- దేశంలో ఎమర్జెన్సీ విధించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది వాళ్లే: రాంచందర్ రావు
- రాజ్యాంగ పీఠికను మార్చిన చరిత్ర కాంగ్రెస్‌ది అని మండిపాటు
- పార్టీ స్టేట్ ఆఫీసులో ‘సంవిధాన్ హత్యా దివస్’నిర్వహణ
హైదరాబాద్, వెలుగు: రాజ్యాంగాన్ని కాలరాసి, ప్రజాస్వామ్యాన్ని అణచివేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని బీజేపీ స్టేట్ చీఫ్ ఎన్.రాంచందర్ రావు అన్నారు. ఇందిరా గాంధీ రాజ్యాంగాన్ని అవమానించి ఎమర్జెన్సీ విధిస్తే.. ఇప్పుడు ఆమె మనుమడు రాహుల్ గాంధీ రాజ్యాంగ పుస్తకం పట్టుకుని దేశమంతా తిరగడం హాస్యాస్పదమని విమర్శించారు. అసలు రాజ్యాంగంపై రాహుల్‌కు అవగాహనే లేదని, దాని గురించి మాట్లాడే నైతిక హక్కు ఆయనకు లేదన్నారు. కాంగ్రెస్ విధించిన ఎమర్జెన్సీకి 51 ఏండ్లు పూర్తయిన సందర్భంగా గురువారం పార్టీ స్టేట్ ఆఫీసులో ‘సంవిధాన్ హత్యా దివస్’ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు, హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయతో కలిసి రాంచందర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1975లో అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా వస్తే.. ప్రధాని పదవిని కాపాడుకునేందుకు ఆమె దేశంపై అప్రకటిత యుద్ధాన్ని (ఎమర్జెన్సీ) ప్రకటించారని గుర్తుచేశారు. రాజ్యాంగ నిర్మాతలు ఎంతో కష్టపడి రూపొందించిన స్ఫూర్తిని ఒక్క రోజులో కాంగ్రెస్ కాలరాసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమర్జెన్సీ కాలంలో దేశవ్యాప్తంగా 2.20 లక్షల మందిని అక్రమంగా జైళ్లలో బంధించారని, 35 వేల మందిపై మీసా వంటి కఠిన చట్టాలను ప్రయోగించారని చెప్పారు. సంజయ్ గాంధీ నేతృత్వంలో 1.2 కోట్ల మందికి బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించారని, 50 లక్షల ఇండ్లను కూల్చివేసి పేదలను రోడ్డున పడేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్సే రిజర్వేషన్లకు వ్యతిరేకం..
కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ వెనుకబడిన వర్గాలకు, దళితులకు వ్యతిరేకమేనని రాంచందర్ రావు విమర్శించారు. 1961లో జవహార్ లాల్ నెహ్రూ స్వయంగా కుల ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వడం తనకు ఇష్టం లేదని లేఖ రాశారని గుర్తుచేశారు. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగ పీఠికనే మార్చిన ఘనత ఆ పార్టీది కాదా అని ప్రశ్నించారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడి జైలుకెళ్లిన వాజ్‌పేయి, అద్వానీ, జయప్రకాశ్ నారాయణ్, దత్తాత్రేయ వంటి యోధుల త్యాగాలను యువత తెలుసుకోవాలని హితవు పలికారు.
ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసినందుకు కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఫొటో, స్లాట్ ఎగ్జిబిషన్‌ను విద్యాసాగర్ రావు, దత్తాత్రేయ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మల్క కొమరయ్య, బీజేపీ నేతలు కాసం వెంకటేశ్వర్లు, జనార్దన్ రెడ్డి, చింతల రాంచందర్ రావు, గౌతమ్ రావు తదితరులు పాల్గొన్నారు.
