ములుగు, వెలుగు: బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి జిల్లా కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతోపాటు రూ.6వేల జరిమానా, బాధితురాలికి రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని జడ్జి ఎస్వీపీ సూర్యచంద్రకళ తీర్పు ఇచ్చారు. అందుకు సంబంధించిన వివరాలను ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ మీడియాకు వెల్లడించారు. ములుగు జిల్లా కన్నాయిగూడానికి చెందిన కొరగట్ల సత్యనారాయణ అనే వ్యక్తి బాలికపై 2023లో అత్యాచారానికి పాల్పడ్డాడు.
బాధితురాలి కుటుంబ సభ్యులు కన్నాయిగూడెం పీఎస్లో ఫిర్యాదు చేయగా, పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టి చార్జీషీట్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన జడ్జి ఎస్.వీ.పీ సూర్యచంద్రకళ సోమవారం తుదితీర్పు వెలువరించారు. నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతోపాటు రూ.6వేల జరిమానా విధించారు. బాధితురాలికి రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించారు. కేసు దర్యాప్తులో పాల్గొన్న పోలీసు ఆఫీసర్లు, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.
