ఎగ్జామ్ 3 రోజుల ముందే నీట్ పేపర్ లీక్: సీబీఐ చార్జ్ షీట్‎లో చాలా సంచలనాలు

ఎగ్జామ్ 3 రోజుల ముందే నీట్ పేపర్ లీక్: సీబీఐ చార్జ్ షీట్‎లో చాలా సంచలనాలు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన నీట్ యూజీ 2026 పేపర్ లీక్ కేసుకు సంబంధించి ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో సీబీఐ చార్జ్‎షీట్ దాఖలు చేసింది. ఆగస్ట్ 7న దాఖలు చేసిన ఈ చార్జ్‏షీట్‎లో సీబీఐ సంచలన విషయాలు వెల్లడించింది. పరీక్షకు మూడు రోజుల ముందే నీట్ ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయని.. వాటిని వాట్సాప్, టెలిగ్రామ్, ఆఫ్‌లైన్ క్లాసుల ద్వారా విద్యార్థులకు చేరవేశారని తెలిపింది. పేపర్ లీక్ వ్యవహారంలో ఎన్‌టీఏకు అనుబంధంగా ఉన్న సబ్జెక్ట్ నిపుణులు, కోచింగ్ సెంటర్ నిర్వాహకులు, మధ్యవర్తులు, ఇంకా పలువురు ఇతర వ్యక్తులు పాలుపంచుకున్నారని సీబీఐ ఆరోపించింది.

నీట్ కెమిస్ట్రీ ప్రశ్నాల తయారీలో పాల్గొన్న ప్రొఫెసర్ పీవీ కులకర్ణి ఏప్రిల్ 25 నుంచి 27 మధ్య పూణేలో ప్రత్యేక తరగతులు నిర్వహించి ఈ క్లాసులకు హాజరైన విద్యార్థులకు క్వశ్చన్స్ లీక్ చేశాడని పేర్కొంది. విద్యార్థుల నోట్‌బుక్‌లలో రాసుకున్న ప్రశ్నలు.. లీకైన ప్రశ్నపత్రంతో సరిపోలుతున్నాయని తెలిపింది. అంతేకాకుండా.. కులకర్ణి మొబైల్ ఫోన్ నుంచి కెమిస్ట్రీ ప్రశ్నల ఫోటోలు, అభ్యర్థులు, వారి తల్లిదండ్రులతో అతడు జరిపిన సంభాషణలు, ఇతర కీలకమైన డిజిటల్ ఆధారాలు లభించాయని కూడాపేర్కొంది. కెమిస్ట్రీ పేపర్ లీక్ చేసిన కులకర్ణి ఫిజిక్స్ పేపర్‌ కోసం కూడా ప్రయత్నాలు చేశాడని తెలిపింది. 

ఫిజిక్స్ ప్రొఫెసర్ మనీషా వాఘ్మారేకు పేపర్ లీక్‎లో హస్తం ఉందని సీబీఐ ఆరోపించింది. పరీక్షకు ఎనిమిది రోజుల ముందే ఆమె మొబైల్ ఫోన్‌లో చేతితో రాసిన ప్రశ్నపత్రాలు ఉన్నట్లు విచారణలో గుర్తించినట్లు పేర్కొంది. ఆమె ఈ ప్రశ్నపత్రాలను మరో నిందితుడైన తేజస్ షాకు అందించగా.. అతడు వాట్సప్ ద్వారా విద్యార్థుల తల్లిదండ్రులకు చేరవేశాడని ఆరోపించింది. ఇందుకోసం విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి రూ.4 లక్షల వరకు వసూల్ చేశారని ఆరోపించింది. బోటనీ నిపుణురాలు మనీషా గురునాథ్ మాంధరే తన ఇంట్లో జీవశాస్త్ర తరగతులు నిర్వహించి.. విద్యార్థులకు ప్రశ్నాలు లీక్ చేశారని తెలిపింది. 

ALSO READ : ప్రధాని మోడీ వార్నింగ్..

విద్యార్థులకు ఆమె చెప్పిన ప్రశ్నలే నీట్ పేపర్‎లో వచ్చినట్లు గుర్తించామని తెలిపింది. నిందితులు ఎన్‌టీఏ కార్యాలయంలోకి వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు సరైన తనిఖీలు లేకపోవడాన్ని ఆసరాగా చేసుకున్నారని పేర్కొంది. రాజస్థాన్‌లోని సికార్‌లో పనిచేస్తున్న ఒక కోచింగ్ నెట్‌వర్క్ ద్వారా కూడా లీకైన ప్రశ్నపత్రాన్ని పెద్ద సంఖ్యలో విద్యార్థులకు పంపిణీ చేశారని తెలిపింది. మే 2వ తేదీ రాత్రి పరీక్షకు ముందు 40 నుంచి 50 మంది విద్యార్థులకు ఒక పీడీఎఫ్ ఫైల్‌ను పంపిణీ చేసినట్లు సీబీఐ పేర్కొంది.