తెలంగాణ ఏటీసీలు.. దేశానికే ఆదర్శం.. యువతకు ఉపాధి కల్పించేందుకే ఏర్పాటు: మంత్రి వివేక్ వెంకటస్వామి

తెలంగాణ ఏటీసీలు.. దేశానికే ఆదర్శం.. యువతకు ఉపాధి కల్పించేందుకే ఏర్పాటు: మంత్రి వివేక్ వెంకటస్వామి
  • ఏటీసీ స్టూడెంట్లకు ప్రతి నెల రూ.2 వేల స్టైపెండ్ 
  • టామ్‌కామ్‌లో జర్మన్ ​భాషలో యువతకు శిక్షణ ఇస్తున్నామని వెల్లడి
  • రంగారెడ్డిగూడలో రూ.12 కోట్లతో ఏటీసీ సెంటర్‌‌కు శంకుస్థాపన

జడ్చర్ల టౌన్​/బాలానగర్, వెలుగు: రాష్ట్రంలో ఏర్పాటు చేసిన అడ్వాన్స్‌‌‌‌డ్‌‌ ట్రైనింగ్ సెంటర్లు (ఏటీసీ) దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నాయని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. గురువారం మహబూబ్‌‌నగర్ జిల్లా రాజాపూర్ మండలం రంగారెడ్డిగూడలో రూ.12 కోట్లతో నిర్మించనున్న ఏటీసీకి జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డితో కలిసి గురువారం మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ, యువతకు ప్రపంచస్థాయి సాంకేతిక శిక్షణ అందించి మెరుగైన ఉపాధి కల్పిచేందుకు ఈ సెంటర్‌‌‌‌ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని 65 ఐటీఐలకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదేండ్లలో ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడంతో అవి మూతపడే పరిస్థితికి వచ్చాయన్నారు.

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సీఎం రేవంత్ రెడ్డి చొరవతో టాటా సంస్థతో మాట్లాడి రూ.2,200 కోట్లతో ఏటీసీలుగా అభివృద్ధి చేశామని చెప్పారు. ఐటీఐలు లేకపోయినా ప్రతి నియోజకవర్గంలో మరో రూ.2 వేల కోట్లతో ఏటీసీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. ఇక్కడ చదువుకునే విద్యార్థులకు ప్రతి నెల రూ.2 వేల స్టైపెండ్ ఇస్తున్నామన్నారు.

ఉపాధి శిక్షణ సంస్థలకు సంబంధించి ఇటీవల కేంద్ర మంత్రి నిర్వహించిన రివ్యూలో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. ఏటీసీల్లో కొత్త కోర్సుల అమలు కోసం ఏర్పాటు చేసిన కమిటీకి తనను చైర్మన్‌‌గా నియమించినట్టు చెప్పారు. జర్మనీ భాష నేర్పిస్తే తమ దేశంలో రూ.5 లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు ఆ దేశం సిద్ధంగా ఉందని, ఈ మేరకు ఎంఓయూను కూడా కుదుర్చున్నారని మంత్రి తెలిపారు. 

కొత్త టెక్నాలజీ నేర్చుకోండి..
యువత కొత్త టెక్నాలజీని నేర్చుకొని భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా మారాలని మంత్రి వివేక్‌‌ వెంకటస్వామి సూచించారు. పరిశ్రమలు, ఐటీ రంగం, తయారీ తదితర ఆధునిక రంగాల్లో అవసరమైన నైపుణ్యాలను యువతకు అందించి బలమైన మానవ వనరుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. పారిశ్రామిక అభివృద్ధిలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని, నైపుణ్యాభివృద్ధిలోనూ ముందడుగు వేస్తోందన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనడం లేదంటూ బీఆర్ఎస్ అబద్ధపు ప్రచారం చేస్తోందని ఆయన మండిపడ్డారు.

తెలంగాణ ప్రభుత్వం యువత భవిష్యత్తు నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తోందని, అందులో భాగంగానే రంగారెడ్డిగూడలో ఏటీసీని ఏర్పాటు చేసిందని ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి అన్నారు. నైపుణ్యం ఉన్న యువతకు విదేశాల్లో మంచి అవకాశాలు లభిస్తున్నాయని, అందువల్ల గ్రామీణ ప్రాంత విద్యార్థులు, యువతకు అత్యాధునిక సాంకేతిక శిక్షణ అందిచేందుకు ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ కేంద్రం ద్వారా ఇండస్ట్రియల్ ఆటోమేషన్, డిజిటల్ టెక్నాలజీ, ఆధునిక యంత్రాల నిర్వహణ, కంప్యూటర్ ఆధారిత నైపుణ్యాలు, సాంకేతిక కోర్సులు, పరిశ్రమలకు అవసరమైన ప్రత్యేక శిక్షణ అందించనున్నట్లు చెప్పారు.