గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై మంత్రి వివేక్ వెంకటస్వామి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గత పదేళ్ల పాలనలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం పేదలకు ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే నిరంతరాయంగా అర్హులకు రేషన్ కార్డులు ఇస్తున్నామని, ఇందిరమ్మ ఇండ్ల పంపిణీతో నిరుపేదల ముఖాల్లో సంతోషం కనిపిస్తోందని అన్నారు.
మిషన్ భగీరథ ఒక అట్టర్ ఫ్లాప్ ప్రాజెక్ట్. గత ప్రభుత్వం వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేసినా.. కనీసం ఒక్క ఇంటికి కూడా చుక్క తాగునీరు ఇవ్వలేకపోయింది అని మంత్రి వివేక్ దుయ్యబట్టారు.సమస్యల పరిష్కారమే లక్ష్యంగా చెన్నూరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుపుతామని మంత్రి వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు.
చెన్నూరు నియోజకవర్గం కోటపల్లి మండల పరిధిలోని లింగన్నపేట, యెదులబంధం, రొయ్యలపల్లి, అలూగామ, జనగామ గ్రామాల్లో రూ. 60 లక్షల నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు మంత్రి వివేక్ వెంకటస్వామి శంకుస్థాపన చేశారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. రోడ్లు, డ్రైనేజీలతో పాటు తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పర్యటనలో భాగంగా ఎదులబంధం ఎంపీపీ స్కూల్‌ను సందర్శించిన మంత్రి.. పాఠశాలకు కాంపౌండ్ వాల్, అదనపు తరగతి గదులను వెంటనే నిర్మించాలని అధికారులను ఆదేశించారు.
ALSO READ : తెలంగాణలో రాబోయే ఐదు రోజులు భారీ వర్షాలు..
అభివృద్ధి పనుల అనంతరం, వెంచపెల్లి గ్రామంలో ఇటీవల ప్రాణహిత నదిలో పడి మృతి చెందిన పబ్బా అజయ్ గౌడ్ కుటుంబాన్ని మంత్రి వివేక్ వెంకటస్వామి పరామర్శించారు. అజయ్ గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఆయన.. బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చి, ప్రభుత్వ పరంగా అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
