- జలాల వివాదాల పరిష్కారానికి కేంద్రమంత్రి పాటిల్ మధ్యవర్తిగా వ్యవహరించాలి: సీఎం రేవంత్‌రెడ్డి
- కేంద్రం ఏర్పాటు చేసే కమిటీతో కలిసి పనిచేస్తాం
- నదీ జలాల సద్వినియోగం, ప్రాజెక్టుల పునర్నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందివ్వాలి
- ఇది 33 గేట్ల పునరుద్ధరణ కాదు.. మూడు తరాల సమస్యను పరిష్కరించే కార్యక్రమం
- తుంగభద్రలోని 15.9 టీఎంసీల కేటాయింపుల్లో మాకు వస్తున్నది 5- నుంచి 6 టీఎంసీలే
- పాలమూరు రైతులకు నీళ్లు ఇప్పించాలని పాటిల్‌కు వినతి
- కర్నాటకలోని తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్లు ప్రారంభించిన కేంద్రమంత్రి పాటిల్, సీఎం రేవంత్‌రెడ్డి, కర్నాటక సీఎం డీకే, ఏపీ సీఎం చంద్రబాబు
- అనంతరం మునీరాబాద్‌లో భారీ బహిరంగ సభ
హైదరాబాద్, వెలుగు: పంచాయితీ కావాలా? పరిష్కారం కావాలా? అంటే తాను కచ్చితంగా సమస్యలకు శాశ్వత పరిష్కారమే కోరుకుంటానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నదీ జలాల వివాదాల పరిష్కారానికి కేంద్రమంత్రి పాటిల్ ఒక ఆర్బిట్రేటర్‌గా వ్యవహరించాలన్నారు. నీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.
ఇందుకోసం కేంద్రం ఏర్పాటు చేయబోయే ఉమ్మడి కమిటీతో కలిసి పనిచేయడానికి తెలంగాణ సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. అలాగే నదీ జలాల సద్వినియోగం చేసుకునేందుకు ప్రాజెక్టుల పునర్నిర్మాణానికి ప్రణాళికలు మాత్రమే సరిపోవని, కేంద్ర ఆర్థిక సహకారం కూడా ఎంతో అవసరమని తెలిపారు. కర్నాటకలోని హోసపేటలో తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్లను మూడు రాష్ట్రాల సీఎంలు డీకే శివకుమార్, రేవంత్ రెడ్డి, చంద్రబాబు, కేంద్రమంత్రి సీఆర్ పాటిల్ కలిసి ప్రారంభించారు.
తుంగభద్ర ప్రాజెక్టు 20వ గేటును సీఎం రేవంత్ రెడ్డి, 18వ గేటును కర్నాటక సీఎం డీకే శివకుమార్, 19వ గేటును ఏపీ సీఎం చంద్రబాబు, 17వ గేటును కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ ఓపెన్చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మునీరాబాద్ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఇది కేవలం డ్యామ్ 33 గేట్ల పునరుద్ధరణ కార్యక్రమం మాత్రమే కాదని, ఆనాడు మైసూరు మహారాజు, హైదరాబాద్ నిజాం ప్రభువుల కాలం నాటి మూడు తరాల నీటి సమస్యను పరిష్కరించే చరిత్రాత్మక ఘట్టమని పేర్కొన్నారు.
ఎన్నికల స్వార్థ ప్రయోజనాలు, రాజకీయాలకు అతీతంగా అంతర్రాష్ట్ర జల వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపాలని తాము గట్టిగా నిర్ణయించుకున్నామని చెబుతూ.. ‘పంచాయితీ కావాలా? పరిష్కారం కావాలా? అంటే నేను కచ్చితంగా సమస్యలకు శాశ్వత పరిష్కారమే కోరుకుంటా’ అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
తుంగభద్రలో తెలంగాణకు దక్కాల్సిన 10 టీఎంసీల నీళ్లు రావట్లేదని, రాజోలిబండ డైవర్షన్ స్కీమ్(ఆర్‌డీఎస్) ద్వారా తమకు 15.9 టీఎంసీల కేటాయింపులు ఉండగా, ప్రస్తుతం ఐదారు టీఎంసీలే వస్తున్నాయని రేవంత్ రెడ్డి అన్నారు.
