- సింగూరులో16 టీఎంసీల నిల్వలను కొనసాగించండి
- ఇరిగేషన్ శాఖ కు వాటర్ బోర్డు లేఖ
హైదరాబాద్ సిటీ, వెలుగు: మంజీరా, సింగూరుల్లో నిల్వలు ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు మాత్రమే సరిపోతాయని, గోదావరిలోనూ అప్పటి వరకే నీళ్లున్నాయని వాటర్బోర్డు ఎండీ అశోక్‌రెడ్డి చెప్పారు. వచ్చే వేసవి వరకు హైదరాబాద్ తాగునీటి భద్రత కోసం సింగూరులో కనీసం 16 టీఎంసీల నిల్వలను కొనసాగించాలని ఇరిగేషన్ అధికారులకు లెటర్రాసినట్టు చెప్పారు.
గ్రేటర్హైదరాబాద్కు తాగునీటిని అందించే ప్రధాన జలాశయాల్లో నీటి లభ్యతపై సోమవారం ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో కృష్ణా, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ద్వారా 2027 జూన్ నెలాఖరు వరకు హైదరాబాద్‌కు తాగునీటి సరఫరా అందించే అవకాశంపై చర్చించారు. జంటనగరాల తాగునీటి సరఫరా, రిజర్వాయర్ల పరిస్థితులను వాటర్బోర్డు ఎండీ అశోక్‌రెడ్డి వివరించారు.
ఈ సందర్భంగా మిషన్ భగీరథ ఈఎన్‌సీ మాట్లాడుతూ సింగూరు క్యాచ్‌మెంట్ పరిధిలో నీటి లభ్యత మరో 45 రోజుల అవసరాలకు మాత్రమే సరిపోతాయన్నారు. సింగూరుపై ఆధారపడిన ప్రాంతాల్లో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ఆల్టర్నేట్ప్లాన్లు సిద్ధం చేయాలని సూచించారు. గోదావరి నుంచి మిషన్ భగీరథకు అదనపు నీటి సరఫరా కోసం పెండింగ్‌లో ఉన్న 4 కిలోమీటర్ల పైప్‌లైన్ పనులను 40 రోజుల్లో పూర్తి చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు.
ఇందుకు అవసరమైన సుమారు రూ.3 కోట్ల నిధుల అంశాన్ని కూడా పరిశీలించాలన్నారు. పనులు పూర్తయిన అనంతరం అదనంగా 40 ఎంజీడీల నీరు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ మిషన్ భగీరథ పరిధిలో బోర్‌వెల్‌ల వద్ద వర్షపు నీటి సంరక్షణ నిర్మాణాలు చేపట్టి భూగర్భజలాల పునర్భరణ పెంచాలని ఆదేశించారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దాన కిశోర్, ఇరిగేషన్ శాఖ కార్యదర్శి శ్రీధర్, మిషన్ భగీరథ కృపాకర్ రెడ్డి ఇంజినీర్-ఇన్-చీఫ్, హైడ్రా కమిషనర్ రంగనాథ్ పాల్గొన్నారు.
