన ప్రశ్నలను హైదరాబాద్ ఎయిర్‌‌పోర్ట్ మెట్రో లిమిటెడ్ (HAML)ను అడిగినట్లు వార్తలు చూశాం.

దీనిని బట్టి ఫేజ్ 2కి సంబంధించిన ప్రాథమిక సమాచారం అసంపూర్ణం    గా ఉందని సూచిస్తుంది. మెట్రో రెండవ దశకు సంబంధించిన స్వతంత్ర ప్రయాణీకుల డిమాండ్ అధ్యయనం లేదా ప్రయాణీకుల సంఖ్య అంచనా ఏదీ బహిరంగంగా ప్రకటించలేదు. పారదర్శకత పూర్తిగా కొరవడింది. అధ్యయనాలు, ప్రభుత్వ ఉత్తర్వులు, క్యాబినెట్ నిర్ణయాలు, ఉత్తర ప్రత్యుత్తరాలు, సవివర ప్రాజెక్ట్ ప్రతిపాదనలు, వగైరా వాటి గురించిన సమాచారం ప్రజల ముందు లేదు. 

లాభాలు విదేశీ కంపెనీలకు!
మొదటి దశ ప్లాట్‌‌ఫారమ్‌‌లు 6-బోగీల రైళ్ల కోసం నిర్మించబడ్డాయి, కానీ ప్రస్తుతం 3-బోగీల రైళ్లను నడుపుతున్నాయి; అదనపు కోచ్‌‌లను జోడించడానికి అదే విక్రేత నుండి ప్రీమియం రీ-ప్రొక్యూర్‌‌మెంట్ అవసరం. ప్రతి స్తంభం, దూలం, వయాడక్ట్, డెక్ అక్కడికక్కడే కాంక్రీటుతో నిర్మాణం -అంటే మొత్తం డిజైన్, స్టేషన్ లు శాశ్వతం.

సిగ్నలింగ్ సీబీటీసీ వ్యవస్థలు, స్కాడా, ఫేర్ గేట్లు యాజమాన్య హక్కులు గలవి - రెండవ దశలో తప్పనిసరిగా అవే లేదా అనుకూలమైన విక్రేతలను ఉపయోగించాలి. హైదరాబాద్ మెట్రో స్టాండర్డ్ గేజ్ (1435 మి.మీ.) పై నడుస్తుంది, ఇది భారత రైల్వే బ్రాడ్ గేజ్ (1676 మి.మీ.) తో సరిపోదు. దరిమిలా, ఎంఎంటీఎస్​ లేదా సబర్బన్ రైలుతో భౌతిక అనుసంధానం సాధ్యం కాదు.

మెట్రో రైలు మనకు.. లాభాలు విదేశీ కంపెనీలకు! సక్రమంగా నడిపినా నడపకపోయినా!
మొదటి దశ  గురించి ‘కాగ్’తో ఆడిట్ చేయించి ఒక సమగ్ర ఆర్థిక నివేదికను ప్రజల ముందు పెట్టాలి. మొదటి దశ మీద కొనసాగుతున్న పెట్టుబడిని ఆపాలి. ఐఆర్​ఎఫ్​సీ రీఫైనాన్సింగ్ ఒప్పందం పూర్తి షరతులను, నిబంధనలను, వ్యయాన్ని ఎవరు భరిస్తారనే సమాచారం ప్రజలకు చెప్పాలి.

ఫేజ్ II మార్గాలలో ప్రయాణీకుల రద్దీ (డిమాండ్ అధ్యయనాలు) సాధ్యాసాధ్యాల మదింపులను ప్రజల ముందు పెట్టాలి. వాణిజ్య భూమి అభివృద్ధి ఆదాయంతో సహా, పీపీపీ  కన్సెషనరీతో ఉన్న పూర్తి ఆదాయ పంపిణీ ఒప్పందాన్ని బహిర్గతం చెయ్యాలి. హైదరాబాద్ నగర ప్రజా రవాణాలో అన్ని రకాలసాధనాల మీద ప్రభుత్వ పెట్టుబడి సమానంగా ఉండాలి. 