తెలంగాణ వైపు నదిలో పూడిక పేరుకుపోవడం వల్ల నష్టపోతున్న గద్వాల, అలంపూర్, పాలమూరు వలస ప్రాంతాల రైతుల కోసం సమస్యను పరిష్కరించేందుకు చొరవ చూపాలని సీఆర్ పాటిల్‌కు సీఎం విజ్ఞప్తి చేశారు. చత్తీస్‌గఢ్, జార్ఖండ్ వంటి నదీ పరివాహక ప్రాంతాల సమస్యలను దూరం చేయడానికి కేంద్రం చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇవ్వబోయే దానిపై సరిహద్దు గ్రామాల్లోని రైతులంతా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారని చెప్పారు. త్వరలోనే తమ ప్రాంత రైతాంగానికి సాగునీరు అందబోతుందనే శుభవార్తను తమ మంత్రులు, ఎమ్మెల్యేలు పల్లెపల్లెకూ తీసుకెళ్లి ప్రజలను ఒప్పిస్తారని సీఎం వివరించారు.
మూడు రాష్ట్రాల ఉమ్మడి కార్యాచరణ
తాగునీరు, సాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతుంటే, మన పొలాల్లో పారాల్సిన జలాలు సముద్రం పాలు కావడం బాధాకరమని సీఎం అన్నారు. ఈ దుస్థితిని మార్చేందుకే కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆహ్వానం మేరకు కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, తాను ఇక్కడికి వచ్చామని చెప్పారు.
మూడు రాష్ట్రాల ప్రతినిధులం తుంగభద్ర నది ఒడ్డున కలిసి కూర్చుని చర్చించడం శుభపరిణామన్నారు. ఈ చర్చల ద్వారా ఒక స్పష్టమైన అవగాహనకు వచ్చామని, దీనికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. జల వనరుల సద్వినియోగం ద్వారానే ఈ ప్రాంతాల్లో ఆర్థిక స్థిరత్వం వస్తుందని, ఇందుకోసం మూడు రాష్ట్రాలు కలిసి పనిచేస్తాయని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సీఎం కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌కు ప్రత్యే క విజ్ఞప్తులు చేశారు. ఇది కేవలం కొన్నేండ్ల సమస్య కాదని, దాదాపు వందేళ్ల నాటి చారిత్రక సమస్య అని గుర్తుచేశారు. నదీ జలాల కోసం జరుగుతున్న వివాదాలను పరిష్కరించడానికి సీఆర్ పాటిల్ ఒక ఆర్బిట్రేటర్‌గా, జడ్జిగా వ్యవహరించి తగిన నిర్ణయాలు తీసుకోవాలని కోరారు.
గతంలో గుజరాత్ పరిధిలోని కచ్ ప్రాంతంలో నీటి ఎద్దడిని తీర్చిన అనుభవం పాటిల్‌కు ఉందని, ఇక్కడ కూడా అదే తరహా పరిష్కారాన్ని చూపాలని అభ్యర్థించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నందున ఈ ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వమే నిధులు మంజూరు చేసి ఆదుకోవాలని కోరారు. కేంద్రం అండగా నిలిస్తే రాష్ట్రాలు కలిసి ముందుకు సాగుతాయని తెలిపారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం ఏ సమస్యనైనా సీఆర్ పాటిల్‌కు అప్పగిస్తే అది కచ్చితంగా పరిష్కారమవుతుందని సంపూర్ణంగా విశ్వసిస్తారని సీఎం అన్నారు. అటువంటి సమర్థుడైన నాయకుడు కేంద్ర జలశక్తి శాఖను నిర్వహించడం ఏపీ , కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల ప్రజల అదృష్టమని అభిప్రాయపడ్డారు. ఈ మూడు రాష్ట్రాల పరిధిలోని తాగునీరు సాగునీటి సమస్యలకు ఆయన నాయకత్వంలో ఖచ్చితంగా ఒక సరైన మార్గం దొరుకుతుందని, అంతరాష్ట్ర జల వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరిస్తారని ఆశిస్తున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు.
అంతర్రాష్ట్ర జలాల సమస్యల పరిష్కారానికి ఉమ్మడి కమిటీతో కలిసి పనిచేస్తం
ఈ సంయుక్త సమావేశాన్ని అత్యంత విజయవంతంగా నిర్వహించిన కర్నాటక సీఎం డీకే శివకుమార్‌ను రేవంత్ రెడ్డి తన పెద్దన్నగా పేర్కొన్నారు. కేంద్ర జలశక్తి మంత్రి సమక్షంలో మూడు రాష్ట్రాల ముఖ్య ప్రతినిధులు ఒకే వేదికపైకి రావడం దేశంలోనే ఒక అరుదైన అద్భుతమైన విషయమని కొనియాడారు.
