నస్పూర్, వెలుగు: సింగరేణిలో సాంకేతిక పరిజ్ఞానంతో పారదర్శకంగా బొగ్గు రవాణా జరుగుతోందని, ప్రతీ టన్నుపై ప్రత్యేక పర్యవేక్షణ ఉంటోందని, ఒక్క కిలో బొగ్గు కూడా పక్కదారిపట్టే అవకాశం లేదని మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్ ఏరియా జీఎం మునిగంటి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఆదివారం జీఎం ఆఫీసులో మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవల సింగరేణిలో బొగ్గు మాయమైందని, భారీ స్థాయిలో బొగ్గు చోరీ జరిగిందని వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవమన్నారు. సింగరేణిలో ఉత్పత్తయ్యే బొగ్గులో 85% రైలు మార్గం, 15% రోడ్డు మార్గం ద్వారా వినియోగదారులకు సరఫరా చేస్తున్నామని తెలిపారు.
బొగ్గు ఉత్పత్తి నుంచి వినియోగదారులకు చేరేవరకు ప్రతి దశలో డిజిటల్ పర్యవేక్షణ, భద్రతా తనిఖీలు, ఆన్లైన్ రికార్డింగ్ వ్యవస్థ అమల్లో ఉంటుందని.. పక్కదారి పట్టే అవకాశమే లేదన్నారు. శ్రీరాంపూర్ ఏరియాలో 6 భూగర్భ గనులు, 2 ఓపెన్ కాస్టుల ద్వారా ప్రస్తుతం రోజు 12 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా జరుగుతోందన్నారు.
