ఉద్యోగాల కోసం దుబాయ్ వెళ్లే తెలుగు వారిలో చాలామంది అద్దె ఖర్చులు తగ్గించుకోవడానికి స్నేహితులు, సహోద్యోగులతో కలిసి ఒకే ఫ్లాట్‌లో ఉంటుంటారు. అయితే ఇలాంటి షేర్డ్ అకామడేషన్ విధానంపై దుబాయ్ ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. Dubai Law No. (4) of 2026 పేరుతో తీసుకొచ్చిన ఈ చట్టం 2026 ఆగస్టు 26 ప్రాంతంలో అమల్లోకి రానుంది. ఈ చట్టం రూమ్ షేరింగ్‌ను పూర్తిగా నిషేధించడం లేదు. కానీ అనుమతి లేకుండా గదులు, బెడ్‌స్పేస్‌లను అద్దెకు ఇవ్వడంపై కఠిన నిబంధనలు తీసుకొచ్చింది.
అద్దెకు తీసుకున్న ఫ్లాట్‌లోని ఒక గదిని లేదా బెడ్‌ను మరో వ్యక్తికి అద్దెకు ఇవ్వాలంటే ఇంటి యజమాని నుంచి తప్పనిసరిగా లిఖితపూర్వక అనుమతి తీసుకోవాల్సిందేనని కొత్త చట్టం చెబుతోంది. దుబాయ్ చట్టాల ప్రకారం ఇది సబ్‌లెట్టింగ్ కిందకు వస్తుంది. ఉదాహరణకు ఒక బెడ్‌రూమ్ ఫ్లాట్‌ను అద్దెకు తీసుకున్న వ్యక్తి అద్దె భారాన్ని తగ్గించుకోవడానికి మరో వ్యక్తిని తీసుకురావాలనుకుంటే, ముందుగా ఇంటి యజమాని నుంచి రాతపూర్వక అనుమతి తీసుకోవాలి. లేకపోతే రెంటల్ అగ్రిమెంట్ ఉల్లంఘించినట్లే పరిగణిస్తారు.
కొత్త చట్టంతో షేర్డ్ హౌసింగ్‌కు అధికారిక అనుమతి విధానం కూడా అమల్లోకి వస్తోంది. షేర్డ్ అకామడేషన్‌గా ఉపయోగించే అపార్ట్‌మెంట్‌లు, విల్లాలకు దుబాయ్ మున్సిపాలిటీ నుంచి ప్రత్యేక పర్మిట్ ఉండాలి. ఈ అనుమతి పొందాలంటే భవనం భద్రత, అగ్నిమాపక ప్రమాణాలు, పారిశుధ్యం, ప్రతి వ్యక్తికి కనీస స్థలం, అవసరమైన సౌకర్యాలు వంటి నిబంధనలు పాటించాలి. సాధారణంగా ఈ పర్మిట్ ఒక సంవత్సరం చెల్లుబాటు అవుతుంది. అవసరమైతే రెండేళ్ల పర్మిట్ కూడా తీసుకోవచ్చు.
ఎవరు గదులు అద్దెకు ఇవ్వొచ్చు?
కొత్త చట్టం ప్రకారం ఇంటి యజమానులు, ప్రభుత్వ అనుమతి పొందిన లైసెన్స్ ఉన్న సంస్థలు మాత్రమే షేర్డ్ అకామడేషన్‌ను అద్దెకు ఇవ్వగలవు. సాధారణ అద్దెదారులు తమ ఇష్టానుసారంగా గదులు, బెడ్‌స్పేస్‌లను ఇతరులకు అద్దెకు ఇవ్వడానికి అనుమతి ఉండదు. అలాగే అనుమతి లేని పార్టిషన్ రూమ్‌లు, బెడ్‌స్పేస్ ప్రకటనలపై కూడా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోనుంది.
ALSO READ : ఏఐ గురించి కంగారు పడుతున్నారా..
మారిన చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయి. తప్పిదాన్ని బట్టి 500 దిర్హామ్‌ల నుంచి 5 లక్షల దిర్హామ్‌ల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. ఒకే తప్పు మళ్లీ చేస్తే జరిమానా 10 లక్షల దిర్హామ్‌ల వరకు పెరగవచ్చు. అంతేకాదు షేర్డ్ హౌసింగ్ పర్మిట్‌ను రద్దు చేయడం, సంబంధిత ఆస్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది.
దుబాయ్‌లో ఉద్యోగం కోసం వెళ్లే వారు అద్దె ఖర్చు తగ్గించుకోవడానికి రూమ్ షేరింగ్ చేయాలనుకుంటే ముందుగా రెంట్ అగ్రిమెంట్‌లో సబ్‌లెట్టింగ్‌కు అనుమతి ఉందో లేదో తెలుగోళ్లు చూసుకోవాలి. ఇంటి యజమాని నుంచి రాతపూర్వక అనుమతి లేకుండా ఎవరికైనా గది లేదా బెడ్ అద్దెకు ఇవ్వడం భవిష్యత్తులో భారీ జరిమానాలకు దారితీయొచ్చు. కాబట్టి కొత్త నిబంధనలను తెలుసుకుని వాటికి అనుగుణంగా వ్యవహరించడం కష్టాల నుంచి కాపాడుతుంది.
