ప్రేమకు అడ్డుగా ఉన్నాడని యువకుడి హత్య..ఆరుగురు అరెస్ట్.. ఆదిలాబాద్ జిల్లాలో ఘటన

ప్రేమకు అడ్డుగా ఉన్నాడని యువకుడి హత్య..ఆరుగురు అరెస్ట్.. ఆదిలాబాద్ జిల్లాలో  ఘటన
  •  నేరడిగొండ మండలంలో రెండు రోజుల క్రితం ఘటన

నేరడిగొండ, వెలుగు : ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలో రెండు రోజుల కింద యువకుడి మర్డర్ మిస్టరీ వీడింది. ప్రేమకు అడ్డుగా ఉన్నాడన్న కోపంతోనే ఓ యువకుడి మరికొందరితో కలిసి ఈ హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. 

కేసుకు సంబంధించిన వివరాలను ఉట్నూర్ ఏఎస్పీ రుత్విక్ సాయి ఆదివారం వెల్లడించారు. నేరడిగొండ మండలంలోని పెద్దబుగ్గారం గ్రామానికి చెందిన నాతరి సతీష్ (23) ఈ నెల 17న కనిపించకుండా పోయాడు. కుటుంబసభ్యులు నేరడిగొండ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. 

19న బోథ్ మండలంలోని కరత్వాడ చెరువులో సతీశ్ డెడ్ బాడీ దొరకడంతో హత్యకు గురైనట్లుగా భావించి దర్యాప్తు ప్రారంభించారు. సతీష్ బోథ్ లో డిగ్రీ చదివే సమయంలో షేక్ సుమేర్ పరిచయం అయ్యాడు. సతీశ్ అమ్మాయిని ప్రేమించగా.. అదే అమ్మాయిని సుమేర్ సైతం ప్రేమించాడు. ఈ విషయం ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో తన ప్రేమకు అడ్డుగా ఉన్న సతీష్ ను హత్య చేయాలని సుమేర్ నిర్ణయించుకున్నాడు. 

ఇందులో భాగంగా సుమేర్ తన స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుందామంటూ సతీశ్​ను కరాత్వాడ చెరువు వద్దకు పిలిపించాడు. అక్కడ మద్యం తాగిన అనంతరం అందరూ కలిసి సతీష్ గొంతు నులిమి హత్య చేశారు. తర్వాత డెడ్ బాడీని చెరువులో పడేసి, అతడి బైక్ ను ఆదిలాబాద్ కు తరలించి, మొబైల్ ను నడుస్తున్న రైలులో పడేశారు.

 చెరువులో డెడ్ బాడీ దొరికిన తర్వాత హత్య కేసుగా నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి విచారణ ప్రారంభించారు. సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీల సాయంతో షేక్ సుమేర్ తో పాటు గంగాధరి సాయికృష్ణ, బొజ్జ విష్ణువర్ధన్, షేక్ అక్రమ్, అబ్దుల్ నెహెఫ్, సయ్యద్ నోమాన్ కలిసి సతీష్ ను హత్య చేసినట్లు గుర్తించి వారిని అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి ఐదు మొబైల్స్, రెండు బైక్ లు స్వాధీనం చేసుకున్నారు.