అన్ని పార్టీల సామూహిక మౌనం దేనికి సంకేతం?
తెలంగాణ శాసనసభలో దానిపై సమగ్ర చర్చ జరిగినట్లు కనిపించడం లేదు. విస్తృత సంప్రదింపులు, పారదర్శకత లేకుండా తీసుకున్న నిర్ణయాల వల్ల తెలంగాణ ఆర్థిక భారం, నగర ట్రాఫిక్ సమస్య జటిలం అయ్యింది. ఇప్పుడు రెండో దశ కూడా అదే తీరులో తెలంగాణ మీద రుద్దితే సమస్యలు ఇంకా తీవ్రం అవుతాయి.

ప్రతి రాజకీయ పక్షం మొదటి దశ ఆడిట్‌‌ను డిమాండ్ చేయకుండానే హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2కు మద్దతు తెలిపాయి. కోట్ల రూపాయల పెట్టుబడితో విస్తరణపై అన్ని పార్టీల ఏకాభిప్రాయం సామూహిక మౌనానికి సంకేతం. ఈ రాజకీయ ఏకాభిప్రాయంలో సమిధలు రోజువారీ కూలీలు, చిరు ఉద్యోగులు,  మహిళలు, విద్యార్ధులు, వయోవృద్ధులు. సాధారణ ప్రయాణికులు ఈ మొత్తం ప్రక్రియలో నిస్సహాయులుగానే మిగిలిపోతున్నారు.

రెండో దశ ప్రయోజనం ఎంత? సంప్రదింపులు ఏవి?
అరకొరగా ఉన్న ప్రజా వనరుల నేపథ్యంలో దేని మీద పెట్టుబడి పెడితే సంపూర్ణ ఫలితాలు వస్తాయి అనే విషయం మీద తెలంగాణ ప్రభుత్వం సంప్రదింపులు చేయడం లేదు. టీజీఎస్ఆర్టీసీ పునరుద్ధరణ, ఎంఎంటీఎస్, సబర్బన్ రైలు, లేదా లాస్ట్-మైల్ పరిష్కారాలతో పోలిస్తే, రూ.38,595 కోట్లతో మెట్రో రైలు రెండవ దశ మీద పెట్టుబడి ఉత్తమ వినియోగమా? అంత పెట్టుబడి పెట్టి కడితే ఎంతమంది ప్రయాణీకులు ఉపయోగించుకుంటారు? ఇప్పటి అంచనా ప్రకారం రెండవ దశలో 5 లక్షల మంది ప్రయాణీకులు కూడా ఉండే అవకాశం లేదు.

ఇదే పెట్టుబడిలో 20 శాతం బస్సుల మీద, ఎంఎంటిఎస్ మీద పెడితే లక్షలాదిమంది పేదలకు, సామాన్యులకు ఉపయోగపడుతుంది. మొదటి దశలో ఇప్పటికి ఎదుర్కొంటున్న ఆర్థిక నష్టాలు, తక్కువ ఉత్పాదకత, లోపాలతో కూడిన పనితీరుకు అతీతంగా, నగరాన్ని శాశ్వతంగా బంధించే అనేక నిర్మాణాత్మక, ఒప్పంద నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఫలితంగా ఏర్పడే భారం తెలంగాణను వెంటాడుతున్నది. మెట్రో పిల్లర్ల నిర్మాణం తరువాత మార్పులు అసాధ్యం. అందుకే ఒకటికి పదిసార్లు అన్ని రకాలుగా ఆలోచన చెయ్యాలి.

డా. దొంతి నరసింహారెడ్డి, పాలసీ ఎనలిస్ట్

* ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ఐడీ openpage@v6velugu.com 
* రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి.
* స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.