- ఆస్తి కోసం భర్తతో కలిసి దారుణానికి ఒడిగట్టిన హసీనా మొదటి భర్త కూతురు
- సుపారీ ఇచ్చి హత్యకు ప్లాన్
- సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నిందితులను పట్టుకున్న పోలీసులు
నల్గొండ, వెలుగు: నల్గొండ జిల్లా కేంద్రంలోని తెలంగాణ కాలనీలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి హత్య కేసును పోలీసులు చేధించారు. ఆస్తి కోసం కన్న తల్లిని, కుటుంబ సభ్యులను సొంత కూతురే సుపారీ గ్యాంగ్‌తో చంపించినట్టు తేల్చారు. మహ్మద్ సుల్తాన్ భార్య హసీనా మొదటి భర్త కూతురు, ఆమె భర్త ఈ దారుణానికి ఒడిగట్టినట్టు గుర్తించారు. హసీనా కూతురు, అల్లుడితో పాటు హత్య చేసిన గ్యాంగ్‌లోని ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్టు తెలిపారు.
ఈ నెల 22న బ్యాగుల వ్యాపారి మహమ్మద్ సుల్తాన్, ఆయన భార్య హసీనా, సుల్తాన్ మొదటి భార్యకొడుకు ముజమ్మిల్, కూతురు అక్సర డెడ్‌బాడీలను పోలీసులు కుళ్లిపోయిన స్థితిలో కనుగొన్నారు. తొలుత వారిది ఆత్మహత్య అయి ఉంటుందని భావించినా.. పోస్టుమార్టం రిపోర్టులో డెడ్‌బాడీలపై పదునైన ఆయుధాలతో దాడి చేసిన గుర్తులు ఉండడంతో పోలీసులు హత్యగా నిర్ధారించి విచారణ చేపట్టారు. హత్యకు గురైన హసీనాకు గతంలో రెండు పెండ్లిళ్లు జరిగాయి. నల్గొండకు చెందిన మహ్మద్ సుల్తాన్‌ను ఆమె మూడో వివాహం చేసుకున్నారు.
సుల్తాన్‌కు కూడా గతంలో రెండు పెండ్లిళ్లు కాగా.. ఆయన మొదటి భార్య పిల్లలు ముజమ్మిల్, అక్సరతో కలిసి హసీనా నల్గొండలో ఉంటున్నారు. హసీనా మొదటి భర్తతో కలిసి ఉన్నప్పుడు వారసత్వంగా వచ్చిన కోట్లాది రూపాయల విలువైన ఆస్తులు ఆమె పేరు మీదే ఉన్నాయి. విడాకుల అనంతరం భరణంగా ఇచ్చిన డబ్బుతో ఆమె నల్గొండలో ఒక ఇల్లు కొనుక్కుంది. హసీనా పేరు మీద ఉన్న సుమారు రూ.2 కోట్లకు పైగా విలువైన వ్యవసాయ భూమిని తమకు ఇచ్చేయాలని ఆమె మొదటి భర్త కూతురు బుశ్రబుతుల్, అల్లుడు హర్షన్ పలుమార్లు గొడవపడ్డారు. అందుకు హసీనా నిరాకరించడంతో ఆ వ్యవసాయ భూమి పట్టాదారు పాస్ బుక్కులను కాజేయాలని మూడు నెలల కింద చోరీకి కూడా ప్రయత్నించారు.
ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఓ ఫంక్షన్లో కూడా వారి మధ్య గొడవ జరిగినట్టు తెలిసింది. తన పేరిట ఉన్న ఆస్తిని సుల్తాన్ పిల్లలైన ముజమ్మిల్, అక్సర పేరిట వీలునామా రాస్తానని హసీనా చెప్పడంతో బుశ్రబుతుల్ కక్ష పెంచుకుంది. ఆస్తి తమకే దక్కాలంటే హసీనా కుటుంబంలో అందరినీ హత్య చేయాలని డిసైడ్ అయ్యింది.
భర్త సహాయంతో హైదరాబాద్ పాతబస్తీకి చెందిన ఓ గ్యాంగ్‌ను సంప్రదించారు. రూ.5 లక్షలకు సుపారీ మాట్లాడుకుని, పక్కాగా రెక్కీ నిర్వహించి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. హత్య జరిగిన రోజు సాయంత్రం హసీనా కూతురు బుశ్రబుతుల్ నల్గొండలోని వారి ఇంటికి వెళ్లి అక్కడే ఉండిపోయింది. తెల్లవారుజామున 4 గంటలకు ఆమె తలుపులు తెరవగా సుపారీ గ్యాంగ్లోపలికి వచ్చింది. నిద్రలో ఉన్న హసీనా, సుల్తాన్, ముజమ్మిల్, అక్సరను క్రూరంగా కత్తులతో పొడిచి చంపారు.
ఎదురు తిరిగినందుకు 16 పోట్లు.. చిన్నారిని కూడా వదలని క్రూరత్వం
కరాటే తెలిసిన ముజమ్మిల్ హంతకులను అడ్డుకునే ప్రయత్నం చేయగా.. అతడిని ఏకంగా 16 సార్లు కత్తితో పొడిచారు. 11 ఏండ్ల చిన్నారి అక్సర మంచం కింద దాక్కోగా కనికరం లేకుండా మంచం కింద నుంచి లాగి మరీ గొంతు కోశారు. గోడకేసి కొట్టి 9 చోట్ల పొడిచారు. హసీనా, సుల్తాన్ నిద్రలో ఉండగానే 6, 7 చోట్ల పొడిచి చంపేశారు.
హత్య చేసి నిందితులు ఇంటికి బయటి నుంచి తాళం వేసి పరారయ్యారు. మూడు రోజుల తర్వాత ఇంటి నుంచి దుర్వాసన రావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ నేతృత్వంలో 10 ప్రత్యేక బృందాలు కాల్ డేటా, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేయగా.. హసీనా పెద్ద కూతురు, అల్లుడి ప్రవర్తనపై అనుమానం వచ్చింది. హత్య జరిగిన సమయంలో వారి ఫోన్ లొకేషన్లు ఘటనా స్థలంలోనే ఉండటంతో అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజం బయటపడింది. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
