పరిగి, వెలుగు: పరిగిలో భారీగా నకిలీ పత్తి విత్తనాలను సీజ్ చేసినట్లు వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రా తెలిపారు. సోమవారం పరిగి సర్కిల్ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. పరిగి మున్సిపల్ పరిధిలోని తుంకులగడ్డ డబుల్ బెడ్‌రూం భవనంలో కొందరు నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్నారన్న సమాచారంతో డీఎస్పీ అంజయ్య, సీఐ కొండల్ రెడ్డి, జిల్లా టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ అన్వర్ పాషా దాడులు చేపట్టారు.
సోమవారం మధ్యాహ్నం లఖ్నాపూర్ నుంచి పరిగి వైపు వస్తున్న బైక్‌ను ఆపి తనిఖీ చేయగా నకిలీ పత్తి విత్తనాల బ్యాగ్ లభ్యమైంది. నారాయణపేట్ జిల్లా కోస్గి మండలం సజ్జాఖాపేట్‌కు చెందిన మునగారి హన్మయ్య అలియాస్ పెంటప్ప, మహబూబ్‌నగర్‌కు చెందిన నాదెండ్ల నరసింహం అలియాస్ నర్సింగరావు, నారాయణపేట్ జిల్లా మద్దూరుకు చెందిన నరేందర్ అలియాస్ రాజు, వికారాబాద్ జిల్లా దూద్యాల మండలం హకీంపేట్‌కు చెందిన దొరమోని మల్లేశ్, దౌల్తాబాద్ మండలానికి చెందిన ఓరుగంటి మల్యాద్రిని అరెస్ట్ చేశారు. 23 క్వింటాళ్ల(53 బస్తాలు) నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.35 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.