అంతర్రాష్ట్ర జలాల సమస్యల పరిష్కారానికి కేంద్రం ఏర్పాటు చేయబోయే ఉమ్మడి కమిటీతో కలిసి పనిచేయడానికి తెలంగాణ సిద్ధంగా ఉందని ప్రకటించారు. తమ ప్రాంత రైతులకు త్వరలోనే సాగునీరు అందుతుందనే నమ్మకంతో ఇక్కడి నుంచి వెళ్తున్నామని చెప్పారు. ఈ సమావేశం ద్వారా లభించిన సానుకూల ఫలితాలను తమ ప్రాంత ప్రజలకు, రైతులకు చేరవేసి వారిలో భరోసా నింపుతామన్నారు.
నదుల అనుసంధానమే దేశానికి శ్రీరామరక్ష: చంద్రబాబు నాయుడు
దేశాన్ని అగ్రపథాన నిలపాలన్నా.. రైతులను కరవు నుంచి కాపాడాలన్నా ఒకే ఒక్క మార్గం.. నదుల అనుసంధానమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. గంగ–కావేరి నదులను అనుసంధానించిన రోజే దేశానికి నిజమైన జల భద్రత లభిస్తుందన్నారు. ఆ రోజు భారత్‌ను అడ్డుకోవడం ఎవరి తరమూ కాదన్నారు. ప్రస్తుతం ఎల్ నినో ప్రభావంతో తుంగభద్ర, అల్మట్టి జలాశయాలకు సరిగ్గా ఇన్‌ఫ్లోస్ రాక రైతాంగం ఆందోళనలో ఉందన్నారు.
‘‘నీటి ఎద్దడి వల్ల దేశాల మధ్య, రాష్ట్రాల మధ్య, చివరకు జిల్లాల్లోని రైతుల మధ్య కూడా ఘర్షణలు చూస్తున్నాం. వీటన్నింటికీ నదుల అనుసంధానమే ఏకైక విరుగుడు. మిగులు జలాలు ఉన్న ప్రాంతాల నుంచి లోటు ఉన్న ప్రాంతాలకు నీటిని మళ్లించడం ద్వారా కరవును సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. ప్రధాని మోదీ చెప్తున్నట్టుగా.. మొదట రాష్ట్రాల పరిధిలోని అంతర్గత నదుల అనుసంధానం పూర్తి చేసి, ఆపై అంతర్రాష్ట్ర నదుల అనుసంధానం వైపు అడుగులు వేయాలి’’ అని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి డైనమిక్ లీడర్ అని.. తెలంగాణ రాష్ట్ర విషయంలో ఆయన ఎప్పటికీ రాజీపడని పేర్కొన్నారు.
సామరస్యంగా పరిష్కరించుకుందాం
అంతర్రాష్ట్ర జలవివాదాలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని తెలంగాణ, ఏపీ, కర్నాటక సీఎంలు నిర్ణయించారు. ఈ విషయంలో కేంద్రం చొరవ తీసుకొని సమావేశాలు ఏర్పాటుచేస్తే చాలా సమస్యలు పరిష్కరించుకోవచ్చని అభిప్రాయపడ్డారు. గురువారం డ్యామ్ క్రస్ట్ గేట్ల ప్రారంభోత్సవం సందర్భంగా హోస్పేట్‌లోని ఐఆర్‌బీ అతిథి గృహంలో కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్, తెలంగాణ, ఏపీ, కర్నాటక సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, డీకే శివకుమార్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అంతరాష్ట్ర వివాదాలు, నీటి పంపకాలపై చర్చించారు.
రాష్ట్రాల హక్కులు, అవసరాలు, ట్రిబ్యునల్ తీర్పులు, సాంకేతిక అంశాలపై వివాదాలు ఉన్నందున కేంద్రం చొరవ తీసుకుని సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు. తుంగభద్ర, కృష్ణా పరివాహక ప్రాంతాల్లో భద్రత, రైతుల ప్రయోజనాలపై పొరుగు రాష్ట్రాలు సహకార స్ఫూర్తితో వ్యవహరించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.
