ఏఐ గురించి కంగారు పడుతున్నారా.. భారత టెక్కీలకు శుభవార్త చెప్పిన నోమురా

ఏఐ గురించి కంగారు పడుతున్నారా.. భారత టెక్కీలకు శుభవార్త చెప్పిన నోమురా

AIతో లక్షలాది ఉద్యోగాలు పోతాయనే భయాలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. అయితే జపాన్‌కు చెందిన ఆర్థిక సంస్థ నోమురా విడుదల చేసిన తాజా రిపోర్ట్ మాత్రం భిన్నమైన స్టోరీని చూపిస్తోంది. భారత్‌లో ఏఐ కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన వారి కంటే కొత్తగా ఉద్యోగాలు పొందిన వారి సంఖ్య ఎక్కువగా ఉందని నోమురా వెళ్లడించింది. ప్రపంచంలోని అనేక కంపెనీలకు బ్యాక్ ఆఫీస్‌గా పనిచేస్తున్న భారత్.. ఉద్యోగ అవకాశాలపై ఏఐ చూపుతున్న ప్రభావాన్ని అంచనా వేయడానికి కీలక దేశంగా మారిందని నోమురా పేర్కొంది.

2022 నుంచి 2026 ఆగస్టు వరకు భారత్‌లో ఏఐ సంబంధిత రంగాల్లో 83వేల100 మంది కొత్తగా ఉద్యోగాలు పొందగా.. 31వేల 921 మంది మాత్రమే ఉద్యోగాలు కోల్పోయారని వెల్లడైంది. ఆసియాలోని 69 సంఘటనలను విశ్లేషించిన తర్వాత ఈ వివరాలను నోమురా వెల్లడించింది. ఉద్యోగాలు కోల్పోయిన వారిలో ఎక్కువ మంది కస్టమర్ సపోర్ట్ వంటి రోల్స్ లో పనిచేసేవారే. ఈ పనులను చాట్‌బాట్‌లు, AI టూల్స్ భర్తీ చేస్తున్నాయి. మరోవైపు ఏఐ సేవలకు పెరుగుతున్న డిమాండ్ కారణంగా ముఖ్యంగా ఐటీ సర్వీసెస్ రంగంలో కొత్త గ్రాడ్యుయేట్లను పెద్ద ఎత్తున నియమిస్తున్నట్లు నోమురా రిపోర్ట్ తెలిపింది.

అయితే AI ప్రభావం అందరిపై ఒకేలా ఉండడం లేదని నోమురా హెచ్చరించింది. భారత్, దక్షిణ కొరియా వంటి దేశాల్లో ఎంట్రీ లెవల్ ఉద్యోగాలపై డిమాండ్ తగ్గుతుండగా, వ్యాపార అనుభవం ఉన్న, సాంకేతిక పరిజ్ఞానం కలిగిన నిపుణుల అవసరం పెరుగుతోందని పేర్కొంది. అంటే ఏఐ కారణంగా ఉద్యోగాల స్వరూపం మారుతోంది కానీ.. ఉద్యోగాలే పూర్తిగా మాయమవుతున్నాయని చెప్పడం సరైంది కాదని రిపోర్ట్ స్పష్టం చేసింది.

ఆసియా వ్యాప్తంగా కూడా ఇదే ధోరణి కనిపిస్తోంది. పరిశీలించిన కాలంలో ఏఐ సంబంధిత రంగాల్లో లక్షా 30వేల 758 కొత్త ఉద్యోగాలు సృష్టించబడగా, 60వేల 654 ఉద్యోగాలు మాత్రమే తగ్గాయి. కొత్త ఉద్యోగాల్లో 90 శాతానికి పైగా టెక్నాలజీ రంగంలో ఉండగా.. సుమారు 60 శాతం ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగంలో ఉన్న వారు జాబ్స్ కోల్పోతున్నారని వెల్లడైంది. అయితే ఉద్యోగాలు కోల్పోయిన వారు నేరుగా ఏఐ ఇంజినీరింగ్ వంటి కొత్త అవకాశాల్లోకి వెళ్లడం అంత సులభం కాదని, అందువల్ల ఏఐ వల్ల కలిగే ప్రయోజనాలు, నష్టాలు అన్ని వర్గాలకూ సమానంగా ఉండవని నోమురా స్పష్టం చేసింది. ప్రస్తుతం ఏఐ టెక్నాలజీ ప్రారంభ దశలో ఉన్నందున.. భవిష్యత్తులో పరిస్థితులు ఎలా మారతాయో కాలమే నిర్ణయిస్తుందని పేర్కొంది నోమురా.