ఐఏఎస్ ఆఫీసర్ ఫౌజియా తరణుమ్ ను పాకిస్తానీ అని సంబోధించిన బీజేపీ ఎమ్మెల్సీ రవికుమార్ కు చురకలు అంటించింది కర్ణాటక హైకోర్టు. తనపై నమోదైన క్రిమినల్ కేసును కొట్టేయాలని కోరుతూ రవికుమార్ దాఖలు చేసిన పిటిషన్ పై శుక్రవారం ( ఆగస్టు 7 ) విచారణ చేపట్టిన కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రానికి చెందిన మహిళా ఐఏఎస్ అలాంటి వ్యాఖ్యలు సరికాదంటూ మండిపడింది హైకోర్టు. బహిరంగ సభల్లో మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించింది.
ఎమ్మెల్సీ రవికుమార్ వ్యాఖ్యలను ఏమాత్రం క్షమానించబోనని అభిప్రాయపడ్డారు న్యాయమూర్తి. ప్రజాప్రతినిధి అయ్యుండి ఇష్టం వాచినట్టు మాట్లాడటం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని సుప్రీంకోర్టుకు తీసుకెళ్లాలని అన్నారు. బహిరంగ సభల్లో మాట్లాడేటప్పుడు నాయకులు సంయమనం పాటించాలని సూచించారు.
ఇలాంటి పనికిమాలిన కేసులతో క్రిమినల్ కోర్టులు నిండిపోతున్నాయని... హత్య, బెదిరింపుల కేసులు పదేళ్లుగా పెండింగ్ లో ఉన్నాయని అన్నారు. నాయకులు నోరు అదుపులో పెట్టుకోకపోవడం వల్లే ఇలాంటి కేసులతో కోర్టులు నిండిపోతున్నాయని అన్నారు.
2025 మే నెలలో జరిగిన ఒక రాజకీయ ర్యాలీలో, ఎన్ రవికుమార్ ఆ ఐఏఎస్ అధికారిణి కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు పనిచేస్తున్నారని ఆరోపించడంతో పాటు, ఆమె పాకిస్తాన్ కు చెందినవారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత రవికుమార్ క్షమాపణ చెప్పినప్పటికీ ఆ వ్యాఖ్యల ప్రభావాన్ని క్షమాపణ చెరిపివేయగలదా అంటూ ప్రశ్నించారు న్యాయమూర్తి.మతం ఆధారంగా ఒక ఐఏఎస్ అధికారిని ఎలా విమర్శిస్తారంటూ మండిపడ్డారు.
