సర్‌‌ షురూ.. ఇంటింటికీ వెళ్తున్న బీఎల్‌వోలు

సర్‌‌ షురూ.. ఇంటింటికీ వెళ్తున్న బీఎల్‌వోలు
  • రాష్ట్రవ్యాప్తంగా మొదలైన వివరాల పరిశీలన
  • హైదరాబాద్‌లో మొదటిరోజు నమోదు 0.53 శాతమే 

హైదరాబాద్ సిటీ/ హైదరాబాద్‌‌, వెలుగు: ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియ గురువారం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైంది. బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌‌వో) ప్రతి ఇంటికీ నేరుగా వెళ్లి ఓటర్ల వివరాలను పరిశీలించడం మొదలుపెట్టారు. మారుమూల గ్రామాల్లో కూడా డప్పు చాటింపులు, వీధి నాటకాలు, మహిళా సంఘాల ద్వారా సదస్సులు ఏర్పాటు చేసి సర్‌‌‌‌పై చైతన్యం కల్పిస్తున్నారు. ఏఐ టెక్నాలజీతో రూపొందించిన ప్రత్యేక అవగాహన వీడియోలు, డిజిటల్ స్క్రీన్లు, సోషల్ మీడియా రీల్స్ వంటివాటి ద్వారా ఓటు హక్కు ప్రాముఖ్యతను వివరిస్తున్నారు.

సర్‌‌‌‌లో భాగంగా మరణించిన వారి పేర్లు, ఒకే పేరుతో ఉన్న డూప్లికేట్ ఓట్లు, ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా వలసవెళ్లిన వారి వివరాలను ఓటరు జాబితా నుంచి తొలగించనున్నారు. అంతేకాకుండా జూలై 1 నాటికి 18 ఏళ్లు నిండేవారికి కొత్తగా ఓటు హక్కు కల్పించేందుకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.

మొదటి దశలో ప్రతి ఇంటికీ ముందే ముద్రించిన దరఖాస్తు ఫారాలను అందజేసి, ఓటర్ల ఫొటోలు, చిరునామా సరిచూసే ప్రక్రియ పూర్తి చేస్తారు. ఆ తర్వాత జూలై 31న ముసాయిదా ఓటరు జాబితాను ప్రకటించనున్నారు. అనంతరం అభ్యంతరాల స్వీకరణ, విచారణలు పూర్తి చేసి అక్టోబర్ 1న తుది ఓటరు జాబితాలను రిలీజ్ చేయనున్నారు.

నగరంలో తొలిరోజు నత్తనడకన..
హైదరాబాద్‌‌లో సర్‌‌ ప్రక్రియ తొలిరోజు నత్తనడకన సాగింది. ఓటర్ల వివరాల సేకరణ, ధ్రువీకరణ కోసం ఫీల్డ్‌‌లోకి వెళ్లిన బీఎల్‌‌వోలకు పూర్తిస్థాయిలో ఫామ్స్ (ఎన్యుమరేషన్ పత్రాలు) అందుబాటులో లేవు. దాంతో చాలా ప్రాంతాల్లో ప్రక్రియ ప్రారంభం కాలేదు. ఖైరతాబాద్, సనత్ నగర్, సికింద్రాబాద్, గోషామహల్, నాంపల్లి నియోజకవర్గాల్లోనే వివరాల సేకరణ జరిగింది.

దీంతో మొదటిరోజు కేవలం 0.53 శాతం మాత్రమే పూర్తైంది. ఎంతో కీలకమైన ఈ సర్వేకు సంబంధించి ముందస్తు ప్రణాళిక, సమన్వయం లోపించిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. శుక్రవారం అన్ని నియోజకవర్గాలకు ఫామ్స్ అందనున్నట్లు అధికారులు తెలిపారు.