ఘట్‌కేసర్, వెలుగు: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఆదివారం పట్టపగలు దొంగలు రెచ్చిపోయారు. యమ్నంపేట అంబేద్కర్ విగ్రహం సమీపంలోని ఓ ఇంటి తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పోలగోని మధు(66), వినోద(55) దంపతులు ఆదివారం మధ్యాహ్నం ఇంటికి తాళం వేసి పక్కింటికి వెళ్లి తిరిగి వచ్చారు. అప్పటికే ఇంటి గేట్, తలుపు తాళాలు ధ్వంసమై కనిపించాయి. లోపలికి వెళ్లి చూడగా బీరువా తాళం పగులగొట్టి, అందులోని 9 తులాల బంగారు ఆభరణాలు, రూ.50 వేల నగదు ఎత్తుకెళ్లారు. పోచారం పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
