జన్నారం, వెలుగు: పెట్రోలింగ్ కు వెళ్లిన ఫారెస్ట్ ఆఫీసర్లపై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా జన్నారం మండలం బాదంపెల్లి సమీపంలో ఆదివారం రాత్రి జరిగింది. ఫారెస్ట్ ఆఫీసర్లు తెలిపిన వివరాల ప్రకారం... జన్నారం ఫారెస్ట్ డివిజన్ లోని పైడిపెల్లి, రాయికుంట, తాళ్లపేట ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు శ్రీకాంత్, మక్బూల్, రహీమోద్దీన్, బేస్ క్యాంప్ సిబ్బంది, డ్రైవర్ తో కలిసి ఆదివారం రాత్రి బాదంపెల్లి గోదావరి సమీపంలో పెట్రోలింగ్ చేస్తున్నారు. ఇదే సమయంలో కొందరు వ్యక్తులు ఒక్కసారిగా ఫారెస్ట్ ఆఫీసర్లను బూతులు తిడుతూ రాళ్లతో దాడి చేశారు.
మరో వైపు ఇసుక రవాణాను అడ్డుకునేందుకు ఫారెస్ట్ ఆఫీసర్లు ఏర్పాటు చేసిన బేస్ క్యాంప్ మంచెను సైతం కూల్చివేశారు. అప్రమత్తమైన ఫారెస్ట్ ఆఫీసర్లు వారి నుంచి తప్పించుకొని జన్నారం మండల కేంద్రానికి చేరుకొని, పోలీసులకు సమాచారం ఇచ్చారు. జన్నారం ఎస్సై ఉదయ్ కిరణ్ వెంటనే బాదంపెల్లి గోదావరి వద్దకు చేరుకున్నటికీ దాడి చేసిన వారి ఆచూకీ దొరకలేదు. అయితే ఇసుక అక్రమ రవాణా చేసే వారే ఈ దాడికి పాల్పడి ఉంటారని ఫారెస్ట్ ఆఫీసర్లు అనుమానిస్తున్నారు.
