న్యూఢిల్లీ: పార్లమెంట్ ఉభయ సభల్లోని తమ పార్టీ ఎంపీలకు కాంగ్రెస్ హైకమాండ్ త్రీ లైన్ విప్ జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం వివాదాస్పద ఎఫ్‌సీఆర్‌ఏ సవరణ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టనుందన్న వార్తల నేపథ్యంలో ఆగస్ట్ 10, 11, 12 తేదీలలో పార్లమెంట్‌కు తప్పక హాజరు కావాలని ఆదేశించింది. ఎఫ్‌సీఆర్‌ఏ సవరణ బిల్లుపై పార్టీకి వైఖరికి మద్దతు ఇవ్వాలని ఎంపీలకు సూచించింది. ఈ మేరకు ఇండీ కూటమి ఎంపీలకు కూడా కాంగ్రెస్ సమాచారం ఇచ్చింది.
ఏంటీ ఎఫ్‌సీఆర్‌ఏ సవరణ బిల్లు..?
విదేశీ విరాళాల నియంత్రణ సవరణ (ఎఫ్‌సీఆర్‌ఏ) బిల్లు-2026ను బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మార్చి 25న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. స్వచ్ఛంద సంస్థలు (NGOs), మతపరమైన ట్రస్టులు పొందే విదేశీ నిధుల పారదర్శకతను పెంచడం, దుర్వినియోగాన్ని అడ్డుకోవడం ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం. ప్రస్తుత పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఈ బిల్లుపై చర్చ, ఆమోద ప్రక్రియ జరగనుంది. అయితే, ఈ బిల్లును ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
కోర్టు అనుమతి లేకుండా కేవలం పరిపాలనాపరమైన నిర్ణయాల ద్వారానే ఎన్‌జీవోల ఆస్తులను స్వాధీనం చేసుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని కాంగ్రెస్ విమర్శించింది. ఈ నేపథ్యంలోనే పార్లమెంట్లో బిల్లును అడ్డుకునేందుకు పార్టీ ఎంపీలకు కాంగ్రెస్ త్రీ లైన్ విప్ జారీ చేసింది. ఎఫ్ సీఆర్ఏ బిల్లుపై చర్చ, ఆమోదం నేపథ్యంలో ఆగస్ట్ 10, 11, 12 తేదీల్లో తప్పకుండా సభకు హాజరు కావాలని ఆదేశించింది.